సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Operation Safed Sagar: కార్గిల్ యుద్ధకథ.. సైనికుడి మనస్తత్వ అధ్యయనం

ABN, Publish Date - Sep 07 , 2026 | 06:30 AM

ఇటీవ‌ల ఓటీటీకి వ‌చ్చిన.. ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ విశ్లేష‌ణ‌.

Operation Safed Sagar

ఆపరేషన్ సఫేద్ సాగర్

నటీనటులు: సిద్ధార్థ్, జిమ్మీ షేర్గిల్, దియా మీర్జా, ప్రజక్తా కోలీ

దర్శకత్వం: ఓనీ సేన్

నిడివి: 5 గంటల 23 నిమిషాలు (ఆరు ఎపిసోడ్లు)

విడుదల: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

యుద్ధ సినిమాలకు ఒక తేలిక ఫార్ములా ఉంటుంది. శత్రువేమో క్రూరుడు, మన సైనికుడేమో మహావీరుడు, జాతీయ జెండా స్లో మోషన్ లో ఎగరడం, నేపథ్య సంగీతాన్ని లక్షల డెసిబెల్స్ వినిపించడం, ప్రేక్షకుడిలో దేశభక్తిని ఉద్వేగంగా మార్చడం. కానీ 'ఆపరేషన్ సఫేద్ సాగర్, ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కార్గిల్ వార్ (Operation Safed Sagar) అలాంటి సులభమైన దారిని ఎంచుకోలేదు. ఆరు ఎపిసోడ్ల నెటిక్స్ సిరీస్ ను కేవలం మరో కార్గిల్ యుద్ధకథగా కాకుండా... సైనికుడి మనస్తత్వ అధ్యయనంగా తీశాడు దర్శకుడు ఓని సేన్.

యుద్ధ చరిత్రలో మనం తేదీలను మాత్రం గుర్తుంచుకుంటాం. ఏ పర్వతాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఎన్ని విమానాలు ఎగిరాయి? ఎవరు గెలిచారు? అన్న లెక్కలను గుర్తుంచుకుంటాం. కానీ ప్రతీ చారిత్రక తేదీ వెనుక కొన్ని ఇళ్లలో గడియారాలు ఆగి పోతాయి. కొన్ని ఫోన్లు మోగవు. కొన్ని కుర్చీలు శాశ్వతంగా ఖాళీగా ఉంటాయి. చరిత్ర వాటిని విజయం అంటుంది. కుటుంబాలు మాత్రం వాటిని లేకపోవడం అని గుడ్లల్లో నీళ్లు కుక్కుకుంటాయి. తెల్లటి మంచు అన్నింటినీ కప్పేస్తుంది. కానీ దుఃఖ చారికలను మాత్రం కప్పలేదు. అదే 'సఫేద్ సాగర్' అంటే తెల్ల సముద్రం.

ఇది కార్గిల్ పర్వతాలను పై నుంచి చూస్తే కనిపించే మంచు అనంతానికి పెట్టిన పేరు మాత్రమే కాదు. ఈ పేరుకు మరో అర్థం ఉంది. కింద భూమి కనిపించదు. మంచు మాత్రమే. శత్రువు స్పష్టంగా కనిపించడు. లక్ష్యం చిన్న బిందువు. ఒక్క చిన్న పొరపాటు ప్రాణానికీ, దేశాల మధ్య దౌత్యానికీ మధ్య ఉన్న గీతను చెరిపేయొచ్చు. అదే ఈ కథలోపలి నైతిక ఉద్వేగం, యుద్ధం చేయాలి. కానీ లైన్ అఫ్ కంట్రోల్ దాటకూడదు. చేతిలో ఆయుధమైతే ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో రాజకీయ నియంత్రణ కూడా ఉంది. శత్రువును ఎదుర్కోవాలి, అదే సమయంలో యుద్ధం పెద్దదయ్యే చర్యలకు పాల్పడకూడదు. ఈ పరిమితి నిజమైన కార్గిల్ వైమానిక ఆపరేషన్లో కీలకమైన అంశం.

ఇది విమానాల కథ కాదు. ఆకాశంలో ఒంటరి యోధుడు తనతో తాను పోరాడుతూ మరోవైపు శత్రువుకు ఆయుధాన్ని గురిపెట్టే కథ. ఊహించనంత ఎత్తులో, పరిమిత ఆయుధ సామర్ధ్యాలతో, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకూడదన్న కఠిన ఆదేశాల మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త వ్యూహాలను పన్నాల్సి వచ్చింది. కనుక ఈ సిరీస్లో శత్రువు పాకిస్తాన్ మాత్రమే కాదు. ఎత్తు. మంచు. సాంకేతిక పరిమితి సమయం. రాజకీయ నియంత్రణ. పైలట్లోని భయం. ఇవన్నీ శత్రువులే.

సిద్ధార్థ్ (Siddharth) హీరోగా కాదు, మనిషిగా స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజాగా ఈ సిరీస్‌కు భావోద్వేగ కేంద్రం. అజయ్ అహూజా మరణం కల్పితం కాదు. 1999 మే 27న అతని విమానం కూలిపోయిన ఘటన కార్గిల్ యుద్ధ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటన. సిద్ధార్థను చూసిన అహుజా కుటుంబ సభ్యులు అచ్చు అహుజాలానే ఉన్నాడని మురిసిపోయారంటే సిద్ధార్థ ఏం సాధించాడో అర్థమవుతుంది. అతడి మరణం ఒక 'వార్ మూవీ డెత్'గా మిగిలిపోదు. మన సన్నిహిత మిత్రుడు అకస్మాత్తుగా అదృశ్యమవడంలా అనిపిస్తుంది.

అజయ్, అల్కా అహూజాల వ్యక్తిగత జీవితంలో చూపించిన కొన్ని చిన్న సంఘటనలు కూడా కల్పన కావు. అల్కా అహూజా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం వారి ప్రేమలోని 'కాఫీ' జ్ఞాపకం, ఇంట్లోని కొన్ని సరదా సంఘటనలు, అజయ్ తన సహచరులను కుటుంబంలా చూసే తీరు వంటి అంశాలకు నిజ జీవిత ఆధారాలున్నాయి. అజయ్ బుక్ చేసిన మారుతీ జెన్ కారును ఆమె 14 ఏళ్లు దాచుకున్నారన్న వివరమూ నిజమే. అందుకే ఈ పాత్రలోని భావోద్వేగం మనకు నాటకీయంగా కాకుండా జీవితంలా అనిపిస్తుంది.

కమాండ్ ధనోవా పాత్రలో జిమ్మీ షేర్గిల్ (Jimmy Shergil) ఈ సిరీస్ కు వెన్నెముక. నాయకత్వమంటే తన భయాన్ని తనలోనే ఉంచుకోవడం. తన మనుషుల భయాన్ని బయటకు రానివ్వడం. ఒక పైలట్ను యుద్ధానికి పంపుతూ, అతడు తిరిగి వస్తాడో లేదో తెలియకపోయినా.. ముఖంలో ఆ అనుమానాన్ని కనిపించనివ్వక పోవడం అనే నిజాన్ని షేర్గిల్ ప్రతీ కవళిక లోనూ చెప్పాడు. సైనికుడి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయంతోనే విమానం ఎక్కడం' అని అతని పాత్ర చెపుతుంది. అభయ్ వర్మ పోషించిన రాజ్ పాల్ సింగ్ ధలివాల్ పాత్ర మొదట్లో కొంచెం అల్లరిచిల్లర తరహా పైలట్ అనిపించవచ్చు.

ప్రతిభ, అతి విశ్వాసం, కొద్దిగా పొగరు అన్నీ కలగలిసి ఉన్న అతని పాత్ర కూడా కల్పితం కాదు. అర్ధరాత్రుళ్లు వైమానిక దళం నిర్వహిం చిన దాడులలో అతని పాత్ర కీలకం. అతడు 2009లో బీదర్ దగ్గర ఒక శిక్షణా ప్రమాదంలో మరణించాడు. అయితే సిరీస్ అతడి వ్యక్తి త్వాన్ని, అంతర్గత సంఘర్షణను, ఆత్మశోధనను లోతైన నాటకీయతగా మార్చింది. ఇది నిజంగా జరిగిన కథేనా? కాదు. అలా అని ఇది నిజ సంఘటనలను తీసుకుని కొత్త కథను తయారు చేయడం కూడా కాదు. దీని మౌలిక చారిత్రక సారం చాలావరకు వాస్తవమే. కల్పన ప్రధానంగా వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంభాషణల్లో, కాక్పెట్లో మాటల్లో, భార్యాభర్తల మధ్య సన్నివేశాల్లో, పైలట్ల సరదాలు, ప్రేమకథల వివరణ, సంఘటనలను ఒకదానితో ఒకటి కలపడానికి ఉపయోగించిన సందర్భాలలో ఉంది. ఇదంతా తెరానువాద చమత్కారం.

తాజా భారతీయ యుద్ధ సినిమాల్లో దేశభక్తి చాలాసార్లు శత్రుదేశం మీద ద్వేషం రూపంలో వ్యక్తమవుతోంది. 'సఫేద్ సాగర్ అది కాదు. ఆ అతి లేకుండా యుద్ధభూమిని చూపించడం చాలా కష్టమైన పనే. ఎందుకంటే నిజమైన సైనికుడికి యుద్ధం ఒక సోషల్ మీడియా నినాదం కాదు. కనుకనే సఫేద్ సాగర్ యుద్ధాన్ని ఉత్కర్షకు తీసుకువెళ్లడం కన్నా, యుద్ధంలో పనిచేసే మనుషులను గౌరవించడానికి చేసిన ఓ మంచి ప్రయత్నం.

  • ప్ర‌సేన్‌ 70133 58154

Updated Date - Sep 07 , 2026 | 06:41 AM