సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lenin Pandiyan Review: ఒక మేక మరణం.. ఇద్దరి ఆత్మగౌరవ పోరాటం.. ‘లెనిన్ పాండ్యన్’ ఎలా ఉందంటే?

ABN, Publish Date - Nov 15 , 2026 | 11:16 AM

గంగై అమరన్, దర్శన్ గణేశన్ నటించిన తమిళ చిత్రం లెనిన్ పాండ్యన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కథ, నటీనటుల ప్రదర్శన, సినిమా విశ్లేషణ చదవండి.

Lenin Pandiyan Review

లెనిన్ పాండ్యన్ (తమిళం)

నటీనటులు: గంగై అమరన్, దర్శన్ గణేశన్, రోజా, జార్జ్ మరియన్ తదితరులు

దర్శకత్వం: డి.డి. బాలచంద్రన్

నిడివి: 141 నిమిషాలు

ఒక మేక మరణం నుంచి మనిషి ఆత్మగౌరవం దాకా.. న్యాయం కోసం నడిచే రెండు జీవితాల విషాద గమనం లెనిన్ పాండ్యన్ (Lenin Pandiyan). ఒక మేక ఇసుక మాఫియా లారీ కిందపడి చనిపోతుంది. దాని కోసం ఒక ముసలివాడు ఏడుస్తాడు. ఆ ఏడుపును వ్యవస్థ అపహాస్యం చేస్తుంది. ఆ అపహాస్యాన్ని ఆయన అవమానంగా భావిస్తాడు. ఆ అవమానాన్ని ప్రశ్నగా మార్చి న్యాయస్థానం మెట్లెక్కుతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది చనిపోయిన మేకకు, న్యాయం కావాలనుకునే మనిషికీ, బతికున్న మనుషులకే న్యాయం అందించలేని వ్యవస్థకీ మధ్య సంఘర్షణ.

ఈ సినిమాలో ఉపకథ మరవర్మన్ సుందర పాండ్యన్‌ది. దర్శన్ గణేశన్ పోషించిన యువ పోలీసు కానిస్టేబుల్ పాత్ర అది. తండ్రి మరణంతో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన కారణంగానే అతడిని సహోద్యోగులు 'కరుణై' అని ఎద్దేవా చేస్తుంటారు. అది కేవలం ఒక ముద్దు పేరు కాదు. అతడి వ్యక్తిత్వాన్ని నిరంతరం గాయపరిచే సామాజిక ముద్ర. తన సామర్థ్యంతో కాక, ఎవరో చనిపోవడం వల్ల ఉద్యోగం వచ్చిందనే అవమానం అతడిని వెంటాడుతుంటుంది. తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నంలోనే మరింత అభద్రతకు గురవుతుంటాడు. దురైరసు ఒక సాధారణ రైతు. ఆయన జీవితంలో భార్య సంధానం, వ్యవసాయం, తాను ప్రేమగా పెంచుకునే మేక మీనాక్షి భాగాలు. మీనాక్షి కేవలం పెంపుడు జంతువు కాదు. మనిషి ఒంటరితనాన్ని పంచుకున్న ఒక జీవి. తన ప్రేమను నిక్షిప్తం చేసుకున్న ఒక ప్రాణి. మీనాక్షి మరణాన్ని దురైరసు ఒక సాధారణ ప్రమాదంగా అంగీకరించడు. న్యాయం కోరుతాడు. ఆయన ఫిర్యాదు అధికార వ్యవస్థ నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటుంది. ఇసుక మాఫియాను ప్రశ్నించే గ్రామ రెవెన్యూ అధికారి హత్యకు గురి కావడంతో ఈ సంఘర్షణ మరింత తీవ్రమవుతుంది.

చివరకు దురైరసు న్యాయపోరాటం కోర్టుకు చేరుతుంది. దురైరసుకు భద్రత ఇచ్చే బాధ్యతను కోర్టు పాండ్యన్‌కు అప్పగిస్తుంది. దర్శకుడు రెండు భిన్నమైన వ్యక్తిత్వాలను ఒకే కథలో కలిపాడు. దురైరసు ఎదుర్కొనే అవమానం బయటిది. పాండ్యన్ ఎదుర్కొనే అవమానం తన లోపలిది. ఒకరు వ్యవస్థ తనను గౌరవించాలని కోరుకుంటారు. మరొకరు తనను తాను గౌరవించుకోగల స్థితిని వెతుక్కుంటారు. ఇది న్యాయం కోసం పోరాడే మనిషి కథ మాత్రమే కాదు. తాను న్యాయానికి అర్హుడినని నిరూపించుకోవాల్సి వచ్చిన మనిషి విషాదం. ఈ రెండింటి మధ్య చాలా పెద్ద అంతరం ఉంది. న్యాయం అడగ డం ఒక హక్కు. న్యాయం అడగడానికి తనకు అర్హత ఉందని నిరూపించుకోవడం ఒక అవమానం. ఈ అవమానమే సినిమాకు అంతర్లీనమైన భావోద్వేగ కేంద్రం.

మేక చనిపోతే అంత ఏడవాలా? అది ఈ సినిమా పొడవునా వినపడే ప్రశ్న. ఈ ప్రశ్నలోనే నాగరికత క్రూరత్వం దాగి ఉంది. మనిషి దుఃఖానికి కూడా సమాజం ఒక స్థాయిని నిర్ణయిస్తుంది. ఎవరి మరణానికి ఎంత ఏడవాలో, ఏ నష్టానికి ఎంత పరిహారం కోరాలో, ఎవరి బాధను ఎంతవరకు గుర్తించాలో అధికారం నిర్ణయిస్తుంది. దురైరసు ఆ నిర్ణయాన్ని అంగీకరించడు. ఆయనకు మీనాక్షి ఒక ఆస్తి కాదు ఒక అనుబంధం. అవమానం అనేది కనిపించని సామాజిక హింస అనే విషయం చాలామందికి తెలియదు. సమాజం చేసే అవమానం ఎప్పుడూ ఒకే రూపంలో ఉండదు. కొన్నిసార్లు అది పోలీసు స్టేషన్‌లో వినిపించే హేళన. మరికొన్నిసార్లు మనసులో నిరంతరం వినిపించే ఆత్మన్యూనతా స్వరం. బయటివాళ్లు మనల్ని అవమానించడం ఒక హింస. ఆ అవమానాన్ని మన వ్యక్తిత్వంలో భాగంగా స్వీకరించడం తీవ్రమైన హింస. పాండ్యన్ పాత్ర ఈ రెండో హింసకు ప్రతినిధి.

ఈ కోణంలో సినిమా ఆత్మగౌరవాన్ని కేవలం సామాజిక హక్కుగా కాకుండా మానసిక విముక్తిగా కూడా ప్రతిపాదిస్తుంది. లెనిన్ పాండ్యన్ (Lenin Pandiyan) అనే పేరు గురించి తప్పకుండా మాట్లాడాలి. 'లెనిన్' అనే పేరు వర్గ పోరాటాన్ని, దోపిడీ వ్యతిరేక రాజకీయాలకు గుర్తు. 'పాండ్యన్' అనే పేరు తమిళ సాంస్కృతిక చరిత్రకు, ప్రాంతీయ అస్తిత్వానికి గుర్తు. ఒక వైపు వర్గ చైతన్యం. మరొకవైపు ప్రాంతీయ సామాజిక అస్తిత్వం. వీటి మధ్య వ్యక్తి ఆత్మగౌరవం. కథలో వర్గ దోపిడీ ఉంది. అధికార అసమానత ఉంది. వ్యక్తిగత అవమానం ఉంది. జార్జ్ మరియన్ (George Maryan) పోషించిన న్యాయమూర్తి భీమారావు పాత్ర చట్టానికి ఒక మానవ ముఖం, శారీరక రూపాన్ని బట్టి మనుషులను అంచనా వేయడం ఎంత అన్యాయమో, విద్య మనిషికి ఎంత గొప్ప ఆత్మగౌరవాన్ని అందిస్తుందో ఈ పాత్ర ద్వారా చెపుతాడు దర్శకుడు. చట్టం ముందు అందరూ సమానులని చెప్పడం సులభం. చట్టం దగ్గరకు చేరుకునే అవకాశం అందరికీ సమానంగా ఉందా అని ప్రశ్నించడం అసలైన ప్రజాస్వామిక స్పృహ.

అయితే న్యాయం అంటే ఏమిటి? నేరస్థుడిని శిక్షించడమా? బాధితుడికి పరిహారం అందించడమా? అవమానానికి గురైన వ్యక్తికి గౌరవాన్ని తిరిగి ఇవ్వడమా? లేక అలాంటి అవమానాలు పునరావృతం కాని సమాజాన్ని నిర్మించడమా? సినిమా మొదటి మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. నాలుగో ప్రశ్న దగ్గర ఆగిపోతుంది. అదే దాని రాజకీయ పరిమితి. మరణానికి పరిహారం ఉండొచ్చు. అవమానానికి పరిహారం ఏమిటి? ఈ ప్రశ్న దగ్గర 'లెనిన్ పాండ్యన్' ఒక సాధారణ సామాజిక చిత్రంగా కాకుండా, మనిషి అస్తిత్వానికి సంబంధించిన తాత్విక చర్చగా మారుతుంది. సినిమా ముగుస్తుంది. కానీ ఆ ముసలివాడి ప్రశ్న ముగియదు. ఎందుకంటే ఆయన అడిగింది తన మేకకు మాత్రమే న్యాయం కాదు. ఈ భూమ్మీద తన ప్రేమకు, తన దుఃఖానికి, తన ఉనికికి కూడా ఒక విలువ ఉందని గుర్తించమని.

ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రధారి దర్శన్ గణేశన్ (Dharshan Ganesan) జెమినీ గణేశన్ మనవడు. కానీ అతనెక్కడా బ్లడ్డూ బ్రీడు అని తొడలు కొట్టకపోవడం విశేషమే. మ్యాస్ట్రో ఇళ‌య రాజా (Ilaiyaraaja) సంగీతం, గ్రామీణ సాధార‌ణ మ‌హిళ‌గా డీ గ్లామ‌ర్ రోల్‌లో మాజీ మంత్రి రోజా సెల్వ‌మ‌ణి (Roja Selvamani) న‌ట‌న ఈ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. - ప్ర‌సేన్‌, 70133 58154

Updated Date - Nov 15 , 2026 | 11:24 AM