Goat Movie Review: సుడిగాలి సుధీర్ గోట్ మూవీ రివ్యూ
ABN, Publish Date - Nov 12 , 2026 | 03:19 PM
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమా నవంబర్ 12న విడుదలైంది. బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథ, కథనం, నటీనటుల పనితీరు ఎలా ఉన్నాయి? మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్‌కు బుల్లితెర కలిసి వచ్చినట్టుగా వెండితెర కలిసిరాలేదు. అతను హీరోగా నటించిన ఏ సినిమా కూడా ఇంతవరకూ ఘన విజయాన్ని అందుకోలేదు. అయితే చిత్రంగా అతనితో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతూనే ఉన్నారు. కానీ సరైన ప్లానింగ్ లేని కారణంగా సుధీర్ చిత్రాల విడుదలలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. అలా లేటుగా జనం ముందుకు వచ్చిన సినిమా 'గోట్'. వేదవ్యాస్ దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12న రిలీజ్ అయ్యింది.
'గోట్' పేరుతో ఆ మధ్య విజయ్ ఓ తమిళ సినిమా చేశారు. అలానే 'ది గోట్ లైఫ్' పేరుతో పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ చిత్రం చేశారు. సో... ఇది సుధీర్ నటించిన తెలుగు 'గోట్' అనుకోవాలి. మూవీ ట్యాగ్ లైన్ లో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అని చెప్పారు కానీ సినిమాలో 'గోదావరి అవుట్ డోర్ యాక్టివిటీస్ ట్రస్ట్' అర్థంలో దీనిని వాడారు. కోనసీమలోని రుద్రవరం గ్రామంలో వెంకట కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) బాగా పేరున్న పెద్దమనిషి. క్రికెటర్ కూడా. కోడి పందాలు, ఎడ్ల పందాలను జూదంగా మార్చేసిన జనం చివరకు క్రికెట్ ఆటకూ బెట్టింగ్ మొదలు పెట్టడంతో ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. యేడాదిలో రెండు రోజులు మాత్రమే ఎవరైనా బెట్టింగ్ ఆడాలనే నియమం పెడతాడు. 'గోట్'కు నేతృత్వంలో ఆ పోటీలు జరుగుతుంటాయి. దానికి ఛైర్మన్ గా ఉన్న కృష్ణంరాజును కుట్రపన్ని పదవినించి తొలగిస్తాడు మొద్దు బాబ్జీ. అంతేకాదు... అప్పటి వరకూ ఉన్న నిబంధనను తుంగలో తొక్కి ఊరి జనాన్ని బెట్టింగ్ వ్యవసనానికి గురిచేస్తాడు. అలాంటి మొద్దు బాబ్జీకి కృష్ణంరాజు మనవడు గణ (సుడిగాలి సుధీర్) ఎలా బుద్ధి చెప్పాడు? తాతగారి గౌరవాన్ని ఎలా కాపాడాడు? అనేది ఈ సినిమా కథ.
బెట్టింగ్ అనేది ఇవాళ సర్వవ్యాప్తి అయిపోయింది. స్పోర్ట్స్, ఎలక్షన్స్ తో పాటు చిన్న, పెద్ద అంశాలన్నింటిలో బెట్టింగ్ చోటు చేసుకుంటోంది. ఇక ఆన్ లైన్ బెట్టింగ్ తో అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు అనేకమంది. తన గ్రామ ప్రజలు అలాంటి బాధలు పడకుండా ఓ పెద్దాయన తీసుకున్న నిర్ణయం చుట్టూ 'గోట్' కథ సాగింది. అయితే దానిని ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ వేదవ్యాస్ విఫలమయ్యారు. గ్రామం, గ్రామ రాజకీయాలు, అక్కడి ప్రజల బలహీనతల చుట్టూ ఓ గిరి గీసుకుని తమకు అనుకూలమైన విధంగా కథను రాసుకున్నారు. హీరోయిన్ సుభాషిణి (దివ్య భారతి) చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పినా... ఆమె పాత్రను సరైన రీతితో ప్రెజెంట్ చేయకపోవడంతో ఆ పాత్ర తాలుకూ భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అలానే తాత పేరు నిలబెట్టాల్సిన మనవడు, ఆయనకు దూరంగా వెళ్ళిపోయి అనామకుడిగా బతకడం, అతన్ని హీరోయిన్ తిరిగి ఊరికి తీసుకురావడం వంటి సన్నివేశాలు కన్వెసింగ్‌గా లేవు. హీరోయిన్‌ను కిడ్నాప్ చేసే డ్రామా ఓ మేరకు బాగానే పండింది. దానికి నేపథ్యంగా వాడుకున్న 'శంభో శివ శంభో' చిత్రం టైటిల్ సాంగ్ బాగా సెట్ అయ్యింది. అయితే హీరోయిన్ కు సూసైడ్ టెండెన్సీ వ్యవహారాన్ని దర్శకుడు మరీ సాగదీయడం చికాకు పుట్టిస్తుంది. పతాక సన్నివేశం సైతం ప్రిడిక్టబుల్‌గా ఉంది. దాంతో ఇంకా సినిమా పూర్తి కాదేమిటనే అసహనానికి ప్రేక్షకులు లోనవుతారు.
నటీనటుల విషయానికి వస్తే... సుడిగాలి సుధీర్ కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ ఎప్పుడూ మరో లెవల్‌లో ఉంటాయి. ఇందులోనూ వాటికి తిరుగులేదు. అయితే అతన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది. అతను హీరో మెటీరియల్ అనిపించడం కోసం పోరాట సన్నివేశాలనూ బాగానే డిజైన్ చేశారు. హీరోయిన్ దివ్య భారతికి ఇదే మొదటి తెలుగు సినిమా. ప్రత్యేకంగా ఆమెను తమిళనాడు నుంచి ఎందుకు తెచ్చారో అర్థం కాదు. కొన్ని సన్నివేశాల్లో చలాకీగానూ, కొన్ని సన్నివేశాల్లో డీలాగానూ కనిపించింది. బహుశా షూటింగ్ ఎక్కువ రోజులు జరగడం వల్ల కావచ్చు. సినిమాలో ప్రధాన పాత్రధారి 'సిరివెన్నెల' ఫేమ్ సర్వదమన్ బెనర్జీ.ఈ మధ్య కాలంలో ఆయన ఇలాంటి పాత్రలు బాగానే చేస్తున్నారు. ఇందులో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది మొట్ట రవీంద్రన్ అనే చెప్పాలి. ఇతర పాత్రలను నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీరాజ్, ఆనంద రామరాజు, చమ్మక్ చంద్ర, ఆడుకాలమ్ నరేన్, పమ్మి సాయి, నవీన్ నేని తదితరులు పోషించారు. చిన్న పాత్రలకు కూడా కాస్త గుర్తింపు ఉన్నవారిని తీసుకున్నారు కానీ వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చితే, ఓ పాటతో పాటు మణిశర్మ నేపథ్యం సంగీతం అందించారు. ఆయన ఎక్స్ పీరియన్స్ సినిమాలో బాగానే వినిపించింది. రూసూల్ ఎల్లోర్‌తో పాటు సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ చేశారు. చాలానే సన్నివేశాలు ఎడిటింగ్‌లో పోయిన భావనైతే సినిమా చూస్తుంటే ఆడియెన్స్ కు కలుగుతోంది. ఏది ఏమైనా... నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ రాజీ పడకుండా 'గోట్' మూవీని తీశారు. కానీ అది ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మాత్రం లేదు.
రేటింగ్ : 2.25/5
ట్యాగ్‌లైన్: గోట్... సుడిగాలికే!
ALSO READ:
Rahul gowlikar: ఐడీల జారీలో జాప్యం లేదు.. సెన్సార్ సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తాం!
Censor Issue: చివరి నిమిషంలో టైటిల్ మార్చాలా? నిర్మాతలకు కోట్ల నష్టం తప్పదా?
Anil Ravipudi: ఓవర్సీస్‌లో అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. సందడే సందడి..