'డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుట లేదు' సిరీస్ రివ్యూ
ABN, Publish Date - Feb 27 , 2026 | 10:03 AM
రాజీవ్ కనకాల ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఈ మధ్య ఆయన నటించిన సిరీస్ అన్నీ చక్కని ఆదరణ పొందాయి. తాజాగా ఆయన కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు’.
వెబ్ సిరీస్ రివ్యూ: 'డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు'
స్ట్రీమింగ్ ఓటిటి: జీ5
డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రాజీవ్ కనకాల ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. ఈ మధ్య ఆయన నటించిన సిరీస్ అన్నీ చక్కని ఆదరణ పొందాయి. తాజాగా రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో రాజీవ్ కు కూతురిగా ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’తో ఆకట్టుకున్న వసంతిక నటించింది. ఉదయభాను, గాయత్రి భార్గవి, జెమిని సురేశ్ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ ను వి.శ్రీరామ్ నిర్మించారు. ఆరు ఎపిసోడ్స్ తో జీ5 ఓటీటీ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ, రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
కథ:
ప్రసాదరావు (రాజీవ్ కనకాల) నెల్లూరు సమీపంలోని ఓ ఊరిలో పేరున్న వ్యాపారి. తనకొక కూతురు స్వాతి (వసంతిక). ఒకటే బిడ్డ కావడంతో అల్లారుముద్దుగా పెంచుతాడు. ఆమెకు తండ్రి అంటే భయం. ఏదీ ధైర్యంగా చెప్పలేదు. కష్టపడి చదివి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తుంది. ‘చదువు జ్ఞానం కోసమే కానీ అమ్మాయి జాబ్ చేయాల్సిన అవసరం లేదని’ ప్రసాదరావు హైదరాబాద్ పంపడానికి నిరాకరిస్తాడు. ఏదోలా తండ్రిని ఒప్పించి జాబ్ లో జాయిన్ అవుతుంది. భవానీ (గాయత్రి భార్గవి) నడిపే హాస్టల్ లో చేరుతుంది స్వాతి. తండ్రి అన్ని జాగ్రత్తలు చెప్పి హాస్టల్ లో వదిలి వెళ్తాడు. నెల తర్వాత తొలి జీతాన్ని తండ్రి చేతిలో పెట్టాలని ఎంతో ఆశగా ఆఫీస్ కి వెళ్ళి హాస్టల్ కి డల్ గా వస్తుంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కంగారుపడ్డ తండ్రి హైదరాబాద్ వచ్చి కూతురు మిస్ అయిందని తెలిసి హాస్పిటల్ పాలవుతాడు. స్వాతి మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీ గా మారుతుంది. ఈ కేస్ డీల్ చేయడానికి రెబెకా జోసెఫ్ (ఉదయభాను) రంగంలోకి దిగుతుంది. స్వాతి మరణానికి కారణమేంటి? హాస్టల్లో స్వాతికి ఎదురైన సమస్యలు ఏమిటి? ఆమె మరణం వెనుక ఉన్న రహస్యం బయటపడిందా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ:
బిడ్డను ఎంతో ప్రేమించే తండ్రి, తండ్రి పట్ల గౌరవం, భయం ఉన్న కూతురు మధ్య బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దీనికి మిస్సింగ్, మర్డర్ మిస్టరీని జోడించి రూపొందించారు. ప్రసాదరావు ప్లాష్ బ్యాక్ తో కథ మొదలువుతుంది. కొన్ని సీన్స్ తర్వాత స్వాతి మరణం, మర్డర్ మిస్టరీ గా మారుతుంది. ఉదయభాను ఈ కేసును ఛేదించే క్రమంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రారంభం నుంచీ ఎంగేజింగ్ గా సస్పెన్స్ తో మలుపులు తిరుగుతూ ఊహకు అందకుండా సాగుతుంది. తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్లో లాజిక్కులు మిస్ అయి కొంచెం బోర్ కూడా కలిగిస్తుంది. తనది నేచురల్ డెత్ అని పోలీసుల తేల్చినా…. ఇన్ వెస్టిగేషన్ చేసిన ఉదయభాను అనుమానం నిజమై స్వాతి మరణానికి కారణమేంటన్నది డైరీ ద్వారా తెలుస్తుంది. తండ్రి చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే స్వాతి మరణం వెనక ఉన్నది ఎవరో చెప్పిన ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సీన్ కి… స్వాతి మరణానికి ఏదో సంబంధం ఉందని ఊహించినా.. ఆ ఊహ రాకుండా దర్శకుడు మ్యాజిక్ చేశాడు. ట్విస్టు బావున్నా, చిన్నప్పటి చిన్న ఇష్యూ... మర్డర్ కు కారణం అన్నది కన్వెన్స్ చేసేలా లేదు. ఏది ఎలా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రీగా ఉండాలి... తమ ఆలోచనలు, కష్టసుఖాలను ధైర్యంగా పంచుకోగలిగే స్వేచ్ఛనివ్వాలి అనే సందేశం మాత్రం బాగుంది.
నటీనటులు పనితీరు..
ప్రసాదరావుగా, బాధ్యత గల తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. ఇటీవల ఆయన ఎంచుకుంటున్న పాత్రలు వినూత్నంగా ఉంటున్నాయి. ఆయన అనుభవం ఈ సీరీస్ కు ఉపయోగపడిందనే చెప్పాలి. స్వాతి పాత్రకు వసంతిక పర్ఫెక్ట్ యాప్ట్. తండ్రి మీద ప్రేమను ఎంతగా చూపించిందో.. మానసికంగా నలిగిపోతున్న సమయంలోనూ అంతే బాగా నటించింది. హాస్టల్ వార్డెన్ గా భార్గవి మెప్పించింది. నటనలో వేరియేషన్స్ చూపించింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ రెబెకా పాత్రలో ఉదయభాను ఒదిగిపోయింది. ఆమెకు దొరికిన మంచి పాత్ర ఇది. ఇతర పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు నటించారు. మహేశ్ కుమార్ సినిమాటోగ్రఫీ బావుంది. సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. సన్నివేశాన్ని బట్టి నేపథ్య సంగీతం కథను నడిపించేలా ఉండాలి. అలా ఈ సినిమాకు శ్రీరామ్ సంగీతం ప్లస్ అయింది. ఆరు ఎపిసోడ్స్ ను కొంచెం ఎడిట్ చేసి ఐదుగా కుదించి ఉంటే ఇంకా క్రిస్పీ గా సాగేది. మాటలు బావున్నాయి. దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే రివేంజ్ డ్రామాను ఇంకా బలంగా రాసుకుని ఉంటే ఇంకా బావుండేది. చివర్లో ఇచ్చిన మెసేజ్ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం.
ట్యాగ్ లైన్: మెప్పించే ‘డాటర్ ఆఫ్ ప్రసాదరావు’
రేటింగ్: 2.75 / 5