సినిమా రివ్యూ: దీవానా
ABN , Publish Date - Jun 19 , 2026 | 11:30 PM
సమంత నిర్మించిన 'శుభం’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డి, నూతన నటి స్మేహ మణిమేఘలై జంటగా నటించిన చిత్రం 'దీవానా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సినిమా రివ్యూ: దీవానా
విడుదల తేది: 20–6–2026
సమంత నిర్మించిన 'శుభం’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రెడ్డి, నూతన నటి స్మేహ మణిమేఘలై జంటగా నటించిన చిత్రం 'దీవానా’. నూతన దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి దీన్ని తెరకెక్కించారు. వాసుదేవ్ కొప్పినేని. శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ నెల 19 విడుదల కావలసిన ఈ చిత్రం ఓ రోజు ఆలస్యంగా గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ప్రీమియర్స్ వేయమని సూచించడం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. స్నేహం, ప్రేమ ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
మున్నా (హర్షిత్ రెడ్డి) హైదరాబాద్‌లో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ యువకుడు. తల్లిదండ్రులు నరేశ్, ఝాన్సీ మధ్య తరగతికి చెందిన వారు కావడంతో కుర్రాడు మంచి స్థాయికి చేరాలని కోరుకుంటారు. కానీ మున్నా మాత్రం అల్లర్లు గొడవలతో లక్ష్యం లేకుండా తిరుగుతాడు. అలాంటి కుర్రాడికి ఈ -సేవలో పని చేసే అమూల్య (స్నేహ మణిమేఘలై) తారసపడుతుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆమెను చూడటానికి ఈ-సేవకు వెళ్లి సైట్ కొడుతుంటాడు. అతన్ని గమనిస్తున్న అమూల్య గవర్నమెంట్ జాబ్ సంపాదించి కనిపించు అప్పుడు ప్రేమ గురించి ఆలోచిస్తాను.. అప్పటిదాకా నా కంటికి కనిపించకు అని కండీషన్ పెడుతుంది. అంతవరకూ ఏ లక్ష్యం లేకుండా ఉన్న మున్నా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. సన్నిహితుల సలహా మేరకు ఎస్‌ఐ ట్రైనింగ్‌కు వెళ్తాడు. ఫైనల్ టెస్ట్‌కు వెళ్తున్న సమయంలో అతనంటే పడని వారు మున్నాతో గొడవకు దిగుతారు. ఈ నేపథ్యంలో మున్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడా? అమూల్యకు దగ్గరయ్యాడా? అన్నది మిగతా కథ.
విశ్లేషణ
ఏ లక్ష్యం లేకుండా బస్తీలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే కథ ఇది. ఫస్టాఫ్ అంతా హీరో ఎంట్రీ, స్నేహితులు, గల్లీ గొడవలు, అందమైన అమ్మాయి తారసపడటం, ప్రేమలో పడటం, ఆమె కోసం ఆఫీసు చుట్టూ తిరగడం, అప్పుడప్పుడు తల్లిదండ్రులతో ప్రేమతో కూడిన తిట్లతో సరదాగా సాగిపోతుంది. అయితే ఇందులో అపోజిట్ బ్యాచ్‌తో గొడవలు, హీరోయిన్ చుట్టూ తిరిగే సీన్లు సాగతీతగా అక్కడక్కడే నడిచినట్లు అనిపిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఇంటర్వల్‌కి హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మలుపు తిప్పుతుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది రివీల్ చేస్తే సస్పెన్స్ మిస్ అవుతుంది. ఎమోషనల్‌గా సాగే ఈ సన్నివేశాన్ని తెరపైన చూస్తేనే కిక్కు. ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో లక్ష్యం వైపు పరుగులు తీయడం, ప్రేమను గెలిపించుకోవడానికి కష్టపడడంతో సాగుతుంది. సినిమా ప్రారంభంలో ఇది రొటీన్ లవ్‌స్టోరీనే అనిపిస్తుంది. కానీ సెకెండాఫ్‌కు వెళ్లగానే ఇందులో ఇంటి పెద్దల ఎమోషన్స్, అండగా నిలబడే స్నేహితులు, చుట్టుపక్కలవారి సాయం, చక్కని ప్రేమకథను మిళితం చేసి దర్శకుడు ఓ ఎమోషనల్ రైడ్‌లా తీర్చిదిద్దారు. మంచికి మంచే సాయపడుతుందనే సందేశాన్ని లాయర్‌గా నటించిన వేణు యెల్దండి, తండ్రి తన బిడ్డల కోసం ఎంతగా కష్టపడతాడో రఘు కారుమంచి పాత్రతో చెప్పడం ఆకట్టుకుంటుంది. స్నేహితులు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవసరానికి మేమే అండ అని స్నేహితుల పాత్రతో చెప్పించడం ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్‌ల మధ్య భావోద్వేగ సన్నివేశాలతో గుండె బరువెక్కించాడు దర్శకుడు. ఇక్కడ కొన్ని విషయాలు రివీల్ చేయకపోవడమే మంచిది. వాటిని తెరపైనే చూడాలి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు
మున్నాగా హర్షిత్ నటన సినిమా ప్రారంభంలో ఓవర్ రియాక్ట్ అయిన భావన కలుగుతుంది. కథలోకి వెళ్లిన కొద్దీ అతని నటన మెప్పించింది. తెలంగాణ యువకుడిగా మంచి ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ గల్లీ కుర్రాడిగా మున్నా పాత్ర ఈతరం యువతను మెప్పించే అవకాశం ఉంది. ఇందులో కొన్ని డైలాగ్స్ వింటుంటే 'అర్జున్‌రెడ్డి'లో విజయ్ దేవరకొండ పాత్ర గుర్తొస్తుంది. కానీ ఈ కథకు దానికి సంబంధం లేదు. హీరోయిన్‌గా పరిచయమైన స్మేహ మణిమేఘలై అద్భుతమైన నటన కనబర్చింది. అమ్ము పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్‌లో కంట తడి పెట్టించింది. ఆమె స్నేహితురాలిగా నటించిన సింధు కూడా ఆకట్టుకుంది. హీరోకి స్నేహితులుగా కనిపించిన కుర్రాళ్లు ఇద్దరు కూడా ఈతరం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటారు. హీరోకి తల్లిదండ్రులుగా నరేశ్, ఝాన్సీ న్యాయం చేశారు. రఘు కారుమంచి, 'బలగం' వేణు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమాను గల్లీల్లో ఎక్కువగా తెరకెక్కించారు. కథకు తగ్గట్టు వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ కుదిరింది. ఈశ్వర్ చంద్ర సంగీతం సినిమాకు ఎసెట్ అయింది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉండాల్సింది. ఎడిటర్ హృషికేశ్ ఫస్ట్ హాప్‌ను కాస్త ట్రిమ్ చేసి ఉండొచ్చు. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడి కథ, కథనం ఆకట్టుకున్నాయి. థియేటర్‌లో కూర్చునప్పుడు ఈ కథ సాధారణ లవ్‌స్టోరీనే అనిపిస్తుంది. కానీ ఈ కథకు స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రి బాధ్యత వంటి అంశాలను జోడించి ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. చక్కని సందేశం కూడా ఇచ్చాడు. జెన్ జీలకు ఈ సినిమా ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమాను కొంతవరకూ ఎంజాయ్ చేయవచ్చు.
ట్యాగ్‌లైన్: దిల్ దీవానా
రేటింగ్: 2.5/5
ఇవి కూడా చదవండి:
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు
Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
హాజరు కావాల్సిందే.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు