బా బా బ్లాక్‌ షీప్‌ మూవీ రివ్యూ

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:17 PM

గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మించిన బా బా బ్లాక్ షీప్‌ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ న్యూ ఏజ్ క్రైమ్‌ డ్రామాలో ఉపేంద్ర లిమాయే, అక్షయ్‌, విష్ణు ఓయ్‌, విస్మయశ్రీ, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

Baa Baa Black Sheep Movie

అదర్ లాంగ్వేజ్‌ హీరోయిన్లే కాదు... క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం తెలుగు సినిమాల్లో ఈ మధ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శుక్రవారం విడుదలైన 'బా బా బ్లాక్‌ షీప్‌' మూవీలో మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయే, బాలీవుడ్ నటుడు టీనూ ఆనంద్‌, తమిళ నటుడు జార్జ్‌ మరియన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన మాల్వీ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. తెలుగువాళ్ళైన అక్షయ్‌ లఘుసాని, విష్ణు ఓయ్‌, విస్మయశ్రీ,, సమృద్ధి ఆర్యల్‌, కార్తీకేయ దేవ్, అభినవ్‌, రాజా రవీంద్ర కీ-రోల్స్ చేశారు. గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మించిన ఈ న్యూ ఏజ్‌ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

భారతదేశానికి చెందిన ఓ ప్రతిష్ఠాత్మక కాంట్రాక్ట్ ను సంపాదించడం కోసం ముఖేశ్‌ వర్ధన్‌ (కె.ఎల్. దామోదర ప్రసాద్‌), ఆదిత్య మెహ్రా (అనీశ్‌ కురివిల్లా) పోటీ పడతారు. కేంద్రంలోని పెద్దాయనను మెప్పించడానికి ఓ వస్తువును ఆయనకు ఇస్తే సెంటిమెంట్‌ ఫీల్‌ అయ్యి, కాంట్రాక్ట్ తమకే ఇస్తాడని ముఖేశ్‌ కు మూర్తి (శుభలేఖ సుధాకర్‌) సలహా ఇస్తాడు. తమకు కావాల్సిన ఆ వస్తువు మేఘాలయాలోని చిరపుంజీలో జోషీ అనే ఓల్డ్ గాడ్‌ ఫాదర్‌ (టీనూ ఆనంద్‌) దగ్గర ఉందని తెలుస్తుంది. దాన్ని సంపాదించే పనిని గ్యాంగ్‌స్టర్‌ జాన్‌ షెల్లీ హిట్లర్‌ (ఉపేంద్ర లిమాయే)కు మూర్తి అప్పగిస్తాడు. ఆ వస్తువు కోసం చిరపుంజీకి వెళ్ళిన జాన్‌... జోషీ నుంచి ఆ వస్తువును పొందుతాడు.


అదే సమయంలో చిరపుంజీలో సత్తి పండు (విష్ణు ఓయ్‌) పెళ్ళి మేరి (సమృద్ధి ఆర్యల్‌)తో చర్చిలో జరగాల్సి ఉంటుంది. దానికి ఒకరోజు ముందు రాత్రి సత్తిని సర్ ప్రైజ్‌ చేయాలని ఫ్రెండ్స్ సందీప్‌ (అక్షయ్‌ లఘుసాని), జాహ్నవి (విస్మయశ్రీ) అతన్ని కిడ్నాప్ చేసి నైట్ పార్టీకి తీసుకెళతారు. అక్కడి నుంచి తిరిగి వస్తుంటే పోలీసులు వీళ్ళను వెంబడిస్తారు. దాంతో కారు వేగంగా నడిపి సందీప్‌ ... జాన్‌ కారును గుద్దేస్తాడు. ఆ యాక్సిడెంట్‌లో ఒకేలా ఉన్న సందీప్‌ దగ్గరి బాక్స్, జాన్‌ దగ్గరి విలువైన వస్తువున్న బాక్స్ తారుమారు అయిపోతాయి. అంతేకాదు జాన్‌ రివాల్వర్ కూడా ఆ యాక్సిడెంట్‌లో మిస్ అవుతుంది. తన కారును గుద్దింది సందీప్, అతని స్నేహితుడైన సత్తి అని తెలుసుకుని వారిని కిడ్నాప్‌ చేస్తాడు జాన్‌. ఈ క్రమంలో జాన్ పోగొట్టుకున్న విలువైన బాక్స్ రకరకాలుగా చేతులు మారుతుంది. దానిని దక్కించుకోవడానికి జాన్‌ ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఈ మొత్తం వ్యవహారంలో సత్తి పెళ్ళి, సందీప్‌ ప్రేమ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇంతకూ ఆ బాక్స్ లో ఉన్న విలువైన వస్తువు ఏమిటీ? దాని నేపథ్యం ఏమిటనేది మిగతా కథ.

మిస్ అయిన విలువైన వస్తువును దక్కించుకోవడం కోసం రెండు, మూడు బృందాలు రకరకాల ప్రయత్నాలు చేయడం అనేది చాలా సినిమాలలో మనం చూశాం. అయితే ఇందులో ఆ విలువైన వస్తువు ఏమిటనేది ప్రథమార్ధంలో రివీల్‌ చేయకుండా దర్శకుడు బాగానే కథను లాక్కొచ్చాడు. సినిమా అంతా చిరపుంజీలోనే జరుగుతుంది. ఈ నేపథ్యం కాస్తంత కొత్తగా అనిపిస్తుంది. రెండు గంటల పాటు కథను రకరకాల మలుపులు తిప్పి, చివరకు సుఖాంతం చేశాడు దర్శకుడు గుణి మంచికంటి. పెద్దాయన మెప్పుపొంది భారీ కాంట్రాక్ట్ ను ముఖేష్‌ వర్థన్‌ అందుకోవడంతో... అతని ప్రత్యర్థి మరో ప్లాన్‌ వేసి నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కైవసం చేసుకోవడానికి శ్రీకారం చుట్టడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని తెలియచేశారు. అయితే... తెలుగువారికి సుపరిచితులైన నటీనటుల పెద్దగా లేకపోవడంతో థియేటర్ కు జనాలు పనికట్టుకుని వచ్చే ఆస్కారం తక్కువే. ఓటీటీలో ఈ సినిమా స్క్రీనింగ్‌ అయినప్పుడు ఆదరణ లభిస్తే, అప్పుడు సీక్వెల్ గురించి మేకర్స్ బహుశా ఓ నిర్ణయం తీసుకోవచ్చు.


నటీనటుల విషయానికి వస్తే.. టీనూ ఆనంద్‌ తెర మీద కనిపించేది కొద్ది సేపే. అయినా తన మార్క్ నటనను ప్రదర్శించారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఉపేంద్ర లిమాయే నే ఉన్నారు. తనదైన డైలాగ్‌ మాడ్యులేషన్ తో ఉపేంద్ర లిమాయే మెప్పించారు. శుక్రవారమే వచ్చిన 'కామ్రేడ్‌ కళ్యాణ్‌'లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. హీరోగా అక్షయ్ లఘుసాని, సత్తిపండుగా విష్ణు ఓయ్ తమ పాత్రలతో మెప్పించారు. జార్జ్ మారియన్‌ ఎంట్రీ ద్వితీయార్థంలోనే ఉంది. విస్మయశ్రీ , మాల్వీ మల్హోత్ర, కార్తీక్ దేవ్‌, కశ్యప్‌, సమృద్ధి ఆర్యల్ కీలక పాత్రలు పోషించారు. రీల్స్ పిచ్చి ఉన్న ఎస్.ఐ. పాత్రను రాజా రవీంద్ర చేశారు. ఊహకందని మలుపులతో సాగే ఇలాంటి కథను రక్తి కట్టించడం నిజానికి చాలా కష్టం. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కని స్క్రీన్ ప్లేతో గుణి మంచికంటి మెప్పించారు. అజయ్‌ అబ్రహం జార్జ్ కెమెరాపనితనం బాగుంది. మేఘాలయ అందాలను చక్కగా తెర మీద ప్రెజెంట్‌ చేశారు. స్టీఫెన్‌, ఆనంద్ అందించిన బాణీల కంటే... నేపథ్య సంగీతం సరికొత్త సౌండ్‌తో ఆకట్టుకుంది.

చిరపుంజీ అంటే భారతదేశంలో అత్యధిక శాతం వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఒకటి. కానీ చిత్రంగా ఈ సినిమాలో ఒక్కసారి కూడా మనకు వర్షం కనిపించదు. ఇదేదో రెయిన్‌ బ్యాక్‌ డ్రాప్ లో జరిగే కథ అని ఎవరైనా అనుకుంటే పొరపాటు పడినట్టే! క్రైమ్‌ కామెడీ సినిమాలను ఇష్టపడేవారికి, కొత్తదనాన్ని కోరుకునే వారికి 'బా బా బ్లాక్ షీప్‌' నచ్చుతుంది. కాకపోతే... డైరెక్టర్‌ కాస్తంత నవ్యత ఉన్న పాయింట్‌ను తీసుకుంటే ఇంకా బాగుండేది!

రేటింగ్‌: 2.5/5

ట్యాగ్‌ లైన్ : ఛేజింగ్‌ డ్రామా!

ఇవి కూడా చదవండి:

పాయల్ చెంగప్ప 'మయూఖ' మూవీ రివ్యూ

Hanuman Ansh Review: హనుమాన్ అంశ్.. ఎలా ఉందంటే?

సినిమా రివ్యూ: చకోర

Comrade Kalyan Review: శ్రీవిష్ణు 'కామ్రేడ్‌ కల్యాణ్‌' ఎలా ఉందంటే..

Updated Date - Oct 10 , 2026 | 11:22 PM