సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

ABN, Publish Date - May 28 , 2026 | 02:44 PM

యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి జంటగా నటించిన సినిమా 'బ్లాక్స్ జోన్'. ఈ తమిళ సినిమాను గురువారం సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది.

Blast Zone Movie Review

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నాలుగున్నర దశాబ్దాల క్రితం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. బేసికల్ గా కరాటే ఫైటర్ అయిన అర్జున్ తన కెరీర్ ప్రారంభంలోనే దానికి సంబంధించిన విన్యాసాలన్నీ సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు. దశాబ్దాలు గడిచినా... ఇంకా అదే ఫిట్ నెస్‌తో యాక్షన్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలా ఆయనకు నచ్చిన ఆ జానర్ వచ్చిన సినిమానే 'బ్లాస్ట్ జోన్'. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్ టైనమెంట్స్, సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాను గురువారం తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేసింది.


మనవాళ్ళు సమస్యలలో ఉంటే స్పందించి, పరిష్కరించడమే కాదు… ఎవరు ఇబ్బందులలో ఉన్నా, వారికి సాయం చేయాలనే మెంటాలిటీ రాజారాం (అర్జున్ సర్జా)ది. అతనో కరాటే ట్రైనర్. చిత్రం ఏమంటే... యుక్త వయసులో తనను కరాటే పోటీలో ఓడించిన నీలవేణి (అభిరామి) అనే అమ్మాయినే అతను పెళ్ళి చేసుకుంటాడు. వారి కూతురు నీల (ప్రియా ముకుందన్). ఆమెను కూడా తన ఆదర్శాలకు తగ్గట్టుగా పెంచి పెద్ద చేస్తాడు రాజారాం. అతనికో తమ్ముడు (వివేక్ ప్రసన్న). అతను మెడికల్ షాప్ నడుపు తుంటాడు. ఈ నలుగురు ఉన్న చిన్న కుటుంబం ఒకసారి ఊహించని విధంగా కష్టాల్లో చిక్కుకుంటుంది. టెక్సాస్ మైనింగ్ కంపెనీ అధినేత వరుణ్ దయాలన్ (జాన్ కొక్కెన్) ఏడు వేల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తాడు. దాన్ని తనకు కట్టబెడితే మంత్రికి వెయ్యి కోట్ల లంచం ఇస్తానంటాడు. ఈ ప్రాజెక్ట్ చేజిక్కించుకునే యత్నంలో వరుణ్ దయాలన్ ఎంతటి హింసకైనా పాల్పడుతుంటాడు. అయితే ఊహించని విధంగా రాజారాం ఫ్యామిలీ ఈ ఇష్యూలో ఇరుక్కుంటుంది. దానిలోంచి వారు ఎలా బయటపడ్డారు? ఈ ప్రాజెక్ట్ కు వస్తే కొన్ని వందల ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయని తెలిసిన రాజారాం ఫ్యామిలీ వరుణ్ దయాలన్ ను ఎదుర్కొని ఏం చేసిందనేదే మిగతా సినిమా.


నిజానికి కథగా చూస్తే కొత్తదనం లేదు. ఓ భారీ పారిశ్రామిక వేత్త కోట్ల విలువచేసే మైనింగ్ డీల్ ప్లాన్ చేస్తాడు. దానివల్ల వందలాది కుటుంబాలకు ఆపద ఏర్పడుతుంది. అయితే ఈ డీల్ కు ఊహించని అవాంతరాలు ఎదురయ్యి, అతని వ్యాపార సామ్రాజ్యం తల్లకిందులైపోతుంది. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే... ఆ పారిశ్రామికవేత్తతో కానీ, నష్టపోయే కుటుంబాలతో గానీ అస్సలు సంబంధమే లేని వాళ్ళు దాన్ని కాపాడాలనుకోవడం... ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని దర్శకుడు సుభాష్ కె రాజ్ ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకున్నాడు. అలానే వాటిని ఆసక్తికరంగా తెరకెక్కించాడు కూడా!

మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, ఆర్థికంగా స్థిరపడాలి, ఎలాంటి కష్టం వచ్చినా తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలి అనేది ఈ సినిమాలోని కోర్ పాయింట్. అలాంటి భావనతో తన కూతురును పెంచిన ఓ వ్యక్తి ఊహించని విధంగా ఎదురైన అవాంతరాలను కుటుంబ సభ్యులందరి సాయంతో ఎలా అధిగమించాడు అనేది అసలు కథ. ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీస్‌ను చూసేప్పుడు బుర్రను ఇంటి దగ్గరే ఫ్రిజ్ లో పెట్టేయాలి! లేకపోతే ఇందులో సామాన్యులు, గూండాలు, పోలీసులు, పారిశ్రామిక వేత్తల తొత్తులు చేసే హత్యలను చూసి తట్టుకోలేం. వాటి వెనక ఉండే రీజన్స్ వెతకడం మొదలెడితే, బుర్ర హీటెక్కిపోతుంది. కాకపోతే సినిమా అంటేనే కల్పిత గాథ కాబట్టి... జనాలు లాజిక్స్ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇవాళ వాళ్ళు కోరుకునేది ఒక్కటే... సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేదే. ఆ రకంగా చూస్తే... ‘బ్లాస్ట్ జోస్‌’ ప్రేక్షకులను ఎంగేజింగ్‌గా ఉంచే సినిమానే! తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకులలో కలిగేలా దర్శకుడు సుభాష్ చేశాడు.


నటీనటుల విషయానికి వస్తే... అర్జున్‌కు ఇలాంటి యాక్షన్ రోల్స్ చేయడం కొట్టిన పిండి. అతను ఈజీగానే ఈ పాత్రను పోషించాడు. ఇక ఒకప్పటి హీరోయిన్ అభిరామి ఈ వయసులో యాక్షన్ సీన్స్ చేయడం గ్రేట్. అలానే 'కన్నప్ప' సినిమాలో గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి ముకుందన్ ఇందులో ఇరగదీసింది. ఈ ముగ్గురి యాక్షన్ సీన్స్ థియేటర్లో చూస్తేనే మజా! ఇతర ప్రధాన పాత్రలను జాన్ కొక్కెన్ (నటి పూజా రామచంద్రన్ భర్త), పవన్ కృష్ణ ('రాజధాని ఫైల్స్'లో జగన్ పాత్ర పోషించిన నటుడు), అర్జున్ చిదంబరమ్, వివేక్ ప్రసన్న, దిలీపన్, బాల హాసన్, వినోద్ సాగర్ తదితరులు పోషించారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది. నేపథ్య గీతాల విషయంలో ఇంకాస్తంత జాగ్రత్తపడి ఉండాల్సింది. అవేవీ చెవిని సోకేలా లేవు. అసలు అవి సినిమాకు అవసరం లేదు కూడా. కథలో కొత్తదనం లేకపోయినా... మూవీ రేసీగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. కథలో ఎన్ని లొసుగులు ఉన్నా... వాటి గురించి పట్టించుకోవాలనిపించదు. సో... అర్జున్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ 'బ్లాస్ జోన్'లోకి ఎంటర్ అయిపోవచ్చు!

ట్యాగ్ లైన్: ఫ్యామిలీ బ్లాస్ట్!

రేటింగ్: 3/5

Updated Date - May 28 , 2026 | 02:44 PM