Ramayan: హనుమంతుడు లేని 'రామాయణ'..కారణమేంటి..?
ABN, Publish Date - Jul 30 , 2026 | 06:04 PM
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఆధ్యాత్మిక దృశ్యకావ్యం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ రూపుదిద్దుతున్న ఈ వండర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఆధ్యాత్మిక దృశ్యకావ్యం రామాయణ. దర్శకుడు నితేష్ తివారీ రూపుదిద్దుతున్న ఈ వండర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన విజువల్స్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ డివైన్ లుక్, సీతాదేవిగా సాయి పల్లవి అభినయం, ఇక లంకాధిపతి రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ పెర్ఫామెన్స్ చూసి ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అయితే... తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక పెద్ద ప్రశ్న తెగ తొలిచేస్తోంది. అదేంటి అంటే... అసలు ఈ ట్రైలర్‌లో హనుమంతుడు ఎక్కడ అని..? బాలీవుడ్ యాక్షన్ కింగ్ సన్నీ డియోల్ పోషిస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ క్యారెక్టర్ ఎందుకు కనబడలేదు..? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి..?
సనాతన ధర్మంలోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ హనుమంతుడి పాత్రకు ఉన్న స్థానం అత్యంత పవిత్రమైనది, ప్రత్యేకమైనది. అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను డైరెక్టర్ నితేష్ తివారీ ఎందుకు రివీల్ చేయలేదో తెలుసుకోవాలంటే... ఈ సినిమా పార్ట్-1 కథ ఏంటో చూడాలి. దర్శకుడు ఈ ఎపిక్ రామాయణాన్ని ఒకే సినిమాలో చెప్పకుండా రెండు భాగాలుగా రామాయణ Part-1, రామాయణ Part-2 అని ప్లాన్ చేశారు. మొదటి భాగం ప్రధానంగా రావణుడు లంకాధిపతిగా మారడం, శ్రీరాముడి జన్మవృత్తాంతం, బాల్యం, గురుకుల విద్య, సీతా స్వయంవరం, 14 ఏళ్ల అరణ్యవాసం ఆపై సీతాపహరణం వరకే సాగుతుంది. రామాయణ మూల కథ ప్రకారం చూసుకున్నా... శ్రీరాముడికి, హనుమంతుడికి మధ్య మొదటి భేటీ జరిగేది సీతాపహరణం పూర్తయిన తర్వాతే. రుష్యమూక పర్వతం వద్ద వారిద్దరి కలయిక జరుగుతుంది. అంటే పార్ట్-1 ముగింపు ఘట్టంలో మాత్రమే హనుమంతుడి ప్రవేశం ఉంటుంది. సినిమా మొదటి భాగం అంతా కూడా ప్రధానంగా రాముడు, సీతాదేవి, రావణాసురుడి పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రమోషనల్ కంటెంట్‌లోనూ మేకర్స్ ఆ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు, మొదటి భాగంలో ఎక్కడా రాముడు, రావణుడు ఒకరికొకరు ముఖాముఖి ఎదురుపడరు అనే విషయాన్ని కూడా చిత్ర బృందం స్పష్టం చేసింది.
ఇక హనుమంతుడి పాత్ర విషయానికి వస్తే... అది కేవలం ఒక రోల్ మాత్రమే కాదు, కోట్ల మంది భక్తి, నమ్మకం. అంత పవర్ ఫుల్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్‌ను ఇప్పుడే బయటపెట్టేస్తే... దానికి ఉన్న సస్పెన్స్, ఇంపాక్ట్ తగ్గిపోతాయని మేకర్స్ భావించారేమో. సెకండ్ పార్ట్‌కు అదే మెయిన్ హైలైట్ కాబోతోంది కాబట్టి, హనుమంతుడి లుక్‌ను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. మరో ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే... హనుమంతుడిగా సన్నీ డియోల్ షూటింగ్ ఇటీవలే సెట్స్‌లో ప్రారంభమైంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పార్ట్-1 లో సన్నీ డియోల్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా, అంటే సినిమా చివర్లో కేవలం ఒక్క సీన్ లేదా క్యామియో మాత్రమే ఉండనుందట. అసలు సిసలైన సుందరకాండ, సంజీవని పర్వతం ఎత్తడం, లంకాదహనం, శ్రీరాముడితో కలిసి యుద్ధం చేయడం... ఇలాంటి ఐకానిక్ సన్నివేశాలు అన్నీ కూడా రామాయణ పార్ట్-2 లోనే రానున్నాయి. అంటే పార్ట్-2 లో హనుమాన్ విశ్వరూపం ఉండబోతుంది. ఏది ఏమైనా... ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటున్న హనుమంతుడి విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్తగా చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే.