Nitesh Tiwari: సీత పాత్రను అలా చూపిస్తే తప్పేంటి?
ABN, Publish Date - Nov 15 , 2026 | 08:34 PM
బాలీవుడ్ లో తెరకెక్కిన 'రామాయణ’ సినిమాలో సీత పాత్రను యోధురాలిగా చూపించడంపై వస్తున్న విమర్శలకు దర్శకుడు నితేశ్ తివారీ సమాధానమిచ్చారు.
బాలీవుడ్ లో తెరకెక్కిన 'రామాయణ’ (Ramayana) సినిమాలో సీత (Sita) పాత్రను యోధురాలిగా చూపించడంపై వస్తున్న విమర్శలకు దర్శకుడు నితేశ్ తివారీ సమాధానమిచ్చారు. సాయిపల్లవి పోషించిన సీత పాత్రలో పోరాట సన్నివేశాలు ఉండటంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దర్శకుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సీతను యోధురాలిగా చూపించడం వెనుక పురాణ, ప్రాంతీయ రామాయణ కథనాల ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
‘‘రామాయణ సాహిత్యంలో సీత పాత్రకు సంబంధించి అందరికీ తెలిసిన కథనాలకు భిన్నమైన ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృతంలోని ‘అద్భుత రామాయణం’, 15వ శతాబ్దానికి చెందిన ఒడియా ‘బిలంక రామాయణం’లో సీతను ఎంతో శక్తిమంతమైన యోధురాలిగా చూపించారు. ఈ కథనాల్లో ఆమె కేవలం సహనానికి, త్యాగానికి ప్రతీక మాత్రమే కాదు.. అవసరమైనప్పుడు యుద్ధం చేయగలిగిన వీరనారి. కొన్ని కథల్లో శ్రీరాముడు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సీత మహాకాళి రూపాన్ని ధరించి సహస్ర రావణుడిని సంహరిస్తుంది. వివిధ ప్రాంతీయ రామాయణాల్లోనూ సీతకు సంబంధించిన ఇలాంటి ప్రస్తావనలు ఉన్నాయి. ఆ కథనాల స్ఫూర్తితోనే మా సినిమాలో సీత పాత్రను శక్తిమంతమైన యోధురాలిగా తీర్చిదిద్దాం. కాబట్టి ఇది మేము కొత్తగా చేసిన ప్రయోగమేమీ కాదు’’ అని నితేశ్ తివారీ తెలిపారు.
మరోవైపు సినిమాలో కైకేయి పాత్రలో కనిపించిన నటి లారా దత్తా కూడా గతంలో ఈ అంశంపై స్పందించారు. రాజకుటుంబాల్లో జన్మించిన యువరాజులు, యువరాణులకు అప్పట్లోనే కళలతో పాటు యుద్ధ విద్యల్లోనూ శిక్షణ ఇచ్చేవారని గుర్తుచేశారు. అలాంటప్పుడు సీతకు యుద్ధ విద్య తెలిసి ఉండటంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రేక్షకులు ముందుగా సినిమాను ఆస్వాదించాలని అభిప్రాయపడ్డారు.
రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ‘రామాయణ’ తొలి భాగం నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండో భాగాన్ని 2028లో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. మొత్తానికి సీత పాత్రను యోధురాలిగా చూపించడంపై వస్తున్న చర్చకు దర్శకుడు చెప్పిన పురాణ నేపథ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.