పల్లవి జోషికి సి.బి.ఎఫ్.సి.లో చోటు... విమర్శకులపై విరుచుకుపడ్డ వివేక్ అగ్నిహోత్రి
ABN , Publish Date - Sep 17 , 2026 | 04:36 PM
సి.బి.ఎఫ్.సీ. సెంట్రల్ బోర్డ్ లో నటి, నిర్మాత పల్లవిజోషికి చోటు దక్కింది. అయితే ఆమెను వివేక్ అగ్నిహోత్రి భార్యగా కొన్ని మీడియా సంస్థలు వ్యంగ్యంగా ప్రస్తావించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్ర సమాచార ప్రసార శాఖ సీబీఎఫ్‌సీ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా 18 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని వేసిన విషయం తెలిసింది. అందులో ప్రముఖ నటి, నిర్మాత పల్లవి జోషికి సైతం చోటు దక్కింది. అయితే గత కమిటీలో ఉన్న ఆమె భర్త, దర్శకుడు వివేక్ అగ్రిహోత్రిని తొలగించి, ఆ స్థానంలో ఆమెకు చోటు కల్పించారంటూ ఓ ప్రముఖ వెబ్ సైట్ పేర్కొనడాన్ని వివేక్ అగ్నిహోత్రి తప్పు పట్టారు. పల్లవి జోషి తనకు భార్య మాత్రమే కాదని, ఆమె జాతీయ పురస్కారం పొందిన నటి కూడా అనే విషయాన్ని సదరు మీడియా సంస్థ గుర్తించాలని ఆయన కోరారు. దురుద్దేశపూరితమైన రాతల ద్వారా మహిళలను కించపర్చడం ఎలా జర్నలిజం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై తన ఆవేదనను తెలియచేస్తూ వివేక్ అగ్నిహోత్రి ఓ పెద్ద పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు.
పల్లవిజోషి నట ప్రయాణాన్ని గురించి వివేక్ అగ్నిహోత్రి తెలియచేస్తూ, 'ఆమె నాలుగేళ్ల వయసులోనే నటన ప్రారంభించారు. ఈ కథనం రాసిన పలువురు జర్నలిస్టులు పుట్టకముందే, ఆమె దేశవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన టెలివిజన్ నటిగా నిలిచారు. నాకు ప్రొడక్షన్ అనే పదం కూడా తెలియని రోజుల్లోనే, భారత నౌకాదళంలోని మహిళల నేపథ్యంతో ‘ఆరోహణ్’ను పల్లవి జోషి నిర్మించారు. వీరు రాసిన కథనాలన్నింటికంటే ఎంతో అర్థవంతమైన సృజనాత్మక కృషిని ఆమె చేశారు. అయినా, ఒక స్వయంకృషితో ఎదిగిన మహిళ గురించి రాయాల్సి వచ్చినప్పుడు, వీరు ఆమెను ముందుగా 'దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య' అని పరిచయం చేయడం దారుణం. ఒక మహిళ సాధించిన విజయాలకంటే ఆమె భర్త గుర్తింపే ఆమె వ్యక్తిత్వాన్ని నిర్వచించడానికి సరిపోతుందని వీరు ఇంకా నమ్ముతున్నారా? ఇదే పితృస్వామ్యం పనిచేసే విధానం. దశాబ్దాల పాటు స్వతంత్రంగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న మహిళను, ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆధారంగా మాత్రమే పరిచయం చేయడం విడ్డూరం. వీరంతా మళ్ళీ పితృస్వామ్యం గురించి విమర్శలు చేస్తుంటారు. నిజం చెప్పాలంటే... పల్లవి జోషి తన గుర్తింపును ఎవరి నుంచీ అప్పుగా తీసుకోలేదు. నాలుగు దశాబ్దాల నటన, నిర్మాణం, టెలివిజన్, సినిమా రంగాల్లో ఆమె చేసిన అసాధారణ కృషితో ఆ గుర్తింపును తానే నిర్మించుకున్నారు. సాధారణతతో రాజీ పడాల్సిన అవసరం ఆమెకు రాలేదు. శక్తివంతమైన ఇంటిపేరును ఆశ్రయించాల్సిన అవసరం లేదు. భర్త ద్వారా తన విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఒక స్వతంత్ర, విజయవంతమైన మహిళను ఆమె స్వంత ప్రతిభతో గుర్తించలేక, భర్త ద్వారా నిర్వచించాల్సిన అవసరం వీరికి కలిగింది. సమస్య పల్లవి జోషిలో కాదు. వారి దృష్టికోణంలో నాటుకుపోయిన పితృస్వామ్య భావజాలంలో ఉంది' అని వివేక్ అగ్నిహోత్రి ఘాటుగా ప్రతిస్పందించారు.
'మహిళా హక్కుల కోసం మాట్లాడే వ్యక్తిగా ఈ సంస్థ ఇలాంటి శీర్షికను కొన్ని అదనపు వ్యూస్ కోసం సమర్థించడం, ప్రోత్సహించడం లేదా అనుమతించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. స్త్రీవాదం ఎంపిక చేసుకుని వర్తించే సిద్ధాంతం కాదు. మన కథనానికి అనుకూలమైన మహిళలకే కాదు, అందరికీ సమానంగా వర్తించాలి' అని ఆయన హితవు పలికారు. నిజానికి పల్లవి జోషిని గురించి రాయాల్సి వస్తే... వారు ఇలా రాస్తే ఇంకా బాగుండేదంటూ వివేక్ అగ్నిహోత్రి ఇలా పేర్కొన్నారు: 'శ్యామ్ బెనెగల్ రూపొందించిన 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా' లో కస్తూర్బాగా నటించిన, మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న నటి పల్లవి జోషి… భారత టెలివిజన్‌లో అత్యంత విజయవంతమైన కార్యక్రమాలకు నాంది పలికిన సృజనకర్త… 'ది కాశ్మీర్ ఫైల్స్'లో గుర్తుండిపోయే ప్రతినాయక పాత్ర పోషించిన కళాకారిణి… మానవ హక్కుల కోసం నిలిచిన వ్యక్తి… అర్థవంతమైన సినిమాలను నిర్మించిన నిర్మాత… ఇద్దరు పిల్లల తల్లి… అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి జీవిత భాగస్వామి' అని ఉంటే తాను సంతోషించేవాడినని పేర్కొన్నారు. ఇలా తప్పుగా తన భార్యను పోట్రేట్ చేసినందుకు వెంటనే సదరు వెబ్ మీడియా క్షమాపణలు చెప్పాలని వివేక్ అగ్నిహోత్రి డిమాండ్ చేశారు.
అయితే... ఈ వెబ్ సైట్ ఇచ్చిన న్యూస్ క్రింద కూడా పల్లవిజోషిని సమర్థిస్తూ, ఆమె ప్రతిభను గుర్తించకుండా ఇలాంటి కథనం రాయడం దారుణం అంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ రిలీజ్‌పై అనుమానాలు.. అసలు విషయం ఏంటంటే
సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం
కేంద్ర సెన్సార్ బోర్డులో కీలక మార్పు.. సుప్రియ యార్లగడ్డకు చోటు