Durandhar 2: దురంధర్2లో.. ఊహించని సర్‌ప్రైజెస్
ABN, Publish Date - Jan 22 , 2026 | 01:07 PM
'దురంధర్' మూవీ తొలిభాగం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడంతో సెకండ్ పార్ట్ ను అంతకు మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ఇవ్వబోతున్నారు. ఇంకా చెప్పాలంటే దీన్ని ఓ క్రేజీ యూనివర్స్ గా మార్చబోతున్నారు.
సరైన విజయాలు లేక తల్లడిల్లుతున్న హిందీ చిత్రసీమకు సరికొత్త ఊపిరి పోసింది 'దురంధర్' మూవీ. అంచనాలకు తగ్గట్టుగానే భారీ సక్సెస్ సాధించి గత బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీ దాదాపు రూ. 1400 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. దీంతో అందరి దృష్టి రెండో భాగం పై పడింది. దీనిపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'దురంధర్ 2' మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ కానున్న తరుణంలో దీనికి సంబంధించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం విక్కీ కౌశల్ 'దురంధర్ 2'లో ఎక్స్‌టెండెడ్ కేమియోగా ఎంట్రీ ఇస్తున్నాడట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 'ఉరి' సినిమాలో తాను చేసిన ఐకానిక్ క్యారెక్టర్ మేజర్ విహాన్ షేర్గిల్ నే తిరిగి పోషిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఆదిత్య ధర్ గతంలో విక్కీతో 'ఉరి' చేసి సూపర్ హిట్ సాధించారు. ఇప్పుడు ఆ యూనివర్స్‌ను 'దురంధర్ -2'తో కనెక్ట్ చేయడం ద్వారా ఫ్రాంచైజీ మరింత భారీగా, స్పైసీగా మారిపోతుందని అంచనా వేస్తున్నారట.
ఇక అక్షయ్ ఖన్నా పాత్ర మొదటి భాగంలో మరణించినందున రెండో భాగంలో కేవలం ఫ్లాష్‌బ్యాక్ సీన్‌లకే పరిమితం కానుందని తెలుస్తోంది. దీంతో విక్కీ కేమియోలో యాక్షన్ బ్లాక్స్ కూడా ఉంటాయని, థియేటర్‌లో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్‌గా ఇది ఉండబోతోందని చెబుతున్నారు. నిజానికి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకుండా గోప్యంగా ఉంచాలని మేకర్స్ భావించారట. కానీ ఇప్పుడీ వార్త లీక్ అయ్యి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. జనవరి 23న 'బోర్డర్ 2' మూవీ ప్రదర్శించే ధియేటర్లలో 'దురంధర్ 2' టీజర్ ను ప్రదర్శించబోతున్నారు. దాదాపు రెండున్నర నిమిషాల నిడివితో రాబోతున్న ఈ టీజర్ ను యాక్షన్ తో నింపేశారట. మరి 'దురంధర్ 2' మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.