సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఖాన్స్ రికార్డులను.. రణ్‌వీర్, రణ్‌బీర్ చెరిపేస్తారా?

ABN, Publish Date - Apr 02 , 2026 | 07:54 AM

ఒకప్పుడు బాలీవుడ్ అంటే కేవలం ఖాన్ త్రయం మాత్రమే గుర్తొచ్చేవారు. రికార్డులు అన్నా, వేల కోట్ల వసూళ్లు అన్నా షారూక్, అమీర్, సల్మాన్ పేర్లే వినిపించేవి.

bollywood

ఒకప్పుడు బాలీవుడ్ అంటే కేవలం ఖాన్ త్రయం మాత్రమే గుర్తొచ్చేవారు. రికార్డులు అన్నా, వేల కోట్ల వసూళ్లు అన్నా షారూక్, అమీర్, సల్మాన్ పేర్లే వినిపించేవి. దశాబ్దాల పాటు హిందీ చిత్రసీమను ఏలిన ఈ దిగ్గజాల కోట ఇప్పుడు నెమ్మదిగా బీటలు వారుతోంది. ఈ తరం కుర్ర హీరోలు బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే, పాత రికార్డులన్నీ కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఇప్పుడు బాలీవుడ్ కొత్త బాహుబలులుగా అవతరిస్తున్నారు.

గతంలో షారూక్ ఖాన్ పేరిట ఉన్న 1100 కోట్ల రికార్డును గతేడాది రణ్‌వీర్ సింగ్ తన ధురంధర్ మొదటి భాగంతో తుడిచిపెట్టేశాడు. ఆ చిత్రం ఏకంగా 1350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక ఇప్పుడు ధురంధర్ ది రివేంజ్‌ తో రణ్‌వీర్ మరో అడుగు ముందుకు వేశాడు. ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్ల మార్కును దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ అగ్రస్థానంలో ఉంది. దానితో పాటు బాహుబలి-2, పుష్ప-2 వంటి భారీ చిత్రాలు కూడా టాప్ లో ఉన్నాయి. అయితే రణ్‌వీర్ చూపిస్తున్న ఈ వేగం చూస్తుంటే, ఆ రికార్డులు కూడా త్వరలోనే మరుగున పడిపోయేలా ఉన్నాయి.

మరోవైపు, రణ్‌వీర్ సింగ్ సృష్టించిన ఈ భారీ రికార్డులను సవాల్ చేయడానికి రణ్‌బీర్ కపూర్ సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్ర విశేషాల్లోకి వెళితే.. నితీష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ్‌లో రణ్‌భీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీత గా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ్ మొదటి భాగం నవంబర్ 8, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక క్లిక్ అయితే, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత లెక్కలన్నీ తారుమారు కావడం పక్కా. చాలా కాలం వరకు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా 1000 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఇబ్బంది పడ్డారు.

అమీర్ ఖాన్ దంగల్‌ తో ఆ రికార్డును ఇంకా పదిలంగా ఉంచుకున్నాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. కథాబలం, భారీ మేకింగ్ తో వస్తున్న ఈ తరం హీరోలు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. ఖాన్ల అడ్డాగా పేరున్న బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ఇద్దరు 'రణ్' ల మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరు నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి దంగల్ రికార్డును రణ్‌వీర్ సింగ్ బ్రేక్ చేస్తాడా? లేక రామాయణ్ తో రణ్‌బీర్ కపూర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తాడా అనేది చూడాలి.

Updated Date - Apr 02 , 2026 | 07:54 AM