‘రామాయణం’లో యశ్ రావణ తాండవం.. పాట పాడిన దేవిశ్రీ, అనిరుధ్, జీవీ ప్రకాష్
ABN, Publish Date - Oct 21 , 2026 | 12:41 PM
యశ్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణం’ నుంచి ‘రావణ తాండవం’ పాట విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్, జీవీ ప్రకాష్ సహా ప్రముఖ గాయకులు ఆలపించారు
భారతీయ ఇతిహాసం ‘రామాయణం’(Ramayana)ను వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాలో రావణుడిగా కనిపించనున్న యశ్ (Yash) ఇప్పటికే తన లుక్‌తో ఆసక్తి పెంచగా.. తాజాగా విడుదలైన ‘రావణ తాండవం’ (Ravana Tandavam Song) వీడియో సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా యశ్ ఆహార్యం, ఆయన అభినయం, శివ తాండవాన్ని ఆవిష్కరించిన తీరు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ఈ గీతాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ గాయకులు ఆలపించడం విశేషం.
దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ‘రామాయణం’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్ నటిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ‘రావణ తాండవం’ పాటలో లంకాధిపతి రావణుడి శివభక్తిని, ఆయనలోని ఉగ్రరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. యశ్ ముఖంలో కనిపించే తీవ్రత, హావభావాలు, తెరపై ఆయన చూపించిన ప్రభావం పాటకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. శివ తాండవానికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా, తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తన గాత్రంతో ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. రెహమాన్ సంగీతంలో ఈ గీతాన్ని ఆలపించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘రామాయణం’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని, పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
‘రావణ తాండవం’ పాటకు భాషను బట్టి ప్రముఖ గాయకులు తమ గాత్రాన్ని అందించారు. హిందీ వెర్షన్‌ను విశాల్ దడ్లానీ పాడగా, తమిళ వెర్షన్లో అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) కలిసి ఆలపించారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటను దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్, జీవీ ప్రకాష్ వంటి సంగీత దర్శకులు పాడటం ఈ గీతంపై ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ముగ్గురు ప్రముఖ సంగీత దర్శకుల గాత్రాలు వేర్వేరు భాషల్లో ఈ పాటకు ఎలాంటి ప్రత్యేకతను తీసుకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే.. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘రామాయణం’ మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా రెండో పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఇంకా ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, DNEG, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను విడుదల చేయనుంది.