Ramayana Collections: రామాయణకు కొత్త ఆఫర్.. బాక్సాఫీస్ జోరు తగ్గడమే కారణమా
ABN , Publish Date - Nov 24 , 2026 | 02:04 PM
బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ వసూళ్ల వేగం తగ్గడంతో మేకర్స్ టికెట్ ధరలను భారీగా తగ్గించారు. రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న 2డీ టికెట్లు ఇప్పుడు రూ.99కే అందుబాటులోకి వచ్చాయి.
భారీ అంచనాలు, భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ (Ramayana). విడుదలైన సమయంలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా కలెక్షన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకులను మరోసారి థియేటర్లకు రప్పించేందుకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు.
రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించి మంగళవారం నుంచి టికెట్ ధరలను భారీగా తగ్గించారు. కేవలం రూ.99 నుంచే సినిమా టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది. కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు ఏకంగా 80 శాతం వరకు తగ్గడం విశేషం. గతంలో రూ.300 నుంచి రూ.400 వరకు ఉన్న 2డీ టికెట్లు ఇప్పుడు రూ.99కే లభిస్తున్నాయి. ఇక 3డీ టికెట్లు రూ.119 నుంచి రూ.249 మధ్య అందుబాటులో ఉన్నాయి. ఐమ్యాక్స్ షోల ధరలను సైతం తగ్గించారు. అయితే ప్రీమియం సీట్లు, కొన్ని ప్రత్యేక ఫార్మాట్లకు మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయి.
మరోవైపు, ఈ సినిమా బాక్సాఫీస్ ప్రదర్శనను పరిశీలిస్తే.. విడుదలైన తొలిరోజుల్లో భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. భారత్లో ఇప్పటివరకు రూ.955 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల వసూళ్ల వేగం తగ్గింది. నవంబర్ 23న ఈ చిత్రం కేవలం రూ.12.70 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే సాధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలను తగ్గించి ఆక్యుపెన్సీ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆఫర్ వెనుక ప్రధాన ఉద్దేశం కలెక్షన్లు తగ్గడమేనా? లేక ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయాలనే వ్యూహమా? అన్నది తెలియాల్సి ఉంది. భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణ’ ఇప్పుడు టికెట్ ధరల తగ్గింపుతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందేమో చూడాలి.
ALSO READ:
ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి
Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు
ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు