రామాయణ 3.. అంతా వారి చేతుల్లోనే
ABN, Publish Date - Nov 03 , 2026 | 09:53 PM
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana).
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana). భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక విజువల్ స్పెక్టకిల్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిత్ర బృందం కూడా పాన్ ఇండి లెవెల్ లో గట్టిగానే ప్రమోషన్స్ చేస్తుంది. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మూవీ ప్రీమియర్స్ లో కూడా ఎక్కువ పాజిటివ్ టాక్ నే అందుకోవడంతో అటు బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అయితే ఇప్పటివరకు రామాయణ రెండు భాగాలుగానే రిలీజ్ అవుతోందని మేకర్స్ తెలిపారు. తాజాగా ఒక కార్యక్రమంలో నిర్మాత నమిత్ మల్హోత్రా రామాయణ మూడు భాగాలుగా వస్తోంది అని చెప్పడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక అంతర్జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన నమిత్ మల్హోత్రా మూడో భాగంపై కీలక సమాచారాన్ని పంచుకున్నాడు. 'ప్రారంభంలో మేము ఈ ప్రాజెక్ట్‌ను మూడు భాగాలుగానే రూపొందించాలని భావించాం. అయితే ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్, ఆదరణ ఆధారంగా కథను మరింత పొడిగించి పార్ట్ 3 తీసుకొచ్చే అవకాశాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం' అని ఆయన స్పష్టం చేశాడు.
ఇప్పటికే రెండు భాగాలలో.. రాముడు, సీతను పెళ్లాడడం, వనవాసం, రావణుడు సీతను అపహరించడం, రాముడు- రావణుడు యుద్దం చూపించనున్నారు. ఒకవేళ మూడో భాగం ఉంటే ఆ కథ లవకుశల ఘట్టాల చుట్టూ సాగుతుందా లేక ఇతర స్పిన్-ఆఫ్ క్యారెక్టర్లపై ఉంటుందా అని ఆడియెన్స్ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కొన్ని క్యారెక్టర్లకు స్పిన్-ఆఫ్స్ ఉంటాయని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అంటే ఒక పాత్ర తీసుకొని ఆ తరువాత పార్ట్ ని ఆ పాత్ర ఆధారంగా తెరకెక్కించడం.
ప్రపంచస్థాయి సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగానికే ఏకంగా రూ. 2,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం విశేషం. ఈ విజువల్ వండర్‌కు ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందిస్తుండటంతో గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రెండు భాగాలను ప్రేక్షకులు చూసి అప్పుడు కూడా తమకు మూడో భాగం కావాలంటే తప్ప మేకర్స్ పార్ట్ 3 ని మొదలుపెట్టరు. అంటే రామాయణ మూడో భాగం అంతా ప్రేక్షకుల మీదనే ఆధారపడి ఉంది. మరి ఈ రెండు భాగాలపై ప్రేక్షకులు ఎలాంటి మహిమ చూపిస్తారో చూడాలి.