రామాయణ: ప్రతి అడుగూ బాధ్యత, భక్తి, నిబద్ధతతో...
ABN, Publish Date - Mar 27 , 2026 | 03:12 PM
ప్రతిష్ఠాత్మక రామాయణ చిత్రం గ్లింప్స్ ను హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు.
ఈ యేడాది దీపావళి కానుకగా హిందీ చిత్రం 'రామాయణ' (Ramayana) వివిధ భారతీయ భాషల్లో విడుదల కానుంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమాను నితేశ్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలోని మొదటి భాగం ఈ యేడాది దీపావళికి రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఖచ్చితంగా ఈ సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని రామభక్తులంతా భావించారు. అయితే వారికి నిరాశే మిగిలింది. ఇదే సమయంలో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ఓ హామీని ఈ సినిమా అభిమానులకు అందించారు.
ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి సందర్భంగా ఖచ్చింతంగా 'రామ' గ్లింప్స్‌ను అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, 'శుభ రామ నవమి... ఇది మన అందరి కథ. ఈ ప్రయాణంలో మేం ప్రతి అడుగూ బాధ్యత, భక్తి, నిబద్ధతతో వేస్తున్నాం. మన రామాయణాన్ని అత్యంత నిజమైన భావంతో, గొప్ప స్థాయిలో తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. ఏప్రిల్ 2న, హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ’ గ్లింప్స్‌ను మీ ముందుకు తీసుకు రాబోతున్నాం. ఈ సంవత్సరాల కృషిని ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కలిసి ఒక గొప్ప వేడుకగా జరుపుకోబోతున్నాం. మీ ప్రేమ, నమ్మకం, సహనానికి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. ఇండియాలోని పలు నగరాల్లో విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించడంతో, సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు రాబోయే 'రామ' గ్లింప్స్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను చూరగొంటుందని మేకర్స్ భావిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న 'రామాయాణ' చిత్రంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ రెండు భాగాల మహా కావ్యం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్‌లో విడుదల కాబోతోంది.