Ram Gopal Varma: 'రామాయణ' బడ్జెట్.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!
ABN, Publish Date - Nov 16 , 2026 | 11:10 AM
రామాయణ పార్ట్-1 బడ్జెట్ రూ.800 కోట్లలోపే ఉంటుందని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. పార్ట్-2 మొదటి భాగం కంటే పదింతలు ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు.
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామాయణ (Ramayana). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా, యశ్ (Yash) రావణుడిగా నటించగా రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1 ఈ దీపావళికి ప్రేక్షకుల ఎదుటకు వచ్చి రికార్డ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మొదటి భాగం బడ్జెట్, రెండో భాగం వసూళ్లపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రామాయణ పార్ట్-1 బడ్జెట్ రూ.800 కోట్లలోపే ఉంటుందని వర్మ (RGV) ట్వీట్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు వంటి వాటి కోసం చేసిన ఖర్చు భవిష్యత్తులో సీక్వెల్‌కు, గేమింగ్, ఇతర వెంచర్లకు ప్రధాన ఆస్తులుగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పార్ట్-1తో పోలిస్తే పార్ట్-2 పదింతలు ఎక్కువ వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాను తాను రెండుసార్లు చూశానని, ఇది భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని వర్మ పేర్కొన్నారు. అయినప్పటికీ, రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ అంటే ఒక్కో భాగానికి రూ.2 వేల కోట్లు వసూలు చేయాలని కొందరు అసూయతో విమర్శలు చేస్తున్నారని అన్నారు.
రెండు భాగాల నిర్మాణానికి ఒకే స్థాయిలో ఖర్చవుతుందని అనుకోవడం కూడా పొరపాటే. ఒక సినిమా ఫస్ట్ హాఫ్, సెకండాఫ్‌లకు ఒకే విధంగా ఖర్చు అవుతుందని భావించడం ఎంత తప్పో ఇది కూడా అంతే. కొన్ని సినిమాల్లో మొత్తం బడ్జెట్‌లో సగం కేవలం క్లైమాక్స్ కోసమే ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 'రామాయణ'కు లభిస్తున్న ఆదరణను చూస్తుంటే.. మొదటి భాగంతోనే నమిత్ మల్హోత్రా రెండు భాగాల మొత్తం నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మొదటి భాగానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ ఆదాయం, రెండో భాగం ద్వారా వచ్చే వసూళ్లు అదనంగా ఉంటాయి అని తేల్చేశారు. అంటే నమిత్ మల్హోత్రా తన సొంత పుష్పక విమానాన్ని నిర్మించుకుని, ప్రపంచవ్యాప్తంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకోవచ్చు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న అతిపెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇప్పటివరకు సాధించలేని స్థాయిని ఆయన అందుకునే అవకాశం ఉంది. అంతేకాదు, హాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలను సైతం అధిగమించవచ్చన్నారు.
ఇంకా వర్మ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి, తులసీదాస్ తమ రచనలు పూర్తిచేసిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ 1913 మే 3న విడుదలైన 'రాజా హరిశ్చంద్ర' నుంచి 2026 నవంబర్ 5 వరకు భారతీయ సినిమా చరిత్రలో వచ్చిన చిత్రాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇకపై నమిత్ మల్హోత్రా చరిత్రలోనే అతిపెద్ద సినీ నిర్మాతగా నిలవబోతున్నారు. ఎవరికైనా సందేహం ఉంటే లెక్కలు వేసి చూసుకోవచ్చు. పార్ట్1 లో చూపించిన విజువల్స్ ఈ రేంజ్‌లో ఉంటే ఇక రెండో భాగంలో అసలైన భారీ యాక్షన్ ఘట్టాలు ఉండనే ఉన్నాయి.
హనుమంతుడి పరాక్రమాలు, వానర సైన్యం, రామసేతు నిర్మాణం, లంకాదహనం, కుంభకర్ణుడి వధ, రావణ సంహారం వంటి ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ప్రేక్షకులను సీటులోంచి క్షణకాలం కూడా కదలనివ్వవు. వీటిని దృష్టిలోకి తీసుకుంటే.. నమిత్ మల్హోత్రాకు ఉన్న ఆలోచన, బిజినెస్ టెక్నిక్, దూరదృష్టిని చూస్తుంటే.. 'కేజీఎఫ్ 2' మొదటి భాగం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించినట్లే, 'రామాయణ 2' కూడా మొదటి భాగం కంటే పది రెట్లు ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని నమ్ముతున్నా. నా అంచనాతో మీరు ఏకీభవించకపోతే.. 2028లో మాట్లాడుకుందాం అంటూ ముగించారు. మరి ఆర్జీవీ అంచనాలు నిజమవుతాయా? 'రామాయణ' భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.