Rakul Preeth Singh: ‘రామాయణ’లో శూర్పణఖ లుక్ వెనుక ఇంత కష్టమా?
ABN, Publish Date - Nov 17 , 2026 | 06:41 PM
నితేశ్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’లో రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే.
నితేశ్ తివారీ తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’లో (Ramayana) రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preeth Singh) నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా తన పాత్ర వెనుక ఉన్న కష్టాన్ని వివరిస్తూ రకుల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. శూర్పణఖగా తెరపై కనిపించేందుకు ప్రతిరోజూ ఎంత సమయం కేటాయించాల్సి వచ్చిందో వెల్లడించారు. ఈ పాత్ర కోసం రోజుకు దాదాపు నాలుగు గంటలపాటు మేకప్ కు సమయం పట్టేదని చెప్పారు. చర్మపు రంగును పాత్రకు అనుగుణంగా మార్చడం, ప్రత్యేకమైన హెయిర్ స్టైలింగ్, ఆభరణాలు ధరించడం వంటి పనులన్నీ పూర్తయ్యేందుకు అంత సమయం పట్టేదని అన్నారు.
మధ్యలో కొద్దిసేపు విరామం మినహా ఎక్కువ సమయం మేకప్ కుర్చీలోనే గడిపేదాన్నని వివరించారు. ప్రస్తుతం శూర్పణఖ పాత్రకు లభిస్తున్న ఆదరణ తనను ఎంతో ఆనందపరుస్తోందని రకుల్ పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం ప్రతిరోజూ నాలుగు గంటలపాటు సాగిన మేకప్ ప్రక్రియ, తెరవెనుక పడిన కష్టాలన్నీ ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమతో సార్థకమయ్యాయని సరదాగా వ్యాఖ్యానించారు. మంచి ఫలితం రావడానికి ఎంతో సమయం, శ్రమ అవసరమని తన పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ ప్రత్యేకమైన రూపాన్ని అందించిన మేకప్ ఆర్టిస్ట్స్ సాల్, అలియా షేక్‌తో పాటు కాస్ట్యూమ్ బృందానికి రకుల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.