‘లవ్ అండ్ వార్’.. రెట్రో లుక్‌లో సెగలు రేపుతోన్న ఆలియా
ABN, Publish Date - Sep 25 , 2026 | 05:46 PM
బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’. ఈ మూవీ నుంచి ఆలియా భల్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.
బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ ‘లవ్ అండ్ వార్’ (Love and War). రణబీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt), విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ పాన్ ఇండియా చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్నటికి నిన్న రణబీర్ కపూర్ ఇంటెన్స్ వింటేజ్ లుక్‌ను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన మేకర్స్, తాజాగా కథానాయిక ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. తన గత పీరియాడిక్ చిత్రాలకు భిన్నంగా, భన్సాలీ ఈ సినిమాలో ఆవిష్కరిస్తోన్న సరికొత్త ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఈ లుక్ రూపుదిద్దుకుంది.
తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో ఆలియా భట్ మునుపెన్నడూ చూడని గ్లామరస్, బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చింది. రెడ్ కలర్ థై-హై స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన క్యాబరే స్టైల్ హెడ్‌పీస్ ధరించి, కుర్చీలో కూర్చుని ఉన్న ఆలియా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె ఆహార్యం, చూపులు, స్టైలింగ్ అంతా 1960-70ల నాటి క్లాసిక్ రెట్రో మూడ్‌ను గుర్తుచేస్తున్నాయి. “ఆగ్ భీ.. దిలోంకీ జాన్ భీ” అంటూ మేకర్స్ క్యాప్షన్ జోడించి విడుదల చేసిన ఈ పోస్టర్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘గంగూబాయి కతియావాడి’తో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న ఆలియా, భన్సాలీతో కలిసి చేస్తున్న ఈ రెండో ప్రాజెక్ట్‌లో పూర్తిగా డిఫరెంట్ షేడ్‌తో కనిపించనుందని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇద్దరూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వస్తుండగా, యుద్ధం నేపథ్యం నడుమ సాగే ఒక గాఢమైన ప్రేమ త్రికోణపు కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. భన్సాలీ మార్క్ గ్రాండ్‌నెస్, భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని 2027 జనవరి 21న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. స్టార్ తారాగణం, భన్సాలీ టేకింగ్ కలగలిసిన ఈ సినిమా వెండితెరపై సరికొత్త విజువల్ వండర్‌గా నిలుస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఎమోషనల్ లవ్ స్టోరీ ‘జాన్’ ఫస్ట్ లుక్ విడుదల
జర్నలిస్ట్ బాడీ షేమింగ్‌పై సంపూ క్లారిఫికేషన్.. ఏమన్నారంటే
కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ స్ట్రిక్ట్ రూల్స్.. ఎందుకంటే