కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ స్ట్రిక్ట్ రూల్స్.. ఎందుకంటే
ABN , Publish Date - Sep 24 , 2026 | 10:10 PM
మన స్టార్ హీరోస్ సినిమాలు షూటింగ్స్ ఏళ్ళ తరబడి సాగుతున్నాయి.. ఎందుకలాగా - అంటే కథ, కథనంలో వైవిధ్యం కోసమే అంత ఆలస్యమవుతోందని టాక్.
మన స్టార్ హీరోస్ సినిమాలు షూటింగ్స్ ఏళ్ళ తరబడి సాగుతున్నాయి.. ఎందుకలాగా - అంటే కథ, కథనంలో వైవిధ్యం కోసమే అంత ఆలస్యమవుతోందని టాక్. అసలు మన స్టార్స్ (Tollywood Stars) కథల విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారనీ తెలుస్తోంది.. ఆ ముచ్చటేంటో తెలుసుకుందామా? సీనియర్ స్టార్స్‌ను మినహాయిస్తే నవతరం స్టార్స్ అందరి చిత్రాల షూటింగ్స్ ఏడాదికి పైగానే సమయం పడుతోంది. కొందరి సినిమాలు రెండు మూడేళ్ళు కూడా సాగుతున్నాయి. వీరి కథల ఎంపిక విషయంలోనే దాదాపు ఏడాది తీసుకుంటోందని, తరువాత షూటింగ్స్ సమయంలోనూ మార్పులూ చేర్పులతో మరింత ఆలస్యం చోటు చేసుకుంటుందని వినిపిస్తోంది. మరి వీరి కథల ఎంపిక ఎలా ఉంటుంది? కథ వినేటప్పుడే సబ్జెక్ట్‌లో తమకు కలిగిన డౌట్స్‌ను నివృత్తి చేసుకుంటారు.. లేదా తమ సన్నిహితుల సమక్షంలో స్టోరీస్ వింటారు. వారికి కూడా వచ్చే డౌట్స్‌ను కథ చెప్పేవారు క్లియర్ చేయగలిగి ఉండాలి.. లేదంటే ఫస్ట్ సిట్టింగ్‌లోనే సదరు కథను బుట్ట దాఖలు చేసే అవకాశాలు ఉంటాయట. తరువాత మరో కథకోసం అన్వేషణ, అప్పుడు కూడా పలు అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు తపన కనిపిస్తాయట. కథ నచ్చితే తమ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులూ చేర్పులూ చేయమని సూచిస్తారట. ఇలా కథల ఎంపికలో అతి జాగ్రత్త వహించేవారిలో ముందుగా మహేశ్ బాబు (Mahesh Babu) కనిపిస్తారని తెలుస్తోంది. మహేశ్ కథ వినడానికి ముందే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండాలట.. కథలో గ్యాప్స్ ఉన్నా, ల్యాగ్ ఉన్నా మహేశ్ వెంటనే ప్రశ్నిస్తారట. ఈ విషయాన్ని మహేశ్‌తో పనిచేసిన కొందరు దర్శకులు గతంలోనే సెలవిచ్చారు.
కథల ఎంపిక విషయంలో జూనియర్ యన్టీఆర్ (Jr NTR) కూడా దర్శకులకు పరీక్షలు పెడుతుంటారని వినికిడి. దర్శకుడు కానీ, కథకుడు కానీ స్టోరీ న్యారేట్ చేస్తున్నప్పుడే యన్టీఆర్ తన మనసులో విజువలైజ్ చేసుకుంటారట. ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే యన్టీఆర్ చప్పున పట్టేస్తారని టాక్. అందుకే యన్టీఆర్‌కు కథ వినిపించబోయే దర్శకులు ముందుగా హోమ్ వర్క్ లాంటిది చేసుకొనే వెళ్తారని సమాచారం. అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పుడూ పర్‌ఫెక్షన్‌ను కోరుకుంటారట. అందులో మాత్రం బన్నీ రాజీపడరని తెలుస్తోంది. కథ నచ్చగానే ప్రాజెక్ట్‌ను ఆరంభించరు బన్నీ.. ఆ కథను మరింత డెవలప్ చేయడానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ తన ఇమేజ్‌కు ఆ కథలో ఎలాంటి మార్పులు చేయాలో వివరిస్తారట. అలా ప్రతి కోణంలో వంద శాతం సంతృప్తి చెందాకే అప్పుడు షూటింగ్‌కు వెళ్దామని గ్రీన్ సిగ్నల్ ఇస్తారట బన్నీ.
ప్రభాస్ (Prabhas)కు కథ నచ్చడమే ఆలస్యం, తరువాత ఎప్పుడు షూటింగ్ అనుకుంటున్నారని ప్రశ్నిస్తారట. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా ప్రభాస్ వెంటనే చెప్పేస్తారని టాక్. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వతహాగా దర్శకుడు కాబట్టి ఆయనకు కథ చెప్పేటప్పుడే స్టోరీ బోర్డ్ చూపిస్తూ చెబితే బాగుంటుందట. అలా కాకుండా నేరుగా చెప్పాలని పోయినా, ఆయన కథను ఎలా డిజైన్ చేసుకోవాలో సూచిస్తారట. రామ్ చరణ్ (Ram Charan) కూడా కథలు వినే విషయంలో తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ మార్గంలోనే పయనిస్తారని తెలుస్తోంది. సీనియర్ స్టార్స్ మాత్రం తమ ఇమేజ్‌కు తగ్గ కథ వస్తే అందులో తమకు అనుకూలమైన మార్పులు చెబుతారట. అవన్నీ పూర్తి కాగానే సెట్స్‌కు పోదామని సూచిస్తారట. ఇలా కథల విషయంలో ఎవరికి వారు తమదైన బాణీ పలికిస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎందుకని అందరికీ బాక్సాఫీస్ రిజల్ట్ ఒకే విధంగా రావడం లేదు అన్న ప్రశ్న తలెత్తక మానదు. అప్పుడు తప్పకుండా ఏ రంగంలోనైనా ‘ఆవగింజంత అదృష్టం ఉండాలి’ అనే పాత సామెతను అంగీకరించక తప్పదు. మరి టాలీవుడ్ టాప్ స్టార్స్ రాబోయే సినిమాలు ప్రేక్షకులను ఏ తీరున అలరిస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఊసేది.. ‘ఏకే 47’ పాటేది.. అసలేం జరుగుతుంది?
ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ టీమ్ చేయాల్సింది ఇదేనా..
‘ద ప్యారడైజ్’ వచ్చేది ఏ ఓటీటీలో అంటే..