కత్రీనా పని అయిపోయింది.. పూర్తిగా ఆంటీలా మారిపోయింది
ABN, Publish Date - Sep 15 , 2026 | 09:51 PM
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే ప్రసంశలు. ఒక్కసారి ఆ అందం తగ్గిందా ఇంక అంతే.. ట్రోల్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే ప్రసంశలు. ఒక్కసారి ఆ అందం తగ్గిందా ఇంక అంతే.. ట్రోల్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెళ్లి తరువాత హీరోయిన్లు మారినా.. బిడ్డకు జన్మనిచ్చాక కొంచెం బొద్దుగా అయినా కూడా సోషల్ మీడియాలో వారిపై వచ్చే విమర్శలు తట్టుకోవడం ఎవరి వలన కాదు. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ (Katrina Kaif) అలాంటి విమర్శలనే ఎదుర్కొంటుంది. ఒకప్పుడు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కత్రీనాను ఇప్పుడు ఆంటీ అంటూ కొందరు గేలి చేస్తున్నారు. పెళ్లి అయ్యి, ఒక బిడ్డకు జన్మనిచ్చాక కత్రీనా మాతృత్వపు తీపి జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్న సమయంలో ఇలాంటి అనుచిత విమర్శలు చేయడం సోషల్ మీడియాలోని దారుణమైన వైఖరికి అద్దం పడుతోంది.
కత్రీనా కైఫ్ గతరోజు జరిగిన వినాయక చవితి వేడుక ఈవెంట్‌కు తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాజరయ్యింది. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో గౌరవప్రదంగా మెరిసిన ఈ 43 ఏళ్ల నటి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఆమె ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో, ఆమె రూపంలో వచ్చిన మార్పులపై కొందరు నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఆమె ముఖంలో ఏజింగ్ షేడ్స్ కనిపిస్తున్నాయని, బోటాక్స్ వాడటం వల్లే ఇలా తయారైందని, ఒక నెటిజన్ ఐతే ఏకంగా'కత్రీనా పని అయిపోయింది.. ఆంటీలా మారిపోయింది అంటూ కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది.
ఈ నెగెటివ్ కామెంట్స్‌పై కత్రీనా అభిమానులు, మహిళా నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గర్భధారణ,ప్రసవానంతరం మహిళ శరీరంలో, ముఖంలో సహజంగానే అనేక మార్పులు వస్తాయని, ఒక కొత్తగా తల్లయిన స్త్రీ ఎదుర్కొనే శారీరక మార్పుల పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అంతేకాకుండా, అంతటి గ్లామర్ ఇండస్ట్రీలో ఉండి కూడా ఆమె ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తున్నారంటూ కత్రీనా పక్షాన నిలిచారు.
ఒక మహిళను కేవలం ఆమె రూపంతోనే కొలవకూడదని, నటిగా ఆమె సాధించిన విజయాలు, ఆమె సొంతంగా నడుపుతున్న విజయవంతమైన కే బ్యూటీ బ్రాండ్ సాధించిన పురోగతిని చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక పక్క నటిగా, మరోపక్క వ్యాపారవేత్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, ఇటు కుటుంబ జీవితాన్ని ఎంతో సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటున్న కత్రీనాపై ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం అనుచితమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా నెటిజన్లు నటీమణుల వ్యక్తిగత జీవితాలను, వారి శరీరంలో వచ్చే సహజమైన మార్పులను గౌరవించడం నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.