Kangana Ranaut: న్యాయపరమైన చిక్కుల్లో క్వీన్ 2
ABN, Publish Date - Jul 07 , 2026 | 12:05 PM
కంగనా రనౌత్ 'క్వీన్ 2'కు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఈ సినిమా నిర్మాణానికి తమ అనుమతి తీసుకోలేదంటూ ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టులో కేసు వేసింది.
నటిగా కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమౌతోంది కంగనా రనౌత్. గడచిన ఎన్నికల్లో మండీ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున విజయం సాధించినా, నటిగా మాత్రం కంగనా రనౌత్ కు ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పరాజయం పాలు అవుతున్నాయి. ఇదే సమయంలో కంగనా రౌనౌత్ కు పన్నెండేళ్ళ క్రితం విశేషమైన కీర్తిని తెచ్చిపెట్టిన 'క్వీన్' మూవీ సీక్వెల్ సైతం ఇబ్బందుల్లో పడింది. 'క్వీన్ 2' మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. 'క్వీన్' మూవీని డైరెక్ట్ చేసిన వికాస్ బహల్ ఈ సీక్వెల్ కూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే త్వరలో జనం ముందుకు రావాల్సిన ఈ సినిమా తాజాగా న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న జియో హాట్ స్టార్ పై ఫాంటమ్ స్టూడియోస్ బాంబే హైకోర్టులో ఏకంగా రూ. 250 కోట్ల పరిహారం కోరుతూ దావా వేసింది. తమ అనుమతి లేకుండా 'క్వీన్ 2' సినిమాఉన రూపొందిస్తున్నారని, ఇది ఇంటెక్చువల్ ప్రాపర్టీ హక్కులను ఉల్లంఘించడమేనని ఫాంటమ్ స్టూడియోస్ ఆరోపించింది.
'క్వీన్' చిత్రానికి సంబంధించిన మేధో సంపత్తి హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉందని, సీక్వెల్ ను నిర్మించే హక్కు కూడా అందులో భాగమేనని ఫాంటమ్ స్టూడియో తెలిపింది. తమ హక్కులకు భంగం కలిగిస్తూ ఇప్పుడు 'క్వీన్'కు సీక్వెల్ తీస్తున్నారని ఆరోపించింది. ఈ సినిమా సీక్వెల్ కు తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిపింది. నిజానికి ఈ యేడాది ఏప్రిల్ లోనే ఫాంటమ్ స్టూడియోస్ ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేయడమే కాకుండా జియో హాట్ స్టార్, డైరెక్టర్ వికాస్ బహల్ తో పలు మార్లు చర్చలు జరిగింది. అవేవీ ఒక కొలిక్కి రాకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. దీనిపై జియో హాట్ స్టార్ సంస్థ ఇప్పటి వరకూ స్పందించలేదు. దాంతో 'క్వీన్ 2' రిలీజ్ పై ఈ కోర్టు కేసు ప్రభావం పడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై కంగనా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి:
పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?
అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!
దివ్యభారతి గ్లామర్ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా.. ఫొటోలు వైరల్