Sanjay Gupta: ‘కాంటే’, ‘కాబిల్’ చిత్రాల దర్శకుడు ఇకలేరు..

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:49 AM

బాలీవుడ్‌లో ‘కాంటే’ వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా (59) కన్నుమూశారు.

బాలీవుడ్‌లో ‘కాంటే’ (Kante) వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా (Sanjay Gupta - 59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెల్సింది. శుక్రవారం రాత్రి ఆయన వాష్ రూమ్ లో పడిపోవడం, తలకు బలమైన గాయం కావడంతో మరణించినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. సంజయ్ గుప్తా మరణవార్తతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 


1994లో వచ్చిన ‘ఆతిష్’ సినిమాతో సంజయ్ గుప్తా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత యాక్షన్, థ్రిల్లర్ కథాంశాలతో పలు చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2002లో విడుదలైన ‘కాంటే’ సినిమాతో ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. క్వెంటిన్ టరంటీనో తెరకెక్కించిన ‘రెజర్వాయర్ డాగ్స్’ చిత్రం నుంచి స్ఫూర్తి పొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, కథనం గురించి గొప్పగా మాట్లాడుకునేవారు.  ఆ తర్వాత ‘జిందా’, ‘దస్ కహానియా’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. 2017లో హృతిక్ రోషన్ హీరోగా రూపొందించిన ‘కాబిల్’ ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘రాయిస్’తో పోటీగా విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం ‘ది మిరాండా బ్రదర్స్’. 2024లో ఈ సినిమా విడుదలైంది. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ సంజయ్ గుప్తా తనదైన ముద్ర వేశారు. ‘యాసిడ్ ఫ్యాక్టరీ’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’, ‘ప్లాన్’ వంటి చిత్రాలను నిర్మించారు. పలువురు కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. సోషల్ మీడియాలోనూ సంజయ్ గుప్తా చురుగ్గా ఉండేవారు. హిందీ చిత్ర పరిశ్రమలో మారుతున్న ట్రెండ్స్, సినిమాల నిర్మాణ శైలి, సమకాలీన చిత్రాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకునేవారు. చాలాసార్లు ఇతరులకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చల్లో నిలిచేవారు. యాక్షన్ సినిమాలకు తనదైన శైలిని పరిచయం చేసిన సంజయ్ గుప్తా మరణం బాలీవుడ్‌కు తీరని లోటని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. . ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:
IFFA: ఐఫా వేడుకల్లో ధురంధర్ జోరు.. రణ్‌వీర్‌కు ఉత్తమ నటుడి పురస్కారం!

DSP: దేశవ్యాప్తంగా ఫోక్ ఆర్టిస్టులు ఒక్కచోట.. ‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ స్పెషల్!

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

Updated Date - Oct 31 , 2026 | 01:11 PM