‘హనుమాన్ అంశ్’.. బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రం సంచలనం
ABN, Publish Date - Aug 27 , 2026 | 06:56 PM
భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
భారీ బడ్జెట్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక చిన్న భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీబ్ కరోరి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భక్తిరస డ్రామా ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రారంభంలో చాలా నెమ్మదిగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. తొలి రెండు వారాల్లో దేశవ్యాప్తంగా కేవలం రూ. 1.30 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. చాలా ప్రాంతాల్లో సరైన స్పందన లేక ఈ సినిమా థియేటర్లు, షోలు కూడా రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది.
అయితే, ప్రేక్షకుల్లో వచ్చిన బలమైన మౌత్ టాక్.. ఈ చిత్ర భవితవ్యాన్ని ఒక్కసారిగా పూర్తిగా మార్చివేసింది. సినిమాలోని ఆధ్యాత్మిక భావోద్వేగాలు, అద్భుతమైన కథనం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు ఈ చిత్రానికి షోలను భారీగా పెంచడం ప్రారంభించారు. రెండో వారంలో కేవలం 40 స్క్రీన్లలో మాత్రమే ఆడిన ఈ చిత్రం, ప్రేక్షకుల తాకిడితో మూడో వారానికి ఏకంగా దాదాపు 400 స్క్రీన్లకు పెరగడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అనే ఆఫర్ కూడా నడుస్తుండటంతో.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.
మరో పరీక్ష ఈ సినిమాకు మూడో వారంలో ఎదురైంది. పాన్-ఇండియా స్థాయిలో విడుదలైన యశ్ ‘టాక్సిక్’ వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, వాటిని తట్టుకుని ‘హనుమాన్ అంశ్’ వసూళ్ల జోరును చూపిస్తుండటమే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇప్పటివరకు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 8 కోట్ల నెట్ మార్కును విజయవంతంగా దాటేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ముంబై వంటి ప్రధాన సర్క్యూట్లలో ఈ సినిమా అత్యధిక వసూళ్లను నమోదు చేస్తూ స్ట్రాంగ్ మార్కెట్‌ను సొంతం చేసుకుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకుని భారీ లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది (2026) అత్యంత భారీ స్లీపర్ హిట్‌లలో ఒకటిగా నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంశ్’ తన విజయయాత్రను కొనసాగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
తుది దశకు చేరుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. టార్గెట్ డిసెంబర్
డైరెక్టర్ పవన్ సాధినేని కేసులో ట్విస్ట్.. పలువురు మహిళలతో!
మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి.. ‘ఇరుముడి’పై చిరు పోస్ట్ వైరల్