గాడ్జిల్లా ఎఫెక్ట్.. ఒక రోజు ముందుగానే వస్తోన్న ‘రామాయణ'
ABN, Publish Date - Sep 16 , 2026 | 07:36 AM
భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'రామాయణ' (Ramayana) చిత్రం మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'రామాయణ' (Ramayana) చిత్రం మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్ (ranbir kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి (sai pallavi) సీతగా, యశ్ (yash) రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో జపాన్ కు చెందిన 'గాడ్జిల్లా మైనస్ జీరో' (Godzilla Minus Zero) చిత్రం కూడా బరిలోకి దిగుతుండడంతో ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.
ఒకే రోజున రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండటం ఎప్పుడూ టెన్షనే మరి! విజువల్ ఎఫెక్ట్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ఈ రెండూ. అలాగే రెండూ ఐమ్యాక్స్ ఫార్మెట్ తో ఐ మ్యాక్స్ థియేటర్స్లో విడుదలవుతుండడంతో థియేటర్ల సమస్య ఎదురవుతోంది. అలాగే వసూళ్ల మీద కూడా ప్రభావం చూపించే అవ కాశం ఉంది. ఓవర్సీస్లో ఈ సినిమాను విడుదల చేస్తున్న సోనీ పిక్చర్స్ సంస్థ ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఆస్ట్రేలియాలో మాత్రం ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 5న రామాయణ' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
యధావిధిగా అక్కడ నవంబర్ 6న 'గాడ్జిల్లా మైనస్ జీరో' చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను జపాన్లో మూడు రోజుల ముందుగానే అంటే నవంబర్ 3నే విడుదల చేయనున్నారు. ఆరున మిగిలిన అన్ని దేశాల్లో రిలీజ్ అవుతుంది. దేశీయ మార్కెట్లో 'రామాయణ' చిత్రానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ గ్లోబల్ మార్కెట్ లో 'గాడ్జిల్లా మైనస్ ఫోర్' చిత్రం నుంచి ఇలా ఎదురవుతున్న గట్టి పోటీని మన ఇతిహాస పౌరాణిక చిత్రం 'రామాయణ' ఏ మేరకు తట్టుకోగలదా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.