సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు

ABN, Publish Date - Apr 13 , 2026 | 03:23 PM

మరపురాని మధురగాయని ఆశా భోస్లేకు అశ్రునయనాలతో అభిమానులు వీడ్కోలు పలికారు. ఆశా మధురగానాన్ని మననం చేసుకుంటూ ఆమె అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

ఆశా భోస్లే (Asha Bhosle) గళ విన్యాసాలకు అభిమానులు కాని వారుండరు. ఒక్కసారి ఆశా గాత్రంతో స్నేహం చేస్తే చాలు ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంటుందని ప్రతీతి. ఆశా గళం నుండి జాలువారిన సినిమా గీతాలు, గజల్స్, భజన్స్, పాప్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, శాస్త్రీయ సంగీతం- అన్నీ భారతీయ సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 12000 పాటలు పాడి 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లో చోటు దక్కించుకున్నారు ఆశా. మేరునగ సమానురాలయిన అక్క లతా మంగేష్కర్ గానవైభవం సాగుతూ ఉండగానే ఆశా తనదైన బాణీ పలికించడం విశేషం. అక్క ఛాయ నుండి బయటపడి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు ఆశా. రెండు సార్లు ఉత్తమగాయనిగా నేషనల్ అవార్డు అందుకున్న ఆశా భోస్లే కీర్తి కిరీటంలో 'పద్మవిభూషణ్'తో పాటు పలు అవార్డులు రత్నాల్లా వెలుగుతూనే ఉన్నాయి. ఆ వెలుగును మనకు వదిలేసి మరలిరాని లోకాలకు తరలిపోయారు ఆశా. ఆమె పంచిన మధురాన్ని మననం చేసుకుంటూ అభిమానులు బాధను దిగమింగారు.


భారతీయ సినిమా ప్రపంచంలో గానకోకిలగా రాజ్యమేలిన లతా మంగేష్కర్ చెల్లెలిగా ఆశా గానం ఆరంభమైంది. అయితే అక్క ప్రభావం తనపై పడకుండా జాగ్రత్త పడుతూనే ఆశా గళవిన్యాసాలు సాగాయి. అందుకు ఆమె భర్త గణపత్ రావ్ భోస్లే సహాయ సహకారాలు మరువలేనివి. ఇక ఓ.పి.నయ్యర్ స్వరకల్పనలో ఆశా గాత్రంలో జాలువారిన గీతాలు అభిమానులను కట్టిపడేశాయి. భోస్లే మరణానంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్‌ను వివాహమాడిన తరువాత కూడా ఆశా భోస్లే గాన విన్యాసాలు సంగీతాభిమానులను పులకింప చేశాయి. కొన్ని పాటలు లతా మంగేష్కర్ కంటే ఆశా నే బాగా పాడగలదు అనే పేరూ సంపాదించారు. ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు ఆమెతో తమ అనుబంధాన్ని తలచుకొని కన్నీరు మున్నీరయ్యారు.


ఆశా భోస్లే - ఆర్డీ బర్మన్ కాంబోలో రూపొందిన అనేక గీతాలు ఈ నాటికీ అభిమానులను పులకింప చేస్తూనే ఉన్నాయి. దాసరి నారాయణరావు 'పాలు-నీళ్ళు'లో తొలిసారి తెలుగు పాట పాడిన ఆశా భోస్లే, తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లోనూ తన గానంతో ఆకట్టుకున్నారు. వెంకటేశ్ 'పవిత్రబంధం' మూవీలో తెరపైనా కనిపించారు ఆశా. తన భర్త ఆర్డీ బర్మన్ బాణీల్లో రూపొందిన 'చిన్నికృష్ణుడు'లో బాలుతో కలసి పాడిన యుగళగీతం తనకెంతో ఇష్టమని చెప్పేవారామె. యావద్భారతంలోని సంగీతాభిమానులను దుఃఖసాగరంలో ముంచుతూ ఆశా దివికేగారు. ఆమె పాట మాత్రం మనతోనే ఉంది. ఆ మధురం మనకు ఆనందం పంచుతూనే ఉంటుంది.

Updated Date - Apr 13 , 2026 | 03:26 PM