‘రెహనా హై తేరే దిల్ మే’ వెనుక ఆసక్తికర కథ
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:53 PM
దియా మీర్జా తొలి హిందీ చిత్రం ‘రెహనా హై తేరే దిల్ మే’ విడుదలై పాతికేళ్లు పూర్తయ్యాయి. అయితే ఆమె మొదట సంతకం చేసిన సినిమా ‘ఓం జై జగదీశ్’. తన బాలీవుడ్ ఎంట్రీ వెనుక ఆసక్తికర విషయాలను దియా మీర్జా వెల్లడించారు.
హైదరాబాదీ అమ్మాయి దియా మీర్జా బాలీవుడ్ లో పాతికేళ్ళ క్రితం జెండా పాతేసింది. ఇప్పటికీ, నటిగా, నిర్మాతగా రాణిస్తోంది. తెలుగులోనూ నాగార్జునతో 'వైల్డ్ డాగ్'లో నటించి మెప్పించిన దియా మీర్జా తొలి హిందీ చిత్రం 'రెహనా హై తేరే దిల్ మే'. మాధవన్ హీరోగా, దియా మీర్జా హీరోయిన్ గా నటించిన ఆ సినిమా విడుదలైన నేటికి పాతికేళ్ళు పూర్తయ్యింది. గౌతమ్ వాసుదేవ మీనన్ తమిళంలో తీసిన 'మిన్నలే' చిత్రానికి ఇది రీమేక్. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ హిందీ రీమేక్ కూడా చేశారు. ఈ సినిమాను వషు భగ్నానీ నిర్మించారు. విశేషం ఏమంటే... అసలు ఇది తన తొలి సినిమా కాదని దియా మీర్జా తెలిపింది.
తన బాలీవుడ్ ఎంట్రీ గురించి చెబుతూ, '2000 సంవత్సరంలో నేను మిస్ ఇండియా ఏసియా ఫసిఫిక్ గా ఎంపికయ్యాను. ఆ అందాల పోటీలో పాల్గొని హైదరాబాద్ వచ్చాక ఓ హోటల్ లో గ్రాండ్ పార్టీ జరిగింది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన హీరో అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ ఆ హోటల్ లాబిలో నన్ను చూశారు. అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం 'ఓం జై జగదీశ్' కోసం నన్ను తీసుకోవాలని ఆయనకు అనిపించింది. అయితే అందాల రాణిగా ఎంపికైన వెంటనే సినిమాల్లో నటించాలని నేను అనుకోలేదు. కానీ అనుపమ్ ఖేర్ మా పేరెంట్స్ ను కలిసి ఒప్పించారు. అలా నేను సంతకం చేసిన తొలి చిత్రం 'ఓం జై జగదీశ్'. ఆ సినిమా కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారాను. 'ఓం జై జగదీశ్' మూవీకి టోకెన్ అమౌంట్‌గా అనుపమ్ ఖేర్ పదకొండు వేల రూపాయలు ఇస్తే... కొత్త ఇంటి ఫర్నీచర్ కొనుక్కున్నాను' అని దియా మీర్జా తెలిపింది.
'ఓం జై జగదీశ్' సినిమా షూటింగ్ కు ముందు రంగస్థల దర్శకుడు ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ నిర్వహించిన వర్క్ షాప్ లో దియా మీర్జా పాల్గొంది. అదే సమయంలో వషు భగ్నానీ ఆమెకు 'దీవానాపన్' చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సంతకం చేసిన మూడో సినిమా 'రెహనా హై తేరే దిల్ మే'. ఇలా ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే విషు భగ్నానీ ప్రొడక్షన్ హౌస్‌లో వరుసగా మూడు సినిమాలకు సైన్ చేయడం తాను అసలు ఊహించలేకపోయానని దియా మీర్జా తెలిపింది. 'ఒక కొత్త నటికి ఇలాంటి అవకాశాలు రావడం నిజంగా గ్రేట్. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పింది. దియా మీర్జా సంతకం చేసిన తొలి చిత్రం 'ఓం జై జగదీశ్' అయినా, విడుదలైన చిత్రం 'రెహనా హై తేరే దిల్ మే'. ఆ తర్వాత 'దీవానాపన్' విడుదలైంది. చిత్రం ఏమంటే... ఏ సినిమాకైతే ఆమె మొదట సైన్ చేసిందో ఆ 'ఓం జై జగదీశ్'లో దియా మీర్జా నటించలేదు. ఆమె స్థానంలో చివరి నిమిషంలో తారాశర్మను తీసుకున్నారు. ఏదేమైనా... విషు భగ్నానీ బ్యానర్ లో తాను హీరోయిన్గా పరిచయం కావడం, తన తొలి చిత్రం విజయవంతమై, ఇవాళ్టితో పాతికేళ్ళు పూర్తి చేసుకోవడం తనకు గొప్ప ఆనందాన్ని కలిగించే అంశమ'ని దియా మీర్జా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు
బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో ‘విరోష్’ సందడి
‘జైలర్ 2’ సెట్లో మోహన్ బాబు.. ‘జైలర్ 3’లో ఏమైనా?