సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akella Shiva Prasad: . రామాయణం.. ఆంజనేయుడి ఆశీర్వాదం.. నా అదృష్టం..

ABN, Publish Date - Nov 01 , 2026 | 11:55 AM

బాలీవుడ్లో తెరకెక్కిన 'రామాయణం’ సినిమాకు రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ తెలుగులో మాటలు రాశారు. ‘రామాయణం’తో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.

‘రామాయణం’(Ramayanam).. ఈ వారంలో విడుదలవుతున్న ఈ చిత్రం కోసం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రణబీర్‌కపూర్‌, యశ్‌, సాయిపల్లవి ప్రధాన తారాగణంగా, నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా.. ఆ చిత్ర సంభాషణలను తెలుగు రాసిన ‘రంగమార్తాండ’, ‘కన్నప్ప’ చిత్రాల రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ (Akella Shiva prasad) ‘రామాయణం’తో తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు. 

‘‘ముందుగా ‘రామాయణం’ సినిమాకు డైలాగులు రాయాలంటూ... గోశాల రాంబాబు అనే గీత రచయితకు అవకాశం వచ్చింది. ఆయన ‘కాంతార’ సినిమాకు తెలుగు పాటలు రాశారు. ‘‘నేను పాటలు మాత్రమే రాస్తాను. ‘రంగమార్తాండ’, ‘కన్నప్ప’ సినిమాలకు డైలాగులు రాసిన ఆకెళ్ల శివప్రసాద్‌ను సంప్రతించండి. ఆయన మీకు ఎలా కావాలంటే అలా చక్కగా రాస్తారు’’ అని ఆయన చెప్పడంతో... ఆ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ‘కన్నప్ప’ సినిమా పూర్తిగా పౌరాణికం, ‘రంగమార్తాండ’ ఒక డ్రామా. ఈ రెండు సినిమాల్లో డైలాగులు బాగుంటాయినే పేరు రావడంతో ప్రకాశ్‌రాజ్‌గారి స్నేహితుడు సురియా నన్ను సంప్రతించారు. డబ్బింగ్‌ రచయితలు కాకుండా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో రాసే ఒరిజినల్‌ రచయితలను తీసుకుంటే ఆ భాషల నుడికారం బాగుంటుందని దర్శకుడు నితిశ్‌ తివారీ చెప్పడంతో తెలుగు డైలాగ్స్‌ రాసే పని నాకు అప్పగించారు.

ఆ రెండు సన్నివేశాలతో...

ముందుగా రెండు హిందీ సీన్లు నాకు పంపించారు. మొదటిది కైకేయి కోపగృహంలోకి వెళ్లిన సన్నివేశం, రెండోది శూర్పణఖ ముక్కు, చెవులను లక్ష్మణుడు కోసిన ఘట్టం. వెంటనే వాటిని తెలుగులో రాసి పంపాను. నాలుగు రోజుల తరువాత డైలాగులు బాగున్నాయంటూ వెబ్‌ మీటింగ్‌ నిర్వహించారు. అందులో నితిశ్‌ తివారీ కూడా తెలుగు పదాలు బాగున్నాయంటూ మెచ్చుకోవడంతో అగ్రిమెంట్‌ చేసుకున్నాం. హిందీ సినిమా చూడడానికి ముంబై రమ్మని పిలిచారు. అప్పటికే ప్రాథమికమైన ఎడిటింగ్‌ పూర్తయింది. తరువాత కూడా రెండు నెలల్లో ఆరేడుసార్లు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మొదట ఒక వెర్షన్‌ రాసుకొని వెళ్లేవాళ్లం. అక్కడ అన్ని భాషల రచయితలు ఎవరి డైలాగులను వారు చదివేవారు. ఏ భాషలో బాగుంటే దాన్నే మిగిలినవారందరినీ పాటించమనేవారు. మొత్తమ్మీద తెలుగు డైలాగులు చాలా బాగున్నాయనే పేరొచ్చింది. హిందీ సంభాషణలను అర్థం చేసుకుంటూ అందరం చర్చించుకుంటూ పని పూర్తిచేశాం.

‘తెలుగులోనే ఈజీగా ఉంద’ని అన్నారు...

తెలుగు భాషకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి. మాటల్లో, నుడికారంలో డైలాగులు బాగా పండాయి. అన్ని భాషలకూ... భాషాపరమైన నేటివిటీకి అవకాశం ఇచ్చారు. మామూలుగా డబ్బింగ్‌ సినిమాల్లో డైలాగ్‌ లెంగ్త్‌ ప్రకారం ‘10 లేదా 30 సెకన్లు’ అని చేసుకుంటూ వెళతారు. ఇప్పుడు మనకు లిప్‌ సింకింగ్‌లో కూడా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వచ్చేసింది. దీనివల్ల డైలాగ్‌ రాయడంలో కాస్త స్వేచ్ఛ దొరుకుతుంది. ఉదాహరణకు ‘రాముడు ధర్మజ్ఞుడు’ లేదా ‘రాముడు ధర్మాత్ముడు’ అనాల్సిన చోట ‘ధర్మాత్ముడు రాముడు’ అన్నా లిప్‌సింక్‌లో తేడా కనిపించదు. అచ్చంగా తెలుగులోనే మాట్లాడుతున్నారనిపిస్తుంది. హిందీలో కొన్ని పదాలు చాలా చిన్నగా ఉంటాయి. ఉదాహరణకు ‘భాగ్య్‌’ అనే పదాన్ని మూడు నాలుగుసార్లు వాడారు. దీనికి తెలుగులో ‘అదృష్టం’, ‘భవితవ్యం’, ‘విధి’, ‘విధి రాత’ అనే పదాలు ఉపయోగించాను. ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నప్పటికీ లిప్‌సింక్‌ టెక్నాలజీతో తేడా రాలేదు. ‘యే మేరా భాగ్య్‌ హై’ అన్నచోట మాత్రం ‘ఇది నా సుకృతం’ అని వాడాను. ఇది తెలుగులో చక్కని పదం. అందరికీ నచ్చింది. డబ్బింగ్‌ చెప్పిన రాజేష్ మూర్తి కూడా మెచ్చుకున్నారు. ఇలా హిందీలో ఒకే పదానికి తెలుగులో అయిదారు పదాలు రాసే సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నాను. అలాగే ‘నిర్ధార్‌ కర్తా’ అనే పదానికి ‘నిర్ధారిస్తాయి’ అనడానికి బదులు ‘నిర్దేశిస్తాయి’ అని రాశాను. సాధ్యమైనంత వరకూ సృజనాత్మక ధోరణినే అనుసరించాను. ఇప్పటివరకూ ఆ సినిమాను డబ్బింగ్‌కు ముందు అయిదుసార్లు, డబ్బింగ్‌ తరువాత నాలుగుసార్లు, మాక్‌ డబ్‌ సమయంలో రెండుసార్లు, ఫైనల్‌ డబ్బింగ్‌ తరువాత మూడుసార్లు చూశాను. ప్రీమిక్స్‌ తరువాత మరోసారి చూడాలి. తెలుగు, తమిళంలో సీత పాత్రకు సాయిపల్లవి డబ్బింగ్‌ చెప్పారు. తమిళ డబ్బింగ్‌కు ఒకటిన్నర రోజులు పడితే తెలుగుదాన్ని మాత్రం చాలా ఈజీగా ఉందంటూ ఆరు గంటల్లో పూర్తిచేశారు. ఆమె హిందీ డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ తెలుగులో హావభావాలు పలికించారు. తెలుగులో రాముడి పాత్రకు భార్గవ్‌, రావణాసురుడికి వాసు డబ్బింగ్‌ చెప్పారు.

ప్రతి సీన్‌ అద్భుతమే...

నితిశ్‌ తివారీ అద్భుతమైన డైరెక్టర్‌. ఆయన ప్రత్యేకత ఏమిటంటే... పాత్రల స్వభావాన్ని అనుసరించి డైలాగులు ఉండాలనుకుంటారు. అంటే రాముడు, దేవతలు, రుషులకు సంబంధించిన సంభాషణలు మరీ గ్రాంథికంగా కాకపోయినా కొంతవరకు క్లాస్‌గా ఉండాలని చెప్పారు. మిగిలిన పాత్రలన్నిటికీ... అందరికీ అర్థమయ్యేలా వ్యవహారిక భాషనే వాడమన్నారు. మరీ కఠినమైనవి కాకుండా కొన్ని పౌరాణిక పదాలు, కొన్ని కావ్య సంబంఽధిత పదాలు వాడే స్వేచ్ఛనిచ్చారు. పాండిత్య ప్రదర్శనలా ఉండకూడదని మరీమరీ చెప్పారు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌లు బాగుంటాయి. అయోధ్య వైభవాన్ని, స్వర్ణ లంక ప్రాభవాన్ని గొప్పగా చూపించారు. అలాగే పాతాళలోకాన్ని, అరణ్యాలను అత్యంత సహజసిద్ధంగా ఆవిష్కరించారు. ఇలా ప్రతి సీన్‌ అద్భుతంగా అనిపిస్తుంది. రాముడు వనవాసానికి వెళుతున్నప్పుడు ఆయన రథానికి 14 ఇరుసులను చూపించడం గొప్పగా ఉంది. దాదాపు ఎనిమిదేళ్లు శ్రమించి ఈ సినిమాను తీర్చిదిద్దారు. సినిమా అంతటా రాముడిలో ఉండే స్థితప్రజ్ఞత రణ్‌బీర్‌ కపూర్‌లో, సీతలో ఉండే సౌశీల్యం సాయిపల్లవిలో, రావణాసురుడిలో ఉండే క్రోధం యశ్‌లో, శూర్పణఖ కళ్లలో ఉండే మోహం రకుల్‌ప్రీత్‌సింగ్‌లో కనిపిస్తుంటాయి.

ఆయన ఆశీర్వాదమే...

నా దగ్గర ‘ఉషశ్రీ రామాయణం’ ఉంది. రామాయణాన్ని తరచూ చదువుతున్నా కూడా ఒక సినిమా కోసం మాత్రం విభిన్నమైన వెర్షన్‌లో చదవాల్సి వచ్చింది. భద్రాచల రాముడి కల్యాణం ప్రసారమైతే... గంటసేపు రేడియో ముందు నుంచి కదిలేవాళ్లం కాదు. అలా రామాయణం మనలో అణువణువునా నిండి ఉంటుంది. చిన్నప్పుడు కాస్త భయంగా అనిపిస్తే... వెంటనే హనుమాన్‌ చాలీసా చదువుకోమని అమ్మ చెప్పేది. హనుమాన్‌ చాలీసా అంటే రామాయణ గాథే కదా! ఇంతకుముందు ‘రంగమార్తాండ’ సినిమాకు సంభాషణలు రాశాను. అది మనిషి కథ. తరువాత ‘కన్నప్ప’కు రాశాను. అది భక్తుడి కథ. ఇప్పుడు ‘రామాయణం’ చిత్రానికి రాశాను. ఇది దేవుడి కథ. ఇలా మూడూ వరుసగా రావడం నా అదృష్టం. ‘కన్నప్ప సినిమా ప్రీమియర్‌ షోకి 109 ఏళ్ల గురువుగారొకరు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా రచయితకు సనాతన ధర్మంపై మంచి అవగాహన ఉందని పొగిడారు. రెండు నెలల తరువాత నేను అమీర్‌పేటలో ఆయన వద్దకు వెళ్లాను. చాలాసేపు మాట్లాడుకున్న తరువాత నేను బయలుదేరుతుంటే ఆయన ‘‘ఒక్క నిముషం ఆగండి’’ అంటూ అయోధ్య నుంచి తెచ్చిన బాల రాముడి నల్లరాతి విగ్రహాన్ని నా చేతుల్లో పెట్టారు. ఈ సంఘటన జరిగిన ఆర్నెల్లకు నాకు ‘రామాయణం’ సినిమా అవకాశం వచ్చింది. ఇది ఆనాడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే అనుకుంటున్నాను. ఇప్పుడు మినీ రామాయణాన్ని తెలుగులో అనువదిస్తున్నాను.

Updated Date - Nov 01 , 2026 | 12:36 PM