The Hunt: రాజీవ్ గాంధీ హత్య కేసుపై వెబ్ సీరిస్
ABN , Publish Date - Jun 18 , 2025 | 08:53 PM
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య, తదనంతర సంఘటనలపై ఓ వెబ్ సీరిస్ ను జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు నగేశ్ కుకునూర్ రూపొందించారు. ది హంట్ రాజీవ్ గాంధీ హత్యకేసు అనే ఈ వెబ్ సీరిస్ సోనీ లివ్ లో ప్రసారం కానుంది.

'హైదరాబాద్ బ్లూస్' సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు నగేశ్ కుకునూర్ (Nagesh Kukunoor). ఆ తర్వాత బాలీవుడ్ (Bollywood) బాట పట్టి అక్కడే సినిమాలను రూపొందిస్తున్నారు. అడపా దడపా ఒకటి రెండు తెలుగు సినిమాలను నగేశ్ కుకునూర్ తీశారు.
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన 'నైంటీ డేస్' (90 days) పుస్తకం ఆధారంగా నగేశ్ కుకునూర్ సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, కుకునూర్ మూవీస్ తో కలిసి ఓ వెబ్ సీరిస్ ను రూపొందించారు. అదే 'ది హంట్: రాజీవ్ గాంధీ హత్యకేసు' (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ పొలిటిక్ థ్రిల్లర్ సీరిస్ జూలై 4 నుండి సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కాబోతోంది.
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. అయితే అందులో చాలా వరకూ శ్రీలంక తమిళులను, ఎల్.టి.టి.ఈ. తీవ్రవాదులను సపోర్ట్ చేస్తున్నట్టుగానే వచ్చాయి. రాజీవ్ గాంధీ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించిన అప్పటి భారత ప్రభుత్వం, గూఢచార సంస్థలు నేరస్థులను గుర్తించడంలో చాలా చొరవ చూపించారు. వారిలో కొందరు సజీవంగా పట్టుకుని కోర్టులో నిలబెట్టారు. అందులో ఎస్.ఐ.టి. ఛీఫ్ డి.ఆర్. కార్తికేయన్ ది కీలకమైన పాత్ర. అలానే ఆయన తోటి అధికారులు సైతం ఈ కేసు ఛేదించడానికి సహకరించారు. వీరిందరి ఇన్వెస్టిగేషన్ తాలుకు సమాచారంతో రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్ తో కలిసి నగేష్ కుకునూర్ ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. రాజీవ్ గాంధీ హత్యను అడ్డుకోలేకపోవడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందన్నది అందరూ చెప్పే మాట. దానికి గానూ దేశం ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో కూడా ఇందులో చూపించారని తెలుస్తోంది.
'ది హంట్: రాజీవ్ గాంధీ హత్య కేసు'లో డి.ఆర్, కార్తికేయన్ గా అమిత్ సియాల్, అమిత్ వర్మ గా సాహిత్ వైద్, రాఘవన్ గా భగవతీ పెరుమాళ్, అమోద్ కాంత్ గా డానిష్ ఇక్బాల్, రాధా వినోద్ రాజ్ గా గిరీశ్ శర్మ, కెప్టెన్ రవీంద్రన్ గా విద్యుత్ గార్గ్ నటించారు. ఇక ఇందులోని ఇతర కీలక పాత్రలను శఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శ్రుతిజయన్, గౌరి మీనన్ పోషించారు.
Also Read: Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు
Also Read: Shilpa Shetty: స్టార్ హీరోయిన్ రెస్టారెంట్.. నెలకు రూ. 6 కోట్ల ఆదాయం