Mass Jathara: ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆలపించిన 'హుడియో హుడియో' సాంగ్
ABN, Publish Date - Oct 08 , 2025 | 12:01 PM
మాస్ మహరాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' నుండి మరో పాట వచ్చేసింది. 'హుడియో హుడియో' అంటూ సాగే ఈ పాటను భీమ్స్ స్వరపర్చి పాడగా, మరో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ గొంతు కలిపారు.
'మాస్ జాతర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా 'హుడియో హుడియో' అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్, మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో కనిపిస్తోంది. ఇక శ్రీలీల మరోసారి తెరపై వెలుగులు వెదజల్లారు. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ అందమైన గీతానికి మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. దేవ్ రచించిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి తనే పాడగా, అతనితో మరో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ గొంతు కలపడం విశేషం. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతోంది.