Allu Arjun - Atlee: దీపికానే ఫైనల్!
ABN, Publish Date - Jun 07 , 2025 | 12:32 PM
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లకు సన్ పిక్చర్స్ సంస్థ ఫుల్ స్టాప్ పెట్టేసింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మూవీలో దీపికా పదుకొణే కీలక పాత్ర పోషిస్తోందని మేకర్స్ తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రముఖ దర్శకుడు అట్లీ (Atlee) చిత్రానికి సంబంధించి అసలు సిసలు అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రారంభంలో ఇందులో దీపికా పదుకొనే నాయికగా నటించబోతోందనే వార్త వచ్చింది. అయితే ఆ తర్వాత దీపికా పదుకొనే (Deepika Padukone) 'స్పిరిట్' (Spirit) మూవీ నుండి తప్పుకున్న నేపథ్యంలో బన్నీ, అట్లీ మూవీ నుండి కూడా ఆమెను తొలగించారనే ప్రచారం జరిగింది. షూటింగ్ పని గంటల విషయంలో దీపికా పదుకొనే నియంత్రణ విధించిందని, అలానే తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. అంతే కాదు... 'కల్కి -2' (Kalki -2) సినిమా నుండి కూడా ఆమెను తొలగించబోతున్నారనే పుకారు సైతం షికారు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపిక నటిస్తోందనే గ్రేట్ అప్ డేట్ ను మేకర్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ దిగ్గజ సంస్థ, కళానిధి మారన్ కు చెందిన సన్ పిక్చర్స్ దీనిని నిర్మిస్తోంది. తాజాగా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతున్న విషయాన్ని చెబుతూ, ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
దీపికా పదుకొనే కు సంబంధించిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొనె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది. హెడ్గేర్ను ధరించి ఆమె ఫుల్ కాస్ట్యూమ్స్‌తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. మరోసారి క్వీన్ విజయం సాధించనుందనేది దీంతో స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ, ' జవాన్ మూవీ కోసం దీపిక మేడమ్ తో కలిసి పనిచేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి ప్రతి ఫ్రేమ్ లో చూపిస్తూ అందరినీ తన వైపుకు తిప్పుకునే గ్రేస్ ఆమెకు ఉంది. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు దీపికా పదుకొనె గారు కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇందులో సృష్టించబోతున్నాం’ అని అన్నారు.
సన్ పిక్చర్స్ స్పందిస్తూ 'దీపికా పదుకొనె మా ప్రాజెక్ట్‌లో జాయిన్ కావటం అనేది ప్రాజెక్ట్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆమె స్టార్ పవర్, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్లతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానికి సినిమాను రూపొందించబోతున్నాం’’ అన్నారు.
Also Read: Film Chamber: సమస్యల పరిష్కార దిశగా తొలి అడుగు
Also Read: Rukmini Vasanth: ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి