Mallesam: హీరోని చేసిన డైరెక్టర్ కు నో చెప్పిన ప్రియదర్శి

ABN, Publish Date - May 07 , 2025 | 06:31 PM

'మల్లేశం' ఫేమ్ రాజ్ రాచకొండ తెరకెక్కించిన సినిమా '23'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ప్రియదర్శి, చంద్రబోస్ అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి హీరోగా పరిచయం అయిన సినిమా 'మల్లేశం'. ఈ సినిమా విడుదలై ఐదేళ్ళు అయ్యింది. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ రాచకొండ ఇప్పుడు '23' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం మే 16న విడుదల కాబోతోంది. ఈ మధ్యలో ఆయన '8 ఎ.ఎం. మెట్రో' అనే హిందీ సినిమాను కూడా తీశారు. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల ఆధారంగా ఆ హిందీ సినిమా రూపుదిద్దుకుంది. ఇక '23' విషయానికి వస్తే... చిలకలూరి పేట బస్సు దహనం కేసు నేపథ్యంలో ఇది తెరకెక్కింది. అలానే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను కూడా ఈ సినిమాలో దర్శకుడు రాజ్ చూపించే ప్రయత్నం చేశారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రానికి వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి గీత రచయిత చంద్రబోస్, నటుడు ప్రియదర్శి అతిథులుగా హాజరయ్యారు.


ఈ సినిమాకు పాటలు రాసే క్రమంలో దీనిని చూశానని, చాలా నిజాయితీతో రాజ్ దీనిని తెరకెక్కించారని, ఇందులో మూడు పాటలను రాశానని చంద్రబోస్ తెలిపారు. వజ్ర సంకల్పం ఉన్న దర్శకుడు రాజ్ తనలోని నిజాయితీని ఈ చిత్ర బృందంలోకి ప్రవహింప చేశారని ఆయన కితాబిచ్చారు. నటీనటులంతా చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారని, ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతోందని అన్నారు. 'మల్లేశం' సినిమా ప్రియదర్శికి ఎలా నటుడిగా జన్మనిచ్చిందో ఈ సినిమా కూడా ఇందులోని నటీనటులకు కొత్త జన్మనివ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రియదర్శి మాట్లాడుతూ, ''ఐదేళ్ళ క్రితం ఇదే వేదిక మీద 'మల్లేశం' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. నా కెరీర్ కు కొత్త ఊపిరి ఇచ్చిన వ్యక్తి రాజ్. ఆ కృతజ్ఞతతోనే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమా కథ నాకు తెలుసు. ఇందులో నటించమని రాజ్ నన్ను అడిగారు. వేరే ప్రాజెక్ట్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఇది చాలా గొప్ప సినిమా. ట్రైలర్ చూసిన తర్వాత నేను చేసే ఉంటే బాగుండేది కాదా అనిపించింది'' అని అన్నారు.


డైరెక్టర్ రాజ్ రాచకొండ మాట్లాడుతూ, ''చాలా స్ట్రాంగ్ టెక్నికల్ టీం తో చేసిన సినిమా '23'. మార్క్ మ్యూజిక్ చేశారు. చంద్రబోస్ గారు, ఇండస్, రెహమాన్ లాంటి రచయితలు సినిమాకి పాటలు రాశారు. కార్తీక్, చిన్మయి, రమ్య బెహరా, కైలాష్ ఖేర్ లాంటి ప్రముఖ సింగర్స్ పాటలు పాడారు. చిన్న సినిమాల్లో ఇది చాలా పెద్ద సినిమా. థియేటర్ కోసం చాలా శ్రద్ధ తీసుకుని టెక్నికల్ గా చాలా ఫోకస్ తో చేసిన సినిమా ఇది. '23' అనేది థియేటర్ కి పర్ఫెక్ట్ సినిమా. దీన్ని థియేటర్స్ లో చూడండి. అక్కడ చూస్తే ఓటిటిలో కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు థియేటర్స్ లో ఆడితే థియేటర్స్ కల్చర్ బావుంటుంది. ఇలాంటి సినిమాలను ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను'' అని అన్నారు. ఈ చిత్రంలో యువ జంటగా నటించిన తేజ, తన్మయి, పవన్ రమేశ్‌, ప్రణీత్ తదితరులు తమ అనుభవాలను తెలిపారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అంతా పాల్గొంది.

Also Read: Kannappa: ‘కన్నప్ప’ కోసం అమెరికాకు విష్ణు మంచు! గ్లోబల్ ప్రమోషన్స్ షురూ

Also Read: Devendra Fadnavis: త్వరలో అహల్యాబాయి బయోపిక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 07 , 2025 | 06:31 PM