Devendra Fadnavis: త్వరలో అహల్యాబాయి బయోపిక్

ABN , Publish Date - May 07 , 2025 | 01:47 PM

రాణి అహల్యాబాయి త్రిశత జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె బయోపిక్ ను నిర్మించబోతోంది.

మూడు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో హిందూ ధర్మరక్షణ కోసం పోరాడిన మహిళ అహల్యాబాయి హోల్కర్ (Ahilyabai Holkar). దేశాన్ని దోపిడీదారుల నుండి, మొగలాయిల నుండి రక్షించిన ధీరోదాత్త వనిత ఆవిడ. ఇండోర్ మహారాణిగా ఆ ప్రాంత ప్రజలకు సేవచేయడంతో పాటు... ధర్మాన్ని రక్షించాలనే సంకల్పంతో పురాతన దేవాలయాలను, మొగలాయిలు ధ్వంసం చేసిన గుడులను ఆమె పునర్ నిర్మించారు. దాంతో ఆమెను అప్పటి ప్రజలు రాజమాతగా గౌరవించారు. భర్త, మావగారు, ఏకైక కుమారుడు మరణించినా తమ ప్రాంతాన్ని కాపాడాలని, ప్రజలను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో అహల్యాబాయి రాజ్యాధికారాన్ని చేపట్టి... మూడు దశాబ్దాల పాటు ఇండోర్ ప్రాంతాన్ని పరిపాలించింది. దక్షిణ భారతదేశంలోని పలు దేవాలయాలను సైతం ఆమె పునర్ నిర్మించారు. 2025 మే 31 ఆమె త్రిశత జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం అహల్యాబాయి హోల్కర్ జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించనుంది.


అహల్యాబాయి హోల్కర్ సినిమా గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తాజాగా ఓ ప్రకటన చేశారు. రాణి అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా ఆమె జీవితగాథను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. మరాఠీలో ఈ సినిమాను నిర్మించి, ఇతర భారతీయ భాషల్లోకి తర్జుమా చేస్తామని, దీనిని దూరదర్శన్ తో పాటు వివిధ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రసారం చేస్తామని తెలిపారు. గోరేవావ్ లోని ఫిల్మ్ సిటీ అహల్యాబాయి ప్రాజెక్ట్ ను ఎగ్జిక్యూట్ చేస్తుందని అన్నారు. అలానే అహల్యాబాయి వారసత్వాన్ని తెలియచేసే విధంగా పలు కార్యక్రమాలను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతోందని తెలిపారు. మహిళా సాధికారికత కోసం ఏర్పాటు చేసిన ఆదిశక్తి మిషన్ కు రూ. 10.50 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. అహల్యానగర్ లో హాస్పిటల్ కోసం రూ. 458 కోట్లు ఖర్చ పెట్టబోతున్నారు. దాదాపు 288 కోట్ల రూపాయలను ఐదేళ్ళుగా 30 వేలకు పైగా ధన్ గర్ కమ్యూనిటీ విద్యార్థులకు ఆర్థిక సాయంగా అందించినట్టు ఫడ్నవీస్ తెలిపారు. అహల్య నగర్ జిల్లాలో చెరువులు, కుంటలు, ఘాట్స్ నిర్మాణం, పునర్ నిర్మాణం కోసం రూ. 75 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టు తెలిపారు. ఏదేమైనా... హిందుధర్మ పరిరక్షకురాలిగా పేరు తెచ్చుకున్న అహల్యాబాయి హోల్కర్ జీవితగాధ వెండితెరపైకెక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Jaihind: ఆపరేషన్ సిందూర్ పై సినీ ప్రముఖుల ప్రశంసలు!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 07 , 2025 | 01:47 PM