Pawan Prabha: షష్టి పూర్తి పెరుగన్నం లాంటిది...

ABN , Publish Date - May 26 , 2025 | 07:02 PM

రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటగా నటించిన సినిమా 'షష్టి పూర్తి'. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ ప్రభ పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు.

డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన ప్రధాన పాత్రల్లో రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ మూవీలో ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను మే 30న విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ ప్రభ మీడియాకు తెలిపిన ముచ్చట్లు అతని మాటల్లోనే...

నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. మా ఇంట్లో అంతా ట్రెడిషనల్ సింగర్సే ఉంటారు. నాకు చిన్నతనం నుంచే సినిమాలపై మక్కువ ఏర్పడింది. సినిమాలతోనే మనం మంచిని చెప్పగలమని నమ్ముతాను. అలా నేను చివరకు ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమాకు డైరెక్షన్ టీంలో పని చేశాను. ఆ సినిమాలో ఓ చోట, ఓ చిన్న సీన్‌లో కూడా నేను కనిపిస్తాను.

‘షష్టిపూర్తి’ గురించి చాలా చోట్ల తిరిగాను. ఇళయరాజా గారు కావాల్సిందే అని ముందు నుంచీ ఫిక్స్ అయ్యాను. ఇళయరాజా గారు ఎలా వస్తారు? అని చాలా మంది అంటుండేవారు. ఫ్యామిలీ డ్రామాకు ఎక్కువ క్యాస్టింగ్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి చిత్రాలకు డేట్లు అడ్జస్ట్ అవ్వాలి. షూటింగ్‌కి టైం పడుతుంది. కానీ నేను ఈ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇన్నేళ్లు పట్టింది.

మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నాకు అందరి ప్రేమ తెలుసు. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవుతున్నారు. నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని తీశాను.


‘షష్టిపూర్తి’ విషయంలో నేను ముందు నుంచీ చాలా క్లారిటీతో ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన గారిని నేను మళ్లీ రెండో టేక్ అని అడగాలంటే ఎంత ధైర్యం కావాలి. ఎందుకు అని వారు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పేలా, క్లారిటీ ఇచ్చే స్థాయిలో నేను ప్రిపేర్ అవ్వాలి. అసలు వాళ్లు ఎలా చేయాలో చెప్పే స్థాయిలో నేను ఉండాలి. వాళ్లని యంగ్ లుక్‌లోకి తీసుకెళ్లి.. మళ్లీ ఓల్డ్ లుక్‌లోకి తీసుకు వచ్చాను. ఓ స్ట్రిక్ట్‌ మదర్‌ ఎలా ఉంటారో అలానే చూపించాను. ఓ జోవియల్ ఫాదర్‌ ఎలా ఉండాలో అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూపించాను.

పాటల సిట్యువేషన్‌ను తీసేసి కథను చెప్పమని ఇళయరాజా గారు అన్నారు. ఎక్కడ పాట రావాలో నేను చెబుతాను అని ఆయనే చెప్పారు. ఇక ఫస్ట్ కంపోజిషన్ కోసం మళ్లీ వెళ్లాం. సిట్యువేషన్ చెప్పిన వెంటనే హార్మోనియం మీద పల్లవి ప్లే చేసి వినిపించారు. ‘ఇది సరిపోతుందా? మీరు ఆశించినట్టుగా ఉందా? ఇంకా ఏమైనా ట్రై చేద్దామా?’ అని ఇళయరాజా గారు అన్నారు. ప్రతీ పాటకు మాకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. అన్ని పాటల్ని క్షణాల్లో కంపోజ్ చేసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారు, రెహమాన్ గారు, కీరవాణి గారు ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు.

రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేశ్ కారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆకాంక్ష అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తరువాత ఆమెకు మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది.

‘షష్టిపూర్తి’ అనేది పూర్తిగా కల్పిత చిత్రమే. ఇందులో ఉండే పాత్రల్లా బయట బతకలేరు. రాజేంద్ర ప్రసాద్ గారు పోషించిన పాత్ర బయట కనిపించదు. ఇలాంటి కథను నమ్మి పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మనం కథను చెప్పేటప్పుడు.. మనం ఏం ఫీల్ అవుతామో.. అవతల ఉన్న నిర్మాత కూడా అదే ఫీల్ అయితే సినిమా ముందుకు వస్తుంది. ఇలాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం కష్టం. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మా ‘షష్టిపూర్తి’ రాబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం అందరినీ వెంటాడుతూ ఉంటుంది. నా చిత్రం పెరుగన్నం లాంటిది. సెన్సార్‌ వాళ్లు మా చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పలేదు.

Also Read: Meenakshi Chaudhary: సంక్రాంతి బరిలో ముచ్చటగా మూడోసారి

Also Read: Jyothi Purvaj: కిల్లర్ నుండి జ్యోతి పూర్వజ్ రక్తిక లుక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 26 , 2025 | 07:02 PM