Raviteja: అంత నొప్పితోను.. పాటకు డాన్స్! నిబద్ధత చాటుకున్న మాస్ మహారాజ్
ABN, Publish Date - Oct 08 , 2025 | 08:40 AM
ఈ చిత్రంలో నేను పోషించిన ఆర్‌పీఎఫ్ అధికారి పాత్ర నా సినీ ప్రయాణంలో ప్రత్యేకమైనదని మాస్ మహారాజ్ రవితేజ అభిప్రాయ పడ్డారు.
‘ఈ చిత్రంలో నేను పోషించిన ఆర్‌పీఎఫ్ (రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్) అధికారి పాత్ర నా సినీ ప్రయాణంలో సరికొత్తది, ప్రత్యేకమైనదని మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) అభిప్రాయ పడ్డారు. ఆయన కథానాయకుడిగా గతంలో సామజ వరగమన, వాల్తేరు వీరయ్య సినిమాల డైలాగ్స్ విభాగంలో పని చేసిన భాను భోగవరపు (Bhanu Bhogavarapu) తెరకెక్కించిన చిత్రం ‘మాస్ జాతర’ ( Mass Jathara). శ్రీలీల (Sreeleela) కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌లో భాగంగా చిత్రబృందం ఓ వీడియో సంభాషణలో పాల్గొంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు భాను ప్రతిభావంతుడు. చిత్రీకరణ సమయంలో సన్నివేశాన్ని మరింత మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడు. అవసరమనుకొంటే వేగంగా మార్పులు చేయగల సామర్థ్యమున్నవాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించాడు’ అని తెలిపారు.
అనంతరం శ్రీలీల (Sreeleela) మాట్లాడుతూ ‘సినిమాలో నేను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. రవితేజ (Ravi Teja) కు వృత్తి పట్ల అంకితభావం ఎక్కువ. గాయంతో బాధ పడుతున్నప్పటికీ ‘తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి తన నిబద్ధతను చాటుకున్నారు’ అని కొనియాడారు.
చిత్ర దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ని రవితేజ సూచించారు. దానికి ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించాం. ‘ఓలే ఓలే’ పాట సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. పాట రెండో భాగం పూర్తి భిన్నంగా, పాజిటివ్ వైబ్‌ను కలిగి ఉంటుంది’ అని చెప్పారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే మూడు సార్లు విడుదల పడిన ఈ చిత్రానికి మరోమారు సమస్యలు తప్పేలా కనిపించడం లేదు. ఈ మాస్ జాతర చిత్రం విడుదల అవుతున్న రోజే రాజమౌళి బాహుబలి ది ఎపిక్ (Bahubali The epic) విడుదలవుతుండడంతో ఈ సినిమా పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు.