Tollywood: విజయం కోసం అర్రులు చాస్తూ ఆ నలుగురు...

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:09 PM

రవితేజ, అల్లరి నరేశ్‌, గోపీచంద్, నితిన్ కొన్నేళ్ళుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరిని విజయలక్ష్మి ఎప్పుడు వరిస్తుందో తెలియకుండా ఉంది!

Ravi Teja, Gopichand, Nithiin, Allari Naresh

ఒకప్పుడు ఎంతో క్రేజ్ తో సాగిన నలుగురు హీరోలు ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ కు దూరంగా ఉన్నారు. వారికి ఏమైంది!? ఎందువల్ల వారి సినిమాలు అలరించడం లేదు!? అన్న దానిపై చర్చ సాగుతోంది.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) - మ్యాచో మేన్ గోపీచంద్ (Gopi Chand) - లవ్లీ బాయ్ నితిన్ (Nithiin) - అల్లరోడు నరేశ్ (Naresh) - ఈ నలుగురూ ఒకప్పుడు తమ సినిమాలతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. వీరి సినిమాలకు వెళ్తే ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అన్న తీరున సాగారు. అయితే కొన్నేళ్ళుగా ఈ నలుగురు హీరోలు అంతగా మురిపించలేక పోతున్నారు. అల్లరి నరేశ్ నటించిన '12 ఏ రైల్వే కాలనీ' (12 A Railway Colony) శుక్రవారం విడుదలైంది - అంతగా అలరించడం లేదని తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం వచ్చిన 'నాంది' (Nandi) సినిమాతో అల్లరి నరేశ్ సక్సెస్ చూశారు. అది కూడా మోడరేట్ రిజల్ట్. అంతేకానీ, అతను బంపర్ హిట్ చూడక పుష్కరకాలం దాటిందనే చెప్పాలి. 2012లో వచ్చిన 'సుడిగాడు' (Sudigaadu) తరువాత 'నాంది' మినహాయిస్తే దాదాపు 20కి పైగా ఫ్లాపులు తన ఖాతాలో వేసుకున్నారు అల్లరి నరేశ్. లవ్లీ బాయ్ ఇమేజ్ తో సాగుతోన్న నితిన్ కూడా ఎన్నో ఏళ్ళ తరువాత 'ఇష్క్' (Ishq) తో ఓ హిట్టు, ఆ పై 'గుండె జారి గల్లంతయ్యిందే', అటుపై 'అ ఆ' మంచి విజయం సాధించాయి. 'భీష్మ' (Bheeshma) కూడా సక్సెస్ చూసింది. మధ్యలో వచ్చిన సినిమాలన్నీ నితిన్ కు చేదు అనుభవాన్నే అందించాయి. ప్రస్తుతం నితిన్ అంగీకరించిన సినిమాలేవీ లేవు. కానీ, అల్లరి నరేశ్ 'ఆల్కహాల్' అనే సినిమాతో జనవరి 1న వస్తున్నారు.


గోపీచంద్ కెరీర్ లో కూడా హిట్ పడక చాలా ఏళ్ళయింది. 2014లో వచ్చిన 'లౌక్యం' మినహాయిస్తే ఈ పదకొండేళ్ళలో గోపీచంద్ నటించిన 12 చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఈ యేడాది గోపీచంద్ సినిమా ఏదీ రిలీజ్ రాలేదు. 2026లో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రానుంది. అయితే ఈ నలుగురిలో కాసింత ట్రాక్ రికార్డ్ బెటర్ గా ఉన్నది రవితేజ అనే చెప్పాలి. 2021లో 'క్రాక్'తో హిట్ చూసిన రవితేజ తరువాత రెండు ఫ్లాపులతో సాగారు. 2022లో 'ధమాకా' (Dhamaka) మంచి విజయం సాధించగా, తరువాత వచ్చిన ఐదు సినిమాలు అపజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రంతో రానున్నారు రవితేజ. టైటిల్ లోనే వ్యంగ్యం కనిపిస్తోంది. అంటే రవితేజ వెటకారానికి భలేగా అచ్చివస్తుందని సినీజనం భావిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దూకనుందని వినిపిస్తోంది.


రవితేజ - గోపీచంద్ - నితిన్ - అల్లరి నరేశ్ మాత్రమే కాదు మరికొందరు హీరోలు కూడా ఫ్లాపులతోనే ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ నలుగురు ఒకప్పుడు ప్రేక్షకులను భలేగా అలరించి, ప్రస్తుతం ట్రాక్ తప్పారు. అందువల్లే జనం కూడా వీరి గురించి ఆలోచిస్తున్నారు. నరేశ్ కు కామెడీ టైమింగ్ పెద్ద ఎస్సెట్ - కాబట్టి కామెడీతో సాగుతూనే కాసింత వైవిధ్యమైన కథలతో నరేశ్ పయనిస్తే మంచిదని జనం సూచన. నితిన్ కు లవ్ అండ్ యాక్షన్ మిళితమైన సబ్జెక్ట్స్ అచ్చివస్తాయని, వాటిలో మ్యూజిక్ కు కూడా ప్రాధాన్యమివ్వాలని ప్రేక్షకుల వినతి. ఇక గోపీచంద్ మాస్ మసాలాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ కూడా కలుపుకొని పోవాలని సూచిస్తున్నారు. రవితేజ కనీసం ఏడాదికి ఓ హిట్టుతో సాగారు. వరుసగా మూడేళ్ళ నుంచీ రవితేజ సినిమాల్లో సరైన సబ్జెక్ట్ లేదని ఆడియెన్స్ అంటున్నారు. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ స్టోరీస్ తో రవితేజ పయనిస్తే హిట్టు పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని ప్రేక్షకుల అభిప్రాయం. మరి ఈ నలుగురు హీరోలు జనం చెప్పే మాటలను చెవికి ఎక్కించుకుంటారో లేదో కానీ, వారి రాబోయే సినిమాలు ఏం చేస్తాయో చూడాలి.

Also Read: Suresh Babu: ఆ వార్తల్లో వాస్తవం లేదు....

Also Read: Nandamuri Balakrishna: అఖండ -2 టిక్కెట్ హైక్ ఉందా... లేదా...

Updated Date - Nov 22 , 2025 | 05:09 PM