Rowdy Star: విజయ్ దేవరకొండ మారాడా...
ABN, Publish Date - Jul 08 , 2025 | 02:31 PM
అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన తీరు చూసి, అతనికి చాలా యాటిట్యూడ్ ఉందని అనుకున్నారు. అయితే... ఇప్పుడు విజయ్ దేవరకొండను చూసినవాళ్ళు... అతనిలో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.
తెలుగు సినిమా రంగంలోకి బొడ్డూడని బుడ్డోడు వచ్చినా... ఓ బిరుదు పెట్టేస్తుంటారు. సినిమా అంటేనే వింత మాయాలోకం. అక్కడ ఎవరికి ఏ బిరుదు ఎవరు ఇస్తారో తెలియదు. అప్ కమింగ్ హీరోలను సెన్సేషనల్ స్టార్ అనేస్తారు. పరాజయాల్లో ఉన్నవాడిని సూపర్ డూపర్ స్టార్ అంటూ పొగిడేస్తారు. అంతేకాదు... పదేళ్ళకోసారి స్టార్ హీరోల స్థాయిని పెంచుతూ బిరుదుల్ని అప్ డేట్ చేస్తారు. సుప్రీమ్ స్టార్ (Supreme Star) ... మెగా స్టార్ (Mega Star) అయినట్టు, స్టైలిష్ట్ స్టార్... ఐకాన్ స్టార్ (Icon Star) అయినట్టుగా!
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇలాంటి ట్యాగ్ లైన్స్ కు తాను దూరమంటున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఈ నెల 31న అతను హీరోగా నటించిన 'కింగ్ డమ్' (Kingdom) మూవీ జనం ముందుకు రాబోతోంది. ఆ సందర్భంగా మీడియాతో విజయ్ దేవరకొండ ఇంట్రాక్ట్ అవుతున్నాడు. అలా ఓ హిందీ మీడియాలో విజయ్ మాట్లాడుతూ, 'తెలుగులో ప్రతి హీరోకు ఓ ట్యాగ్ లైన్ లేదా ఉపమానాలతో కూడిన బిరుదులు ఉండటం చాలా సహజమని చెప్పాడు. తనకూ కొందరు ఏవేవో బిరుదులు పెట్టాలని చూసినా తాను ఉద్దేశ్యపూర్వకంగా వాటిని తిరస్కరించానని అన్నాడు. అయితే విజయ్ దేవరకొండ పేరు ముందు స్క్రీన్ మీద ఏ విశేషణమూ ఉండకపోవచ్చు కానీ అభిమానులు మాత్రం ఆయన్ని సెన్సేషనల్ స్టార్, రౌడీ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు... అయితే ఆ బిరుదుల్ని కూడా తాను తిరస్కరించానని విజయ్ దేవరకొండ చెప్పాడు. ఇలాక్కాదని పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ పేరు ముందు 'లైగర్' సినిమా అప్పుడు 'ద' అని పదాన్ని పెట్టారు. ఇదేదో బాగుందని తాను ఒప్పుకున్నానని విజయ్ దేవరకొండ అంగీకరించాడు. అయితే 'ద' అనే పదాన్ని పేరు ముందు పెట్టుకోవడం కూడా పలు విమర్శలకు తావిచ్చిందని, దాంతో ఆ పదాన్ని కూడా తన పేరు ముందు నుండి తొలగించానని చెప్పుకొచ్చాడు. బిరుదులతో కాకుండా తనను విజయ్ దేవరకొండగా జనాలు గుర్తుంచుకుంటే చాలు అంటున్నాడు. చాలామంది బిరుదుల కోసం పాకులాడుతుంటే... విజయ్ మాత్రం అవేవీ తనకొద్దు అని చెప్పడం విశేషమే.
Also Read: Siva Shakthi Datta: శివశక్తి దత్తకు ప్రముఖుల నివాళి...
Also Read: Saiyaara: ఆ రెండు సినిమాలను తలపించేలా...