Tollywood: మిలియన్ వ్యూస్ మాయాజాలం
ABN, Publish Date - Jun 22 , 2025 | 05:23 PM
చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న.. ‘ఫ్యాన్స్ పదే పదే చూస్తున్నారేమో..’ అనుకొని చాలా మంది సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ‘తమ్ముడు’ సినిమా ఫంక్షన్లో నిర్మాత దిల్‌రాజు కుండబద్దలు కొట్టారు.
చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న.. ‘ఫ్యాన్స్ పదే పదే చూస్తున్నారేమో..’ అనుకొని చాలా మంది సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య ‘తమ్ముడు’ సినిమా ఫంక్షన్లో నిర్మాత దిల్‌రాజు కుండబద్దలు కొట్టారు. ‘‘యూట్యూబ్‌లో అన్నీ ఒరిజినల్ నెంబర్లే ఉండాలి. డబ్బులు పెట్టి వ్యూస్ కొనవద్దని నా పీఆర్ టీమ్‌కు చెప్పాను. ట్రైలర్, సాంగ్ ఎంత రీచ్ అవుతుందో తెలిస్తే మన సినిమా రీచ్ ఏంటో అర్థమవుతుంది’’ అన్నారు. అంటే ఇప్పటి దాకా మనం బలుపు అనుకుంటున్నది కేవలం వాపేననే అర్థమవుతోంది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాల ప్రమోషన్ తీరే మారిపోయింది. ఒకప్పుడు సంప్రదాయక మీడియాపై ఆధారపడిన దర్శక నిర్మాతలు సోషల్ మీడియాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి తాము చేరువయ్యామని చెప్పుకోవటానికి - ఎంత మంది తమ వీడియోను చూసారనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోవటం, ఫ్యాన్స్ కూడా ఈ నెంబర్లనే ప్రచారం చేయటం మొదలుపెట్టారు.
దీనితో ‘వీక్షణల యుద్ధం’ ప్రారంభమయింది. ఒక హీరో టీజర్ 50 మిలియన్ (5 కోట్లు) వ్యూస్ దాటితే.. పోటీ హీరో టీజర్ కనీసం 60 మిలియన్ (6 కోట్లు) దాటాల్సిందే! లేకపోతే ఫ్యాన్స్ చిన్నబుచ్చుకుంటున్నారు. ఇన్ని కోట్ల వ్యూస్ ఎక్కడినుంచి వస్తున్నాయనేదే పెద్ద ప్రశ్న. దీనివెనక కొన్ని కంపెనీలు ఉన్నాయి. అవి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయి.
పెద్ద వ్యాపారం...
మనం యూట్యూబ్‌లోకి వెళ్లి వీడియోను ఒక సారి క్లిక్ చేసి చూస్తే ఒక వ్యూ వస్తుంది. అంటే లెక్క ప్రకారం ఒక వీడియోకు కోటి వ్యూస్ రావాలంటే కోటి మంది చూడాలి. కానీ అది అసాధ్యమైన విషయం. అందువల్ల బ్యానర్లు, నిర్మాతలు- తమ వీడియోల వీక్షణాలను కొన్ని కంపెనీల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీలు లక్ష వ్యూస్‌కు ఒక రేటు నిర్ణయించి.. వాటిని విక్రయిస్తూ ఉంటాయి. అయితే ఈ కంపెనీలకు అంత మంది వీక్షకులు ఎలా లభిస్తారనే ప్రశ్న కూడా కొందరిలో తలెత్తుతుంది. ఈ కంపెనీల వద్ద అత్యాధునికమైన ‘బోట్స్’ (ఒక తరహా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములు) ఉంటాయి. వీటికి కృత్రిమంగా వ్యూస్‌ను పెంచే సామర్థ్యం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారం- ఒక కోటి వ్యూస్ కావాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే!
ప్రయోజనమేమిటి?
ఈ వ్యూస్ వల్ల వాస్తవానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. సినిమా బావుంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు. లేకపోతే ఉచితంగా చూపించినా చూడడు. కానీ ఈ కృత్రిమమైన వ్యూస్ వల్ల - సినిమాకు నిజంగా ఆదరణ లభిస్తుందా? లేదా అనే స్పష్టత నిర్మాతకు ఉండదు. ‘‘ఇదంతా ఒక పెద్ద గేమ్.. సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేస్తే సినిమాకు అంత హైప్ వస్తుంది. దీనితో ఈ సినిమాను నిర్మాత సులభంగా అమ్ముకోగలుగుతాడు. వ్యూస్ కొనటానికి పెట్టిన డబ్బులు కూడా తిరిగి వచ్చేస్తాయి. ఒకసారి సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకులు తమ నిర్ణయాన్ని మొదటి రోజే చెప్పేస్తారు. అప్పటి దాకా ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. కోట్ల వ్యూస్ వచ్చి మూడు రోజుల్లో థియేటర్ల నుంచి తిరిగి వెళ్లిపోయిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఎక్కువ వ్యూస్ రాకుండా హిట్ అయినా సినిమాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నిర్మాతలు ఎంత త్వరగా గమనిస్తే వారికి అన్ని డబ్బులు కలిసొస్తాయి’’ అని పేరు బయటకు చెప్పటానికి ఇష్టపడని నిర్మాత ఒకరు పేర్కొన్నారు.
రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సంపాదించిన సినిమా వీడియోలు
సినిమా పేరు వ్యూస్
డాకు మహారాజ్ 80 లక్షలు
సంక్రాంతికి వస్తున్నాం 1.4 కోట్లు
హిట్-3 2.3 కోట్లు
తండేల్ 3 కోట్లు
గేమ్ ఛేంజర్ 3.6 కోట్లు