Gaddar Awards: పదేళ్లకు సంబంధించిన అవార్డ్స్ ఒకేసారి 

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:28 PM

సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, అల్లు అర్జున్‌ ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం, వారిద్దరి కలయిక ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్‌ను రేవంత్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్‌..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలోని డైలాగ్‌ చెప్పి, ఆహుతులను అలరించారు అల్లు అర్జున్‌ (Allu Arjun) . గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards) పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పురస్కార ప్రదానోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ వేదికపై డైలాగ్ తో సందడి చేసారు. పదేళ్లకు సంబంధించిన పురస్కారాన్ని ప్రదానం చేయడంతో పెద్ద సంఖ్యలో నటులు, సాంకేతిక నిపుణులతో వేడుక కళకళలాడింది. సీనియర్‌ తారలు, జయసుధ, జయప్రద, సుహాసిని ఈ వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పలువురు విజేతలకు పురస్కారాన్ని అందజేశారు. పురస్కార జ్యూరీ కమిటీకి ఛైర్మన్లుగా వ్యవహరించిన జయసుధ, మురళీమోహన్‌తోపాటు కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు, ఎం.డి హరీష్‌ జ్ఞాపికల్ని ప్రదానం చేశారు.

సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, అల్లు అర్జున్‌ ఒకే వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం, వారిద్దరి కలయిక ఎలా ఉండబోతోందో అనే ఆసక్తిని పెంచింది. అల్లు అర్జున్‌ను రేవంత్‌రెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమనటుడు పురస్కారాన్ని రేవంత్‌రెడ్డి నుంచి అందుకున్నారు అల్లు అర్జున్‌. వ్యాఖ్యాతలు ఆయన్ను వేదికపై మాట్లాడాలని కోరడంతో బన్నీ మైక్‌ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి అన్న అంటూ ముఖ్యమంత్రిని సంబోధించారు. ‘సినిమా ఫంక్షన్‌ కాబట్టి సరదాగా ఒక డైలాగ్‌ చెప్పొచ్చా అన్నా’ అంటూ రేవంత్‌రెడ్డిని అనుమతి అడగడం, ఆయన నవ్వుతూ అనుమతిస్తున్నట్లు చేతిని ఊపడంతో ‘పుష్ప 2’లోని డైలాగ్‌ను అల్లు అర్జున్‌ చెప్పారు. 

Bala-.jpg

ALSO READ: Telangana Gaddar Film Awards 2024:  తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..  విన్నర్స్  వీరే 


తొలి వ్యక్తిని కావడం నా అదృష్టం: బాలకృష్ణ
గద్దర్‌ అవార్డులో భాగంగా ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం అందుకున్న బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘కళలకు చావు లేదు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్‌ అన్నపేరు ఎప్పటికీ నిలిచిపోయేలా... ఆయన గౌరవార్థం పురస్కారం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ గవర్నమెంట్‌కు కృతజ్ఞతలు. దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ  ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు గద్దర్‌. 1996లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని మొదలుపెట్టారు. ఎంతో మంది ఈ గౌరవం పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తి కావడం నా అదృష్టం. ‘రాష్ర్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే అన్నా... యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా..’ అన్నట్టుగా  తెలంగాణ ప్రభుత్వం మళ్లీ చలన చిత్ర ఉత్సవాన్ని జరుపుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం నాకు ఇచ్చినందుకు నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పురస్కారంతోపాటు ఇచ్చిన నగదు  బహుమతి బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఇచ్చినట్టే లెక్క. ఎంతోమంది నిరుపేదలకు సేవలు అందిస్తున్నాం. అందుకు ప్రభుత్వం కూడా మాతో చేయి కలిపినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.

Sukumar-.jpg

బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ "ఎన్ని అవార్డులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్‌ రెడ్డిగారు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిగార్లకు థ్యాంక్స్‌. మమ్మల్ని  ప్రోత్సహించడానికి గద్దర్‌గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది" అన్నారు.


Ladies.jpg

ఫ్యాన్స్‌కి అంకితం: బన్నీ
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. గద్దర్‌ సినీ పురస్కారాలు ఏర్పాటుకు చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. ప్రతి ఏడాదీ ఈ వేడుక ఇలానే కొనసాగాలి. ఈ పురస్కారం నాకెంతో ప్రత్యేకం. ‘పుష్ప2’కిగానూ అందుకున్న తొలి పురస్కారం ఇదే. దర్శకుడు సుకుమార్‌ విజన్‌, తన ప్రేమే ఇందుకు కారణం. దర్శకుడు రాజమౌళికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ‘పుష్ప 1’ సినిమాని హిందీలో విడుదల చేయమని చెప్పకపోతే ఇంత ఆదరణ దక్కేది కాదు. ఈ పురస్కారాన్ని నా అభిమానులకి అంకితం ఇస్తున్నా’’ అన్నారు.

VD.jpg
బాధ్యత పెంచింది: విజయ్‌ దేవరకొండ
కాంతారావు పురస్కారం అందుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘గద్దర్‌ అన్న పేరుతో ప్రభుత్వం ఈ పురస్కారం మొదలుపెట్టడం, సినిమా పరిశ్రమని ఒక వేదికపైకి తీసుకురావడం ఆనందంగా ఉంది. మహబూబ్‌నగర్‌లో పుట్టినవాడిని, నట ప్రపూర్ణ కాంతారావు పేరుమీద ఏర్పాటు చేసిన ఈ పురస్కారం నాకు ఇవ్వడం ఆయనకి ఇదొక నివాళి. నేను ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా ఎంతో బాధ్యతగా భావిస్తున్నా. ఇంకా ఎంతో  చేయాలనిపిస్తుంది. ఈ పురస్కారం అందించినందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ దిల్‌రాజుకు కృతజ్ఞతలు’ అన్నారు.

శుభ పరిణామం: దిల్‌రాజు

14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్‌ ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఈ రోజు ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు.

MM-k.jpg

‘‘ఎక్కడ ఏం సాధించినా మన గడ్డ మీద, మన నేలమీద మనవాళ్ల మధ్య అందుకునే గౌరవం ఎప్పటికీ మరిచిపోలేనిది. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అని గీత రచయిత చంద్రబోస్‌ అన్నారు.



‘‘గద్దర్‌ పేరుపై నిర్వహిస్తున్న ఈ  వేడుకలో  రేవంత్‌ రెడ్డి, భట్ట్టి విక్రమార్క చేతుల మీదుగా అందుకున్న ఈ గౌరవం బాసర సరస్వతి దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నా’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.


 Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గద్దర్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ 


Updated Date - Jun 15 , 2025 | 03:35 PM