Young Heroes: సినిమా మధ్యలో వేలు పెడతాం.. డైరెక్టర్స్ కు చుక్కలు చూపిస్తాం
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:46 PM
నవతరం హీరోల్లో కొందరు రైటర్స్ గా, డైరెక్టర్స్ గానూ సాగుతున్నారు. వారు ఇతర దర్శకుల చిత్రాల్లో పనిచేసేటప్పుడు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ డైరెక్టర్స్ కు అడ్డు తగులుతున్నారని టాక్.
Young Heroes: నవతరం హీరోల్లో కొందరు రైటర్స్ గా, డైరెక్టర్స్ గానూ సాగుతున్నారు. వారు ఇతర దర్శకుల చిత్రాల్లో పనిచేసేటప్పుడు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ డైరెక్టర్స్ కు అడ్డు తగులుతున్నారని టాక్. అలాంటి వారిలో అడివి శేష్ (Adivi Sesh), సిద్ధూ జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), విశ్వక్ సేన్ (Vishwak Sen), నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty)పేర్లు ముందుగా వినిపిస్తున్నాయి. ఈ నలుగురు యంగ్ హీరోస్ నటిస్తూనే కొన్ని సినిమాలకు రైటర్స్ గానూ పనిచేశారు. సదరు చిత్రాలు మంచి విజయం సాధించాయి. దాంతో వీరి సలహాలు, సూచనలు తీసుకోవడానికి దర్శక నిర్మాతలు సైతం వెనుకాడడం లేదు. అందువల్లే తాము నటించే సినిమాల్లో వీరు కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఆ జోక్యం కొందరికి నచ్చుతోంది. కొందరికి నచ్చడం లేదని సమాచారం.
అడివి శేష్ 2010లోనే కర్మ అనే చిత్రానికి దర్శకత్వం వహించి నటించారు. తరువాత 2013లో కిస్ అనే సినిమాను రూపొందించారు. ఇక తాను నటించిన పలు చిత్రాలకు శేష్ రచయితగానూ వ్యవహరించారు. రాబోయే డెకాయిట్ కు కూడా అడివి శేష్ రైటర్. అందువల్ల అడివి శేష్ తన దర్శకులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అలాగే తాను నటించే సీన్స్ రక్తి కట్టడానికి ఇతర నటీనటులతోనూ శేష్ చర్చిస్తూ సాగుతున్నారు. ఇక విశ్వక్ సేన్ కూడా శేష్ లాగే నటదర్శకుడు. విశ్వక్ సేన్ మూడు సినిమాల్లో నటించాక 2019లోనే ఫలక్ నమా దాస్ చిత్రంలో నటిస్తూ దర్శకత్వం వహించారు. 2023లో దాస్ కా ధమ్కీ సినిమాకూ విశ్వక్ సేన్ డైరెక్టర్. అలా దర్శకత్వంలో ప్రవేశముండడం వల్ల విశ్వక్ సేన్ కూడా తన దర్శకులతో తన పాత్ర గురించే కాకుండా సీన్స్ బాగా రావడానికి చర్చిస్తూ సాగుతున్నారు. వీరిద్దరి ధోరణితో ఏ లాంటి ప్రమాదం లేకపోయినా, కొందరు వీరి జోక్యాన్ని తప్పుగానే భావిస్తున్నారు.
సిద్ధూ జొన్నలగడ్డ సైతం తన చిత్రాల్లో కొన్నిటికి రచయితగా వ్వవహరించారు. కృష్ణ అండ్ హిజ్ లీల మూవీకి సిద్ధూ నటునిగానే కాదు రైటర్, ఎడిటర్ గానూ పనిచేశారు. సిద్ధూ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలచిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు కూడా రచనలో పాలు పంచుకున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన తెలుసు కదా లోకూడా సిద్దు హస్తం ఉందని టాక్. ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే చాలా రోజులకు ఈయనకు హీరోగా బ్రేక్ వచ్చింది. తాను రైటర్ గా పనిచేసి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పటి నుంచీ తన దర్శకులతో చర్చలు సాగిస్తున్నారు. జాతిరత్నాలుతో బంపర్ హిట్ చూసిన నవీన్ తన డైరెక్టర్స్ కు హెల్ప్ చేయాలనే చూస్తారు.
ఈ నలుగురు హీరోల ఉద్దేశం మంచిదే. తాము నటించే ప్రాజెక్ట్ ఔట్ పుట్ బాగా రావాలనే తపిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం వీరి జోక్యం సరికాదని భావిస్తున్నారు. ఎవరూ బయటపడి చెప్పలేకపోయినా.. తమ పని తాము చేసుకోకుండా వేరేవారి పనుల్లో జోక్యం అనవసరం కదా అని అనుకోకుండా ఉండలేదు. సినిమాలో వేలు పెట్టి.. డైరెక్టర్స్ కు చుక్కలు చూపిస్తున్నారు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి డైరెక్టర్స్ ఆవేదనను ఈ నలుగురు అర్ధం చేసుకుంటారో లేదో చూడాలి.
Nara Rohith: పెళ్ళిపీటలపైకి నారా రోహిత్...
Suriya: సూర్యకు మరోసారి దురదృష్టం.. గోల్డెన్ ఛాన్స్ మిస్!