100 Movies Milestone: సెంచరీ కొట్టిన వారెవరు...

ABN, Publish Date - May 14 , 2025 | 04:29 PM

గతంతో పోల్చితే ఇప్పుడు వంద సినిమాల మైలురాయిని దాటే హీరోలు కరువైపోయారు. అక్కినేని నాగార్జున తర్వాత ఆ ఫీట్ కు చేరువ అవ్వబోతున్న హీరో వెంకటేశ్. అసలు ఇలా సెంచరీ పూర్తి చేసిన వారిపై ఓ లుక్కేద్దాం.

కింగ్ నాగార్జున త్వరలోనే వంద చిత్రాల సుందరునిగా మారబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నాగ్ తరం హీరోల్లో కొందరు, అంతకు ముందు మరికొందరు శతచిత్ర సుందరులుగా వెలిగారు. వారెవరో - వారి నూరవ చిత్రం ఏ తీరున సాగిందో గుర్తు చేసుకుందాం.

యన్టీఆరే ఆద్యుడు!

అసలు నూరు చిత్రాల ముచ్చట అన్నది మహానటుడు నటరత్న యన్టీఆర్ (NTR) తోనే ఆరంభమైందని చెప్పవచ్చు.. అదే సమయంలో నటసమ్రాట్ ఏయన్నార్ (ANR)కూడా వంద సినిమాలు పూర్తి చేసుకోవడంతో సౌత్ లో వంద సినిమాల మైలు రాయి అనేది ఓ ప్రతిష్ఠాత్మకంగా మారింది. యన్టీఆర్ నూరవ చిత్రం విజయావారి 'గుండమ్మకథ'. ఇందులో ఏయన్నార్ కూడా ఓ హీరోగా నటించారు. అలా మనదేశంలో తొలిసారి వంద చిత్రాలు పూర్తి చేసుకున్న నటునిగా యన్టీఆర్ నిలచిపోయారు. ఇక ఏయన్నార్ వందో సినిమా ఇదే 'గుండమ్మకథ' తమిళ వర్షన్ 'మనిదన్ మారవిల్లై'. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన 'గుండమ్మకథ' 1962 బ్లాక్ బస్టర్ గా నిలచింది. చక్రపాణి దర్శకత్వం వహించిన 'మనిదన్ మారవిల్లై' పరాజయం పాలయింది. అప్పటి నుంచీ సౌత్ లో వంద సినిమాల ముచ్చట ఊపందుకుంది.

అదే బాటలో వంద సినిమాల సుందరులు...

యన్టీఆర్, ఏయన్నార్ ఒకే సమయంలో వంద సినిమాలు పూర్తి చేసుకోవడంతో నూరు చిత్రాల సందడి దక్షిణాదిన ఊపందుకుంది. 1964లో శివాజీగణేశన్ (Sivaji Ganesan) తొమ్మిది పాత్రలు పోషించిన 'నవరాత్రి'తో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు. తమిళంలో 'నవరాత్రి' మంచి విజయం సాధించింది. దాదాపు ఏడువందల సినిమాలకు పైగా నటించిన క్రెడిట్ ను సొంతం చేసుకున్న మళయాళ హీరో ప్రేమ్ నజీర్ (Prem Nazir) సైతం 1967లో నూరుచిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఆయన నూరో సినిమాగా వచ్చిన 'అగ్నిపుత్రి' అంతగా అలరించలేకపోయింది. 1968లో వచ్చి 'ఓలి విలక్కు'తో ఎమ్జీఆర్ (MGR) నూరు చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా పరవాలేదనిపించింది. కన్నడ స్టార్ రాజ్ కుమార్ (Kannada Raj Kumar) కూడా 1968లో తన 'భాగ్యద బాగిలు'తో వంద మైలు రాయి దాటారు. ఈ సినిమా కూడా పర్లేదు అన్న టాక్ సంపాదించింది. ఇక తెలుగులో కృష్ణ (Krishna) 100వ చిత్రంగా 'అల్లూరి సీతారామరాజు' విడుదలై 1974 బ్లాక్ బస్టర్ గా నిలచింది. శోభన్ బాబు (Sobhan Babu) వందో సినిమాగా 'నిండుమనిషి' వెలుగు చూసి పరాజయం పాలయింది. ఇక కృష్ణంరాజు (Krishnam Raju) 100 సినిమాగా 'శివమెత్తిన సత్యం' వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. వీరి తరువాతి తరం హీరోల్లో చిరంజీవి (Chiranjeevi) 1988లో వచ్చిన 'త్రినేత్రుడు'తో వంద మైలురాయి దాటారు. 2017లో విడుదలైన పీరియడ్ మూవీ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బాలకృష్ణ(Balakrishna) నూరు సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. శ్రీకాంత్ (Srikanth) 2009లో కృష్ణవంశీ 'మహాత్మ'తో వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు. తమిళంలో సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్ (Rajnikanth) 100వ చిత్రంగా 1985లో 'శ్రీరాఘవేంద్రస్వామి' రూపొందింది. ఈ సినిమా భక్తజనాన్ని అలరించింది. రజనీకాంత్ శ్రీరాఘవేంద్రస్వామి భక్తుడు కావడం గమనార్హం! ఇక మరో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) నూరవ సినిమాగా 1981లో రూపొందిన 'రాజా పార్వై' విడుదలయింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'అమావాస్య చంద్రుడు'గా వెలుగు చూసింది.


ఉత్తరాదిన...

యన్టీఆర్, ఏయన్నార్ తరం హీరోలే అయిన ఉత్తరాది స్టార్స్ దిలీప్ కుమార్, రాజ్ కపూర్ తమ జీవిత కాలంలో వంద చిత్రాలు చేయలేదు. దిలీప్ కుమార్ మొత్తం 57 సినిమాల్లోనే నటించగా, రాజ్ కపూర్ 70కి పైగా సినిమాల్లో అభినయించారు. అయితే వీరి సమకాలికుడైన దేవానంద్ (Dev Anand) మాత్రం తన కెరీర్ లో వంద సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఆయన నూరవ చిత్రంగా 1985లో 'హమ్ నౌజవాన్' వెలుగు చూసింది. కానీ, అంతగా అలరించలేక పోయింది. ఇక హిందీ చిత్రసీమలో తొలి సూపర్ స్టార్ గా నిలచిన రాజేశ్ ఖన్నా (Rajesh Khanna) 1984లో మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించి, దర్శకత్వం వహించిన 'నయా ఖదమ్'తో వంద చిత్రాలు చూశారు. ఈ సినిమా తెలుగులో తెరకెక్కిన 'త్రిశూలం' రీమేక్. రాజేశ్ ఖన్నా తరువాత సూపర్ స్టార్ గా నిలచిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) 1991లో కన్నడ డైరెక్టర్ కేవీ రాజు రూపొందించిన 'ఇంద్రజీత్'తో నూరు సినిమాలు పూర్తి చేసుకున్నారు. కన్నడలో కేవీ రాజు తెరకెక్కించిన 'బంధ ముక్త' రీమేక్ గా 'ఇంద్రజీత్' వెలుగు చూసింది. అలా ఇద్దరు హిందీ సూపర్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ మూవీస్ తోనే వంద మైలురాయి దాటడం విశేషం. ఈ రెండు సినిమాలు పెద్దగా అలరించలేదు. ఇప్పటి బాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఆమిర్ ఖాన్ 60కి పైగా చిత్రాల్లో నటించారు. షారుఖ్ ఖాన్ ఇప్పటి దాకా 98 చిత్రాల్లో కనిపించారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా 97 సినిమాల్లో నటించారు. అందువల్ల సల్మాన్, షారుఖ్ వందో మైలురాయికి దగ్గరలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇప్పుడు మన నాగార్జున కూడా వందో మైలు రాయికి అతి సమీపంలో ఉన్నారు. తెలుగు సినిమాకు నాలుగుస్తంభాల్లా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఏడాదికి కనీసం ఐదు సినిమాలు చేస్తూ సాగారు. అందువల్ల వారిలో చిరంజీవి నూటయాభైకి పైగా చిత్రాల్లోనూ, బాలకృష్ణ వందకు పైగా సినిమాల్లోనూ నటించేశారు. వారి తరువాత హీరోలుగా అరుదెంచిన నాగ్, వెంకీ కూడా వంద సినిమాలకు చేరువయ్యారని చెప్పవచ్చు. వీరిలో ముందుగా నాగార్జున వంద చిత్రాలు పూర్తి చేసుకోనున్నారు. నిజం చెప్పాలంటే నాగ్ నటించిన 'ఆఫీసర్' సినిమాతోనే ఆయనకు నూరు సినిమాలు పూర్తయ్యాయి. అయితే ఆయన లెక్కలో కేమియో రోల్స్ లో కనిపించిన సినిమాలను గణించలేదు. హీరోగానూ, కీ రోల్స్ లోనూ కనిపించిన చిత్రాలనే లెక్క వేస్తున్నారు. అందువల్ల త్వరలో నాగార్జున సోలో హీరోగా నటించబోయే సినిమాయే ఆయన నూరవ చిత్రం అని తెలుస్తోంది. మరి ఆ సినిమాతో నాగ్ ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

Also Read: Tammudu: బరి నుండి తప్పుకుంటున్న నితిన్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 14 , 2025 | 04:35 PM