Tammudu: బరి నుండి తప్పుకుంటున్న నితిన్...
ABN , Publish Date - May 14 , 2025 | 04:09 PM
మే 30న రావాల్సిన విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' మూవీ జూలై 4కు పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో ఆ రోజున విడుదల కావాల్సిన నితిన్ 'తమ్ముడు' మూవీ కూడా వాయిదా పడుతుందనే ప్రచారం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతోంది.
యువ కథానాయకుడు నితిన్ (Nithiin) కు ఈ మధ్య అసలు కాలం కలిసి రావడం లేదు. విడుదలవుతున్న చిత్రాలు ఒక్కొక్కటిగా పరాజయం పాలు అవుతుంటే... విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న 'తమ్ముడు' (Thammudu) సినిమా నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ రిలీజ్ వాయిదా పడటంతో దీని విడుదల కూడా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు 'రాబిన్ హుడ్' మూవీ వచ్చింది... వెళ్ళింది. భారీ స్థాయిలో ఆ మూవీకి ప్రమోషన్స్ చేసినా... ఫలితం లేకపోయింది. నితిన్, శ్రీలీల (Sreeleela) కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంతో తన తదుపరి సినిమా 'తమ్ముడు' మీదనే నితిన్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 4న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న లయ (Laya), వర్షా బొల్లమ్మ (Varsha Bollamma), సప్తమి గౌడ (Sapthami Gouda) తదితరులతో కలిసి డేట్ ను అనౌన్స్ చేయించారు. అయితే... ఇప్పుడీ సినిమాకు కొత్త చిక్కు వచ్చిపడింది.
మే 14న నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamshi)... విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో తాము నిర్మిస్తున్న 'కింగ్ డమ్' (Kingdom) మూవీని మే 30 నుండి జూలై 4కి వాయిదా వేసినట్టు ప్రకటించారు. నిజానికి ఆ రోజున నితిన్ 'తమ్ముడు'తో పాటు, సిద్ధార్థ్ డబ్బింగ్ మూవీ '3 బి.హెచ్.కె.' కూడా విడుదల కావాల్సి ఉంది. ఎప్పుడైతే 'కింగ్ డమ్' జూలై 4న వస్తుందని తెలిసిందో... అందరిలో సహజంగానే 'తమ్ముడు' వాయిదా పడబోతోందా!? అనే సందేహం మొదలైంది. ఎందుకంటే... విజయ్ దేవరకొండ సినిమాకు పోటీగా 'దిల్' రాజు తన సినిమాను విడుదల చేసే ప్రసక్తే ఉండదు. విజయ్ దేవరకొండతో ఇప్పటికే 'ది ఫ్యామిలీ స్టార్' మూవీని నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు 'రౌడీ జనార్దన్' మూవీని కోలా రవికిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. సో... తన హీరోకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయడం జరిగే పనికాదు. కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో నితిన్ 'తమ్ముడు' మరోసారి వెనక్కి వెళ్ళబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అదే నెల 24న 'తమ్ముడు' విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి ఆ తేదీన మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ విడుదల కావాల్సి ఉంది. బహుశా 'విశ్వంభర' వాయిదా పడితే... అదే తేదీన నితిన్ 'తమ్ముడు' రిలీజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో కాస్తంత క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.
Also Read: Ayyana Mane: తెలుగులోనూ వస్తున్న కన్నడ వెబ్ సీరిస్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి