The Raja Saab: బర్త్ డే సందర్భంగా సంజయ్ దత్ స్పెషల్ పోస్టర్
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:58 PM
జూలై 29 ప్రముఖ హిందీ నటుడు సంజయ్ దత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు స్పెషల్ పోస్టర్ తో 'ది రాజా సాబ్' టీమ్ విషెస్ తెలియచేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరణానంతరం కూడా తన భవంతిని వదిలిపెట్టని ఆత్మగా అతను కనిపించబోతున్నాడు. ఈ మధ్య వచ్చిన టీజర్ చూస్తే... ఇందులో సంజయ్ దత్ పాత్ర ఎంత ప్రధానమైందో అర్థం అవుతుంది. అయితే సంజయ్ దత్ తెలుగు సినిమాల్లో నటించడం ఇదే మొదటి సారి కాదు... గతంలో నాగార్జున (Nagarjuna) 'చంద్రలేఖ' సినిమాలో తెలుగు తెరపై ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి మెరుపులా మెరిశాడు సంజయ్ దత్. ఇక... ఆ మధ్య వచ్చిన పూరి జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart) లో ప్రతినాయకుడి పాత్ర చేశాడు. దీనికంటే ముందు హిందీ, తెలుగు భాషల్లో రూపుదిద్దుకున్న రామ్ చరణ్ (Ram Charan) 'జంజీర్' రీమేక్ లోనూ నటించాడు.
జులై 29 సంజయ్ దత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 'ది రాజా సాబ్' టీమ్ సంజయ్ దత్ లుక్ తో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
నిజానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) 'అఖండ' చిత్రంలో సంజయ్ దత్ నటించాల్సి ఉంది. కానీ బడ్జెట్ ను తగ్గించే క్రమంలో 'అఖండ' నుండి సంజయ్ దత్ ను తొలగించారు. దాంతో 'అఖండ -2'లో ఆయన ఖచ్చితంగా ఉంటారని అందరూ అనుకున్నారు. మొదట్లో సంజయ్ దత్ పేరు ప్రతినాయకుడిగా వినిపించింది. కానీ చిత్రం ఏమంటే ఈసారి కూడా సంజయ్ దత్ కు చుక్కెదురైంది. చివరి నిమిషంలో 'అఖండ -2' నుండి కూడా తప్పించారు. ఆయన స్థానంలో ఆది పినిశెట్టిని తీసుకున్నారు. ఏదేమైనా ఈ యేడాది చివరిలో 'ది రాజాసాబ్'తో తెలుగు వారిని మెప్పించబోతున్నాడు సంజయ్ దత్.
బాలీవుడ్ లో 1981లో 'రాకీ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ కెరీర్ లోనే కాదు... వ్యక్తిగతంగానూ అనేక ఎత్తుపల్లాలను చవిచూశాడు. కానీ పడిన ప్రతిసారి పట్టువదలని విక్రమార్కుడిలా లేచి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా 66 సంవత్సరాల వయసులో నటుడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు... ఇప్పుడైతే దక్షిణాది చిత్రాలకూ ప్రాధాన్యమిస్తున్నాడు.
Also Read: Sathi Leelavathi: మెగా కోడలు.. సతీ లీలావతి టీజర్ అదిరింది
Also Read: Sir Madam: ఒక్క రోజులో.. రెండు పాటలు వదిలారు