Prabhas Birthday: 'పౌర్ణమి, సలార్' రీ-రిలీజ్... ఛార్మి స్పెషల్ విషెస్...
ABN, Publish Date - Oct 23 , 2025 | 03:19 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా 'ది రాజాసాబ్, ఫౌజీ' మూవీస్ నుండి పోస్టర్స్ వచ్చాయి. అలానే 'సలార్, పౌర్ణమి' చిత్రాలు రీ-రిలీజ్ అయ్యాయి. మరో వారంలో 'బాహుబలి : ది ఎపిక్'కు రంగం సిద్థమౌతోంది.
'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఫ్రమ్ టాలీవుడ్' అంటూ జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే. ప్రభాస్ ఫ్యాన్స్ కు అదో ఫెస్టివల్... ఈ సందర్భంగా విషెస్ చెబుతూ ప్రభాస్ మూవీ జర్నీని గుర్తు చేసుకుందాం.
'బాహుబలి' సిరీస్ లో నటించిన తరువాత ప్రభాస్ కు ఇంటర్నేషనల్ ఫేమ్ దక్కింది. ఆ తరువాత వచ్చిన ప్రభాస్ మూవీస్ ఎలా ఉన్నా భారీ వసూళ్ళు పోగేయడం మొదలయింది. ఓవర్సీస్ లో అంతకు ముందు కనీవినీ ఎరుగని రికార్డులను ప్రభాస్ సినిమాలు సొంతం చేసుకోవడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా' అని కొందరు కీర్తించారు. అయితే మరికొందరు టాలీవుడ్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన తొలి హీరో అని అన్నారు. ఎవరు ఏమనుకున్నా, ఇప్పటికీ తొలి సినిమా 'ఈశ్వర్' నాటి ప్రభాస్ లాగే అందరినీ నవ్వుతూ 'డార్లింగ్' అంటూ సంబోధిస్తూ సరదాగా సాగుతున్నారు ప్రభాస్. ఆయన పుట్టినరోజయిన అక్టోబర్ 23న అభిమానులు పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తన ఫ్యాన్స్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రభాస్ ఆశిస్తూంటారు. వారితోనూ అదే చెబుతూంటారు. ఈ సారి ప్రభాస్ బర్త్ డేన 'ద రాజాసాబ్' నుండి నయా పోస్టర్ విడుదల కాగా, హను రాఘవపూడి చిత్రానికి 'ఫౌజీ' అనే పేరు ఖరారు చేస్తూ... పోస్టర్ ను రిలీజ్ చేశారు.
థియేటర్లలో సందడే సందడి
అభిమాను హీరో బర్త్ డే సందర్భంగా అతని పాత చిత్రాలను విడుదల చేయడం ఈ మధ్య కాలంలో అలవాటుగా మారింది. అలా అత్యధిక చిత్రాలు రీ-రిలీజ్ అయ్యింది ప్రభాస్, మహేశ్ బాబువే! వీరి సినిమాల విడుదలలో ఊహించని జాప్యం జరుగుతుండటంతో అభిమానులు పాత సినిమాలను మరోసారి థియేటర్లలో చూసి ఆనంద పడుతున్నారు. అలా ఈ యేడాది ప్రభాస్ బర్త్ డేన 'సలార్' మూవీతో పాటు 'పౌర్ణమి' కూడా విడుదలైంది. ఈ సందర్భంగా 'పౌర్ణమి'లో ప్రభాస్ తో కలిసి నటించిన ఛార్మి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా డార్లింగ్ ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ప్రభాస్ అభిమానులకు మరింత ఆనందం పంచే అంశమేంటంటే - ఆయనను ఇంటర్నేషనల్ స్టార్ గా నిలిపిన 'బాహుబలి' సిరీస్ ను ఒక్కటిగా చేసి 'బాహుబలి - ది ఎపిక్'ను రూపొందించారు రాజమౌళి. ప్రభాస్ బర్త్ డే నెక్స్ట్ వీక్ లో అక్టోబర్ 31న ఇది పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రదర్శన కాలం 3 గంటల 46 నిమిషాలు. ఇంత నిడివి ఉన్నా సరే, తమ హీరోను మరోమారు బాహుబలిగా చూడాలన్నదే అభిమానుల అభిలాష. అప్పటి లాగే ఈ 'బాహుబలి ది ఎపిక్' కూడా ఘనవిజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. వచ్చే యేడాది నుండి ఒకే సమయంలో సమాంతరంగా రెండు సినిమాల్లో నటించాలని ప్రభాస్ ప్లాన్ రూపొందించుకున్నారు. ఆ తీరున ఇకపై ఏడాదికి రెండు చిత్రాలతో అభిమానులకు ఆనందం పంచనున్నారు ప్రభాస్. జనవరి 9న 'ద రాజాసాబ్' రిలీజ్ కానుంది. తరువాత హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ'గా కనిపిస్తారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే మరోవైపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' చేస్తున్నారు ప్రభాస్. 'కల్కి 2, సలార్ 2' చిత్రాల్లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. 'హనుమాన్' తీసిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనూ ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తారని వినిపిస్తోంది. ఇవి కాకుండా ప్రభాస్ కోసం పలువురు దర్శకులు సబ్జెక్ట్స్ తయారు చేస్తున్నారు. అలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తన ఫ్యాన్స్ కు ఆనందం పంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రభాస్. మరి రాబోయే సినిమాలతో ప్రభాస్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
Also Read: Shilpa shetty - Bastian: శిల్పాశెట్టి రెస్టారెంట్ ఒక రోజు టర్నోవర్ ఎంతో తెలుసా..
Also Read: The Girlfriend: రశ్మిక సరికొత్త ప్రేమకథ...