Tollywood: సెప్టెంబర్ బంపర్ హిట్.. మరి ఆక్టోబర్?
ABN, Publish Date - Oct 04 , 2025 | 03:42 PM
జనవరి తర్వాత ఎక్కువ సినిమాలు విజయం సాధించిన నెల సెప్టెంబర్. ఇప్పుడు అదే సీన్ అక్టోబర్ లోనూ రిపీట్ అవుతుందనే ఆశాభావంతో తెలుగు నిర్మాతలు ఉన్నారు. ఈ నెల 'కాంతార చాప్టర్ 1'తో శుభారంభం కావడం వారికి ఆనందాన్ని కలిగిస్తోంది.
ఈ యేడాది ఆరంభంలో మెరిసిన బాక్సాఫీస్ మెరుపులు మళ్ళీ సెప్టెంబర్ లోనే కనిపించాయి. అదే తీరు అక్టోబర్ లోనూ సాగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు సినీజనం. మరి ఈ నెలలో ఏ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకడానికి సిద్ధమవుతున్నాయో చూద్దాం.
జనవరిలో సంక్రాంతి సందర్భంగా సాగిన హంగామా తెలుగు సినిమా బాక్సాఫీస్ ను పులకింప చేసింది. తరువాతి నెలల్లో కొన్ని చిత్రాలు సందడి చేసినా, పొంగల్ స్థాయి మెరుపులు కనిపించలేదు. మళ్ళీ అలాంటి తళతళలు సెప్టెంబర్ లోనే దర్శనమిచ్చాయి. సెప్టెంబర్ లో మొదటగా 5వ తేదీన వచ్చిన చిత్రాల్లో 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) చిన్న సినిమాగా వచ్చి రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్ళు చూసింది. ఆ తరువాతి వారం అంటే సెప్టెంబర్ 12న వచ్చిన 'మిరాయ్' (Mirai) మరింత విజృంభించింది. ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
చివరి వారంలో వచ్చిన 'ఓజీ' (OG) 250 కోట్లకు పైగా గ్రాస్ చూసి, ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇలా సెప్టెంబర్ మాసంలో మొదట 'లిటిల్ హార్ట్స్' ఘన విజయం సక్సెస్ కు శ్రీకారం చుట్టింది. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా అని సినీ పండిట్స్ ఆశిస్తున్నారు. అక్టోబర్ 1న వచ్చిన 'ఇడ్లీ కొట్టు' (Idly Kottu) ఏ మాత్రం మురిపించలేక పోయినా మరుసటి రోజున జనం ముందు నిలచిన 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) విశేషాదరణ పొందుతోంది. ఇది చూసి అక్టోబర్ కూడా వసూళ్ళతో కళకళ లాడుతుందేమో అని సినీజనం ఆశిస్తున్నారు.
అక్టోబర్ 10వ తేదీన వచ్చే సినిమాల్లో భారీ చిత్రాలేవీ లేకపోయినా, కొన్ని ఆశలు చిగురింప చేస్తున్నాయి. 'శశివదనే, మటన్ సూప్, ఎర్రచీర, ఆన్ ద రోడ్, అరి' అనే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ వెలుగు చూడనున్నాయి. అక్టోబర్ 10వ తేదీనే ఇంగ్లిష్ నుండి డబ్బింగ్ అయిన 'ట్రాన్ - ఆరిస్' రిలీజవుతోంది. తరువాత అక్టోబర్ 16వ తేదీన వచ్చే 'మిత్రమండలి' కొన్ని ఆశలు రేపుతోంది. ప్రియదర్శి హీరోగా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల వారిని ఆకట్టుకోనుందని మేకర్స్ చెబుతున్నారు. దాంతో కాసింత బజ్ క్రియేట్ అయింది.
అక్టోబర్ 17వ తేదీన కిరణ్ అబ్బవరం నటించిన 'కె - ర్యాంప్' (K Ramp) జనం ముందుకు రానుంది. అదే రోజున సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందిన 'తెలుసు కదా' (Telusu Kada) కూడా పలకరించనుంది. వీటితో పాటే తమిళం నుండి అనువాదమవుతోన్న ప్రదీప్ రంగనాథన్ సినిమా 'డ్యూడ్' (Dude) విడుదలవుతోంది. ఈ సినిమాలన్నీ సినీలవర్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా, అక్టోబర్ 21న రశ్మిక మందణ్ణ నటించిన హిందీ మూవీ 'థామా' తెలుగులోనూ రిలీజ్ కానుంది.
ఇక అక్టోబర్ 31వ తేదీన రవితేజ 'మాస్ జాతర' (Mass Jathara) రానుంది. అలానే విష్ణు విశాల్ నటిస్తున్న తమిళ చిత్రం 'ఆర్యన్' కూడా అదే పేరుతో తెలుగులో విడుదల అవుతోంది. వీటన్నిటినీ మించి రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'బాహుబలి' సిరీస్ ఒకటిగా రూపొంది 'బాహుబలి ది ఎపిక్' (Baahubali The Epic) గా జనం ముందు నిలవనుంది. అక్టోబర్ ద్వితీయార్ధంలో కాసింత క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కాబట్టి జనవరి, సెప్టెంబర్ లాగే అక్టోబర్ కూడా బాక్సాఫీస్ ను కళకళలాడిస్తుందేమో చూడాలి.
Also Read: Vishnu Vishal: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'ఆర్యన్'....
Also Read: Jaya Shankar: ఏడేళ్ల అజ్ఞాతవాసానికి ప్రతిఫలం ‘అరి’.. దర్శకుడు చేసిన పరిశోధన ఇదే