సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ చుట్టూ ఇన్ని పంచాయతీలా.. పెద్ద ప్లానే ఇది.. 

ABN, Publish Date - Oct 25 , 2025 | 09:11 AM

తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌! తెలుగు సినిమారంగంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం, వాటి తరఫున ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పడిన సంస్థ. తెలుగు సినిమా ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తరుణంలో చాంబర్‌లో జరుగుతున్న వ్యవహారాలు సభ్యులను ఇబ్బంది పెడుతున్నాయి

Telugu Film Chamber Elections Issue

గడువు ముగిసినా ఎన్నికలు జరపని కార్యవర్గం.. నిరవధిక వాయిదాకు యత్నం

ఎన్నికలు జరపాలంటున్న మరోవర్గం

చాంబర్‌ స్థలంలో భారీ భవనానికి కసరత్తు

ఆర్థిక ప్రయోజనాల కోసమే వాయిదా

ప్రస్తుత కార్యవర్గంపై ప్రత్యర్థి వర్గం ఆరోపణ

మంత్రుల దగ్గరకు చాంబర్‌ పంచాయితీ..

తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(Telugu Film Chamber)! తెలుగు సినిమారంగంలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం, వాటి తరఫున ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పడిన సంస్థ. తెలుగు సినిమా ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న తరుణంలో చాంబర్‌లో (Chamber politics) జరుగుతున్న వ్యవహారాలు సభ్యులను ఇబ్బంది పెడుతున్నాయి. చాంబర్‌కు ఎన్నికలు జరగకుండా చూడటానికి ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవర్గం ఎన్నికలు జరిపి సంస్కరణలు చేపట్టాలని పట్టుదలగా ఉంది. రెండు వర్గాల పంచాయితీ ప్రభుత్వం వద్దకు చేరింది. ప్రస్తుత పాలక మండలి 9Film Chamber elections) ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేయించాలని చూస్తోందని, దీని వెనక అనేక వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని రెండోవర్గం ఆరోపణ.


ఎన్నికలకు తాత్సారం

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ బైలాస్‌ ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో స్టూడియో, ప్రొడ్యూసర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ రంగాలకు చెందిన సభ్యులు పాల్గొంటారు. వారంతా కలిసి రెండేళ్లకు కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకుంటారు. అధ్యక్షుడి పదవీకాలం మాత్రం ఏడాదే ఉంటుంది. ఒకో ఏడాది ఒకో రంగానికి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తారు. గత ఏడాది ప్రొడ్యూసర్స్‌ తరుపున దిల్‌రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది డిస్టిబ్యూటర్స్‌ రంగం నుంచి భరత్‌ భూషన్‌ ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం వస్తే అందులో ఈసారి అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్స్‌ రంగానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న కమిటీ ఎన్నికలు జరపకుండా తాత్సారం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్నికలను వాయిదా వేస్తే అర్థం చేసుకోవచ్చు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో, కొవిడ్‌ వచ్చినపుడు మాత్రమే ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకున్నా ఎన్నికలు వాయిదా వేయడంపై అనేక మంది సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కమిటీ పదవీకాలం జూలై 31తో ముగిసింది. కమిటీ పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవాలి. కొత్త కమిటీ సిద్ధంగా ఉండాలి. పాత కమిటీకి పదవిలో కొనసాగే అధికారం ఉండదు. ఈ ఏడాది జూన్‌ 30న ఛాంబర్‌ కార్యనిర్వాహకవర్గం చివరిసారి సమావేశం అయ్యింది. ఎన్నికలు నిర్వహించమని చాలామంది సభ్యులు కోరారు. కమిటీ ఏదీ తేల్చలేదు. దీనిపై సి.కళ్యాణ్‌, ఛాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.అశోక్‌ కుమార్‌, విజయేందర్‌రెడ్డి సహా అనేకమంది తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటికి ఎన్నికలు వాయిదా వేసే హక్కు లేదని వాదించారు. దీనితో సమావేశం వాయిదా పడింది. సమావేశం మినిట్స్‌ కావాలని అశోక్‌ కుమార్‌, మరి కొందరు అడిగినా స్పందన లేదు. దీనితో ఎన్నికలు నిర్వహించమని కోరుతూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మల నాగేశ్వరావుకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజుకు, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌కు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు. ‘కార్యనిర్వాహకవర్గం పదవీకాలాన్ని పొడిగించారా? అలాంటి నిర్ణయమేమైనా తీసుకుంటే సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. కమిటీ ఇవ్వడం లేదు. దానిపై నియంత్రణ ఉన్న ప్రభుత్వం ఇవ్వడం లేదు’ అని అశోక్‌ కుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 26న జనరల్‌ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సభ్యులకు సమాచారం అందింది. అసలు కమిటీకి ఈ సమావేశం నిర్వహించే అధికారమే లేదనేది కొందరి సభ్యుల వాదన. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని అశోక్‌ కుమార్‌ చెబుతున్నారు. ఎన్నికల నియమావళి ఒక సొసైటీ జనరల్‌ బాడీ సమావేశానికి ఎందుకు అడ్డం వస్తుందో అర్ధం కావటం లేదని వ్యాఖ్యానించారు.


అసలు కారణం వేరు (TFI)

ఛాంబర్‌ కార్యాలయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చాలా ముఖ్యమైన కూడలిలో ఉంది. దీని రియల్‌ ఎస్టేట్‌ విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది. ఫిల్మ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీ సుమారు 30 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని ఛాంబర్‌కు, నిర్మాతల మండలికి లీజ్‌కు ఇచ్చింది. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఒక చోట ఉంటే బావుంటుందనే ఉద్దేశంతో అప్పటి సినీ పెద్దలు ఇక్కడ అనేక భవనాలు నిర్మించారు. ఈ స్థలంలోనే ఒక దేవాలయం.. ఒక ఆఫీసు కాంప్లెక్స్‌.. సభ్యుల కోసం ఒక క్లబ్‌ మొదలైనవి నిర్మించారు. ఇప్పుడు లీజ్‌ కాలం పూర్తి కాకుండానే కార్యాలయాలను ఖాళీ చేయమని సొసైటీ ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టింది. భవంతులను కూల్చివేసి వాటి స్థానంలో బహుళ అంతస్థుల నిర్మాణాన్ని చేపట్టాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దానిని ఈ మధ్యకాలంలో సొసైటీ పాలక మండలి సభ్యులు కొందరు చురుకుగా ముందుకు కదిపారు. వారికి తోడు చాంబర్‌ కార్యవర్గంలోని కొందరు తోడయ్యారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో బహుళ అంతస్థుల భవంతిని నిర్మించటానికి అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతం ఉన్న భవనాలను కూల్చే ప్రతిపాదనను చాలామంది సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ భవంతులు కూల్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీనివల్ల ఛాంబర్‌కు కలిగే ప్రయోజనం తక్కువని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలను వాయుదా వేస్తే భవంతిపై నిర్ణయం తీసుకోవచ్చని కార్యనిర్వాహకవర్గం భావిస్తోందని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. చిత్రపురి కాలనీలో ఫ్లాట్ల విషయంలో కూడా ఛాంబర్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. కొత్త కార్యనిర్వాహకవర్గం ఏర్పాటైతే వివాదాస్పద నిర్ణయాలు బయటకు వచ్చి రకరకాల సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఎన్నికలు జరపకుండా ప్రస్తుత కార్యనిర్వాహకవర్గం తాత్సారం చేస్తోందని అంటున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 09:50 AM