Tollywood: వసూళ్ళు కురిపించిన మూడు చిత్రాలు

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:46 PM

సెప్టెంబర్ నెలలో విడుదలైన సినిమాల్లో 'ఓజీ, లిటిల్ హార్ట్స్, మిరాయ్' సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో టాలీవుడ్ కాస్తంత ఊపిరి పీల్చుకుంది.

September Movies Progress Report

నిరాశలో ఉన్న తెలుగు సినీజనం మొదటి నుంచీ సెప్టెంబర్ మాసంపై ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని సినిమాలు వసూళ్ళ వర్షాలు కురిపించాయి. మరికొన్ని షరామామూలే అన్నట్టు ఆకట్టుకోలేక పోయాయి. సెప్టెంబర్ నెలలో తెలుగు సినిమా ఎలా సాగిందో చూద్దాం.

'సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం...' అంటూ మొదటి నుంచీ ఊరించింది తొమ్మిదో నెల. సెప్టెంబర్ లో మొత్తం 20 సినిమాలు జనం ముందు నిలిచాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ పదకొండు కాగా, డబ్బింగ్ సినిమాలు తొమ్మిది వచ్చాయి. సెప్టెంబర్ 5వ తేదీన 'ఘాటీ (Ghaati), లిటిల్ హార్ట్స్ (Little Hearts), లవ్ యూ రా, ఆపద్బాంధవుడు' స్ట్రెయిట్ మూవీస్ గా వెలుగు చూశాయి. వాటితో పాటు 'ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ , మదరాసీ (Madarasi), ద బెంగాల్ ఫైల్స్' వంటి అనువాదాలూ అరుదెంచాయి. అనుష్క 'ఘాటీ' నిరాశ పరచింది. ఇక 'లిటిల్ హార్ట్స్' భలేగా ఆకట్టుకుంది. ఈ చిన్న సినిమా వసూళ్ళు బాగానే పోగేసింది. పెట్టుబడి కంటే మిన్నగా లాభాలను చూసింది 'లిటిల్ హార్ట్స్'.


సెప్టెంబర్ 12వ తేదీన తేజా సజ్జా 'మిరాయ్' (Mirai), బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'కిష్కింధపురి' (Kishkindha Puri)తో పాటు 'డెమన్ స్లేయర్' డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది. 'మిరాయ్' అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. 'మిరాయ్'లోని గ్రాఫిక్ వర్క్ చూసి బాలీవుడ్ బాబులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఓపెనింగ్స్ లోనే అదరహో అనిపించడంతో అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు ఫస్ట్ సోలో హిట్ గా నిలచింది. మంచు మనోజ్ కు 'మిరాయ్' విలన్ గా మంచి మార్కులు సంపాదించి పెట్టడం విశేషం! ఇక 'కిష్కింధపురి' డివైడ్ టాక్ తో సాగినా, కొన్నాళ్ళు వసూళ్ళు చూసింది.


సెప్టెంబర్ 19వ తేదీన 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసిఉండరు, దక్ష, బ్యూటీ, కర్మణ్యే వాధికారస్తే' స్ట్రెయిట్ తెలుగు మూవీస్ గా బరిలో దూకాయి. వీటితో పాటు 'భద్రకాళి, వీరచంద్రహాస, టనెల్, త్రికాలి' డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. అన్నీ నిరాశ పరిచాయనే చెప్పాలి. మొదటి నుంచీ అందరినీ ఊరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) సెప్టెంబర్ 25వ తేదీన జనం ముందు నిలచింది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ చూసిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అభిమానులను అలరిస్తూ సాగిన 'ఓజీ' నాలుగు రోజుల ఊపేసింది. 200 కోట్లకు పైగా గ్రాస్ చూడడంతో సినీజనం ఆనందంతో చిందులు వేశారు. ఈ సినిమా మరుసటి రోజున 'షిన్ చాన్' అనే యానిమేటెడ్ మూవీ వచ్చింది. కానీ, ఏ మాత్రం ఉనికిని చాటుకోలేక పోయింది. ఏది ఏమైనా సెప్టెంబర్ మాసం తెలుగు సినీజనానికి ఆనందం పంచిందనే చెప్పాలి. భారీ ఓపెనింగ్స్ చూపిన చిత్రాలుగా 'ఓజీ, మిరాయ్' నిలిచాయి. ఇక 'లిటిల్ హార్ట్స్' మాత్రం కథాబలం ఉంటే కాసులు కురుస్తాయని చాటింది. మరి అక్టోబర్ మాసం ఏ తీరున సాగుతుందో చూడాలి.

Also Read: Idly Kottu: ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ

Updated Date - Oct 01 , 2025 | 03:46 PM

Little Hearts Review: 'లిటిల్ హార్ట్స్' మెప్పించిందా 

OG Movie Review: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'ఓజీ' మూవీ రివ్యూ

Mirai Review: తేజ స‌జ్జా.. మిరాయ్ సినిమా రివ్యూ

Kishkindapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి' మెప్పించిందా..