Suriya 46: సూర్య, వెంకీ అట్లూరి మూవీ షూటింగ్ షురూ
ABN , Publish Date - Jun 11 , 2025 | 02:24 PM
సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 11న మొదలైంది.
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya), తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య 46వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ బుధవారం మొదలైంది.
సూర్య, వెంకీ అట్లూరి మొదటిసారి చేతులు కలపడంతో కేవలం ప్రకటనతోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు' అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో తమిళ, తెలుగు అభిమానులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. లోతైన భావోద్వేగాలను, వాణిజ్య అంశాలను మిళితం చేస్తూ ప్రస్తుత తరంలో గొప్ప కథకులతో ఒకరిగా పేరు పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. 'సార్' (Sir), 'లక్కీ భాస్కర్' (Lucky Baskhar) చిత్రాలు మంచి విజయాన్ని సాధించి, దర్శకుడిగా వెంకీ అట్లూరి స్థాయిని మరింత పెంచాయి.
'ప్రేమలు' సినిమాతో యువతరాన్ని ఆకట్టుకున్న మమిత బైజు (Mamitha Baiju) ఈ చిత్రంలో సూర్య సరసన నాయకగా నటిస్తోంది. ఈ మూవీతో రవీనా టాండన్ తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి వస్తున్నారు. రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'సార్, లక్కీ భాస్కర్' తర్వాత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్.. మరోసారి వెంకీ అట్లూరితో చేతులు కలుపుతున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా నిమిష్ రవి, కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిబద్ధత గల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: PaPa Trailer: తమిళ బ్లాక్ బస్టర్ డాడా.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
Also Read: Singer Mangli: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. సింగర్ మంగ్లీపై కేసు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి