Suresh Babu: మరింత ఆలస్యంగా 'ఈNఈ రిపీట్'

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:37 PM

ఐదు నెలల క్రితం ఈ నగరానికి ఏమైందీ సీక్వెల్ రూపుదిద్దుకోబోతోందనే ప్రకటన వచ్చింది. ఇప్పటికే అది సెట్స్ పైకి వెళ్ళలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ నుండి సురేశ్‌ బాబు తప్పుకున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ENE Repeat Movie

'ఈ నగరానికి ఏమైంది' (Ee Nagaraniki Emaindi)ని ఇవాళ కల్ట్ మూవీ అని కొందరు చెబుతున్నారు కానీ ఆ సినిమా ఫస్ట్ టైమ్ రిలీజ్ అయినప్పుడు ప్రతికూల ఫలితం లభించింది. అయితే నిదానంగా మూవీపై క్రేజ్ పెరిగింది. ఇక రీ-రిలీజ్ సమయానికి ఇది నిజంగానే కల్ట్ మూవీగా మారిపోయింది. మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ స్థాయి ఓపెనింగ్స్ ఫస్ట్ టైమ్ రిలీజ్ కు వచ్చి ఉంటే ఎంతో బాగుండేదని దర్శకుడు తరుణ్ భాస్కర్ వాపోతుండేవాడు.

'పెళ్ళిచూపులు' (Pelli Choopulu) తర్వాత తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) తెరకెక్కించిన 'ఈ నగరానికి ఏమైంది?' మేకింగ్ పరంగా డిఫరెంట్ మూవీ. యూత్ ను రిప్రజెంట్ చేసే పాత్రలను తరుణ్‌ భాస్కర్ బాగా డిజైన్ చేశాడు. ఊహకందని విధంగా రీ-రిలీజ్ లో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని 'ఈఎన్ఈ రిపీట్ ' పేరుతో 'ఈ నగరానికి ఏమైంది'కి సీక్వెల్ చేయాలని మేకర్స్ భావించారు. మొదటి చిత్రంలో నటించిన విశ్వక్ సేన్ (Vishwak Sen), సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను మరోసారి మ్యాడ్ నెస్ ను క్రియేట్ చేయబోతున్నారంటూ ఈ యేడాది జూన్ 29న ఓ ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డి. సురేశ్‌ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారని తెలిపారు. టైటిల్ లోగోనూ అదే రోజున రివీల్ చేశారు. ఈ సీక్వెల్ కు ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారని, ఒరిజినల్ కంపోజర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తారని చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అది అవ్వగానే షూట్ కు వెళతామని ప్రకటించారు.


కానీ దాదాపు ఐదు నెలలు గడిచినా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. కారణం... విశ్వక్ సేన్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటమేనని తెలుస్తోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం అనుదీప్ కె.వి. దర్శకత్వంలో 'ఫంకీ' మూవీలో నటిస్తున్నాడు. డిసెంబర్ లో వస్తుందని భావించిన ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 3 కి వాయిదా పడింది. దాంతో 'ఈఎన్ఈ రిపీట్' సెట్స్ పైకి వెళ్ళడానికి మరింత సమయం పట్టేలా ఉంది. అయితే... తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి సురేశ్‌ బాబు తప్పుకున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ముందు అనుకున్న బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం, విశ్వక్ సేన్ కు ఈ మధ్య కాలంలో అనుకున్న స్థాయి విజయాలు లేకపోయినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, దర్శకుడు తరుణ్‌ భాస్కర్ బడ్జెట్ విషయంలో రాజీ పడకపోవడం... వెరశీ ఈ ప్రాజెక్ట్ నుండి సురేశ్‌ బాబు తప్పుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగినందువల్ల సురేశ్‌ బాబు ప్రమేయం లేకుండానే ముందుకు పోవాలని నిర్మాతలు సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి భావిస్తున్నారట. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళి, అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ చేస్తే తప్ప సురేశ్‌ బాబు నిర్ణయం సబబు అవునో కాదో తెలియదు.

Also Read: Raviteja 76: టైటిల్ లీక్ ఇచ్చేశారుగా...

Also Read: Mithra Mandali: ఓటీటిలో 'కాంతార-2'కు దగ్గరగా.. 'మిత్ర మండలి'

Updated Date - Nov 10 , 2025 | 03:37 PM