Top Actress: అపోహలు తొలగిపోయాయంటున్న సమంత
ABN, Publish Date - Nov 22 , 2025 | 01:59 PM
సమంత పోస్ట్ చేసిన కండలు తిరిగిన బ్యాక్ ఫోజ్ ఫోటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అపోహలను పక్కన పెట్టి సమంత దేహ దారుఢ్యంపై పెట్టిన ఫోకస్ ను అందరూ అభినందిస్తున్నారు.
స్టార్ హీరోయిన్ లీగ్ నుండి సమంత (Samantha) తప్పుకున్నట్టుగానే అంతా భావిస్తున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన 'శాకుంతలం (Sakunthalam), ఖుషీ (Khushi)' వచ్చి రెండేళ్ళు గడించింది. ఈ యేడాది 'శుభం' (Subham) సినిమాలో సమంతా నటించినా... అది గెస్ట్ రోల్ మాత్రమే. తనే దానికి నిర్మాత కావడంతో ఆ చిన్న పాత్రను సమంత పోషించింది. అయితే గత యేడాది 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సీరిస్ లో యాక్షన్ హీరోయిన్ గా సమంత అభిమానులకు కన్నుల విందు చేసింది. బట్... ఆ సీరిస్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) మూవీని నిర్మిస్తూ, హీరోయిన్ గా చేస్తోంది.
సమంత జీవితంలో సినిమా ట్విస్టులను మించిన మలుపులు ఉన్నాయి. ప్రేమ, వివాహం విషయంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు సమంత సొంతం. అంతేకాదు... ఆరోగ్యం విషయంలోనూ సమంత ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూసింది. విశేషం ఏమంటే... సమంత ఓ కెరటం లాంటిది. పడిన ప్రతిసారి మళ్లీ లేచే తరంగం లాంటిది. లవ్ లైఫ్ లోనే కాదు... హెల్త్ విషయంలోనూ ఆమె ఆ విషయాన్ని నిజమని నిరూపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణగా ఓ ఫోటోను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడ్డ సమంత.... ఇప్పుడు మళ్ళీ ఫిట్ నెస్ విషయంలో తనకు తానే సాటి అనిపించుకుంది. జిమ్ లో ఆమె దిగిన ఆ ఫోటో చూసి నెటిజన్స్ నోరెళ్ళబెడుతున్నారు.
చాలామంది కష్టపడకుండా, తమ శరీర ఆకృతిని చూసుకుని 'జీన్స్ కారణం' అంటూ తృప్తిపడతారని, గతంలో తనూ అలానే అనుకునే దాన్నని సమంత తెలిపింది. అయితే... ఆ అపోహలను పక్కన పెట్టి సరైన వర్కౌట్స్ చేస్తే... తప్పకుండా అనుకున్న విధంగా మజిల్స్ ను పెంచవచ్చని ఆమె నిరూపించింది. కండలు తిరిగిన తన దేహాన్ని చూపిస్తూ... సమంత పోస్ట్ చేసిన ఆ ఫోటోలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సినీ జనం సమంతతో యాక్షన్ మూవీస్ చేయడానికి ఆలోచించనక్కర్లేదని భావిస్తున్నారు. నాగచైతన్య (Nagachaitanya) తో విడాకుల తర్వాత ఇప్పుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న సమంత త్వరలోనే ఏదో ఒక శుభవార్త చెబుతుందని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా... అందరిలానే తనను తాను తక్కువగా ఊహించుకున్న సమంత ఇప్పుడు దానిని అధిగమించి.... సత్తా చాటడం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. ఆమెలోని పట్టుదల చూస్తుంటే... తప్పకుండా ఇవాళ్టి స్టార్ హీరోయిన్లతో సమంత మరోసారి పోటీ పడగలదని పిస్తోంది. చూద్దాం... ఏం జరుగుతుందో!
Also Read: Manchu Manoj: ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో సంగీత రంగంలోకి..
Also Read: Raai lakshmi: స్పోర్ట్స్ అధికారుల హెరాస్‌మెంట్‌కు చరమగీతం..